Begin typing your search above and press return to search.

వామ్మో.. దేశంలో ఇన్ని సేవాసంస్థలా..?

By:  Tupaki Desk   |   1 Aug 2015 9:31 AM GMT
వామ్మో.. దేశంలో ఇన్ని సేవాసంస్థలా..?
X
రానున్న రోజుల్లో మరో మహా కుంభకోణం బయటకు వస్తుందా? తాజాగా అందుతున్న సమాచారాన్ని విశ్లేషిస్తే.. ఈ భావన కలగటం ఖాయం. మరేమీ చేయకుండా.. కేవలం సేవ చేయటం కోసం.. చుట్టు ఉన్న జనాల్ని ఉద్ధరించటం కోసం సేవా సంస్థలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తనకు అందించాలంటూ సుప్రీంకోర్టు ఆ మధ్య సీబీఐని ఆదేశించటం తెలిసిందే.

దీనిపై వర్క్ వుట్ చేసిన సీబీఐ.. ఇచ్చిన ప్రాధమిక సమాచారం వివరాలు చూస్తే.. కళ్లు తిరిగిపోవాలంతే. తెలంగాణ.. ఒడిశా.. కర్ణాటక రాష్ట్రాలను మినహాయించి 26 రాష్ట్రాల్లో ఉన్న సేవా సంస్థలు మొత్తం కలిపితే 31 లక్షలు ఉన్నట్లుగా తేలింది.

ఇక.. సమాచారం ఇవ్వాల్సిన మూడు రాష్ట్రాల్ని కలిపితే ఈ సంఖ్య మరింత భారీగా పెరగటం ఖాయం. అంతేకాదు.. రాష్ట్రాల్లో ఉన్న ఈ సేవా సంస్థలతో పాటు.. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న సేవా సంస్థలు మరో 82వేలు ఉన్నట్లుగా తేల్చారు.

అంటే.. మనదేశం మొత్తంలో 15లక్షల వరకు పాఠశాలు ఉంటే.. అందుకు రెట్టింపు సేవా సంస్థలు ఉండటం ఒక విశేషంగా చెప్పాలి. ఇక.. దేశంలోని ఆసుపత్రులతో పోలిస్తే.. సేవా సంస్థలు ఏకంగా 250 రెట్లు ఎక్కువగా తేలుతుంది.

అంతేకాదండోయ్.. దేశంలో ప్రతి 709 మంది ప్రజలకు ఒక పోలీస్ ఉంటే.. సేవా సంస్థలు మాత్రం ప్రతి నాలుగు వందల మందికి ఒక సేవా సంస్థ ఉండటం గమనార్హం. ఈ లెక్కన వీటికి వస్తే.. నిధులు.. కార్యకలాపాలు లాంటివన్నీ లెక్కించి సమగ్రంగా దర్యప్తు జరిపితే.. ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో..?