Begin typing your search above and press return to search.

మోడీ చేసిన మేలేంటో... క్లారిటీ ఇచ్చాడు

By:  Tupaki Desk   |   23 Oct 2017 10:54 AM GMT
మోడీ చేసిన మేలేంటో... క్లారిటీ ఇచ్చాడు
X
పెద్దనోట్ల రద్దు - ఏకీకృత పన్ను విధానం (జీఎస్టీ) వంటి వాటిని విఫల నిర్ణయాలుగా ప్రతిపక్షాలు - ఆర్థిక వేత్తలు పేర్కొంటున్న తరుణంలో ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆర్థిక సంస్కరణలపై తీసుకుంటున్న కీలక నిర్ణయాలు మున్ముందు మరిన్ని ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త‌న గుజ‌రాత్ ప్ర‌క‌ట‌న‌లో స్పష్టంచేశారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టివ‌ర‌కు మోడీజీ తీసుకున్న నిర్ణ‌యాల ఫ‌లితం ఏంట‌నేది అన్నివ‌ర్గాల్లోనూ స‌హ‌జంగానే ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. పెద్ద నోట్ల ర‌ద్దు జ‌రిగి దాదాపు ఏడాది కావ‌స్తున్న స‌మ‌యంలో దాదాపు మెజార్టీ ఆర్థిక‌వేత్తల‌...కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాల్లో గజిబిజి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూ లేనంత మందగమనానికి నెట్టబడిందని పేర్కొన్నారు.

పెద్దనోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థకు ప్రత్యేకించి అసంఘటిత రంగానికి భారీ నష్టాన్ని కలిగించిందని విశ్లేషిస్తున్నారు. జీఎస్టీ అమలుకు ముందు తలెత్తిన అనుమానాల వల్ల వృద్ధి రేట్‌ తగ్గిందంటూ ప్రభుత్వం ఇచ్చిన వివరణ వాస్తవ విరుద్ధంగా ఉందంటున్నారు. మందగమనం కొనసాగుతుండటంతో ప్రభుత్వ వివరణకు విలువలేకుండా పోయిందని చెప్తున్నారు. ఓవైపు ప్రభుత్వ ఖర్చులు పెరుగుతున్నా వృద్ధి రేట్‌ తక్కువగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ కేటాయింపుల్లో మొదటి నాలుగు నెల(ఏప్రిల్‌-జులై)ల్లోనే 38 శాతం ఖర్చయింది. గతేడాది ఇదే కాలంలో బడ్జెట్‌ లోని 33 శాతం మాత్రమే ఖర్చయింది. ప్రయివేట్‌ వినియోగంలో సంకోచం(తగ్గుదల) - పెట్టుబడులు మందగించడం వృద్ధిరేట్‌ తగ్గడానికి ప్రధాన కారణాలుగా అర్థమవుతోంది. కేంద్రం అనుసరించిన విధానాల వల్ల ప్రత్యేకించి ఉత్పాదక రంగాలైన వ్యవసాయం - తయారీ రంగం దెబ్బతిన్నాయి.

మ‌రింత లోతుగా విశ్లేషిస్తే...2013 - మార్చి 31న 1.56 లక్షల కోట్లుగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిలు లేదా నిరర్థక ఆస్తులు(ఎన్‌ పీఏ) 2017 - మార్చి 31 నాటికి 6.41 లక్షల కోట్లకు చేరుకున్నాయి(పునరుద్ధరించిన రుణాలు కాకుండా)..ఫలితంగా గత కొన్ని నెలలుగా బ్యాంకులు ఇచ్చే రుణాలు తగ్గిపోవడం కూడా వృద్ధి రేట్‌ పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. దీర్ఘకాలిక నిర్మాణాత్మక కారణాలకు తోడు నోట్లరద్దు వల్ల ద్రవ్య వినిమయం సంకోచించి కృత్రిక మందగమనానకి చోటు కల్పించింది. గాయపడ్డ ఆర్థిక వ్యవస్థకు పుండుమీద కారం చల్లినట్టయింది.

ఈ నిరాశ‌జ‌నక‌ సంద‌ర్భానికి అధిక జీఎస్టీ రేట్లు కూడా తోడ‌య్యాయ‌ని అంటున్నారు. ఈ నిర్ణ‌యం ఫ‌లితంగా ఆర్థిక వృద్ధి మందగించేందుకు కారణమయిందంటున్నారు. 2017-18 మొదటి త్రైమాసికంలో(ఏప్రిల్‌-జూన్‌) వృద్ధిరేట్‌ 5.7 శాతంగా నమోదైంది. ఇది మూడేళ్ల‌ కనిష్ఠం కావ‌డం గ‌మ‌నార్హం. ఇదే త్రైమాసికంలో జీడీపీ కరెంట్‌ ఖాతాలోటు(సీఏడీ) 2.4 శాతంగా నమోదైంది. ఇది నాలుగేళ్ల‌ గరిష్ఠం. 2014లో ఎన్‌ డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ఉపాధి మందగించడం కూడా దేశ వృద్ధిరేట్‌ తగ్గడానికి మరో కారణమైంది. దేశంలో వరుసగా రెండేళ్లు కరువు నెలకొన్న స్థితిలోనూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలుకు ఎన్‌డీఏ ప్రభుత్వం డిమాండ్‌ ను కాదని వనరులను ప్రాతిపదికగా తీసుకుంటున్న విషయం గమనార్హమ‌ని అంటున్నారు.

మ‌రోవైపు ప్ర‌ధాని మోడీ త‌న పంథాను కొన‌సాగిస్తాన‌ని తెలిపారు. ``ఇటీవలి గణాంకాలు చూస్తే - ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగుతోందన్న విషయం అర్థమవుతోంది. బొగ్గు - విద్యుత్ - సహజవాయువు వంటి వాటి ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. విదేశీ పెట్టుబడులు దేశంలో రికార్డుస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. విదేశీ మారక నిల్వలు 30వేల కోట్ల డాలర్ల నుంచి 40వేల కోట్ల డాలర్లకు పెరిగాయి. ఆర్థిక సంస్కరణల అమలుకు మేం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం. అలాంటి చర్యలు ఇకముందు కూడా కొనసాగిస్తాం. సంస్కరణలు చేపడుతూనే, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కాపాడుతాం. ఆర్థికాభివృద్ధికి - పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటాం`` అని మోడీ గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌లో తెలిపారు.