Begin typing your search above and press return to search.

ఇండియాలో పోకేమాన్ చేసిన ఫస్టు యాక్సిడెంట్

By:  Tupaki Desk   |   27 July 2016 10:43 AM GMT
ఇండియాలో పోకేమాన్ చేసిన ఫస్టు యాక్సిడెంట్
X
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పోకేమాన్ గేమ్ ఎంత కిక్ ఇస్తోందో అంతే తేడా చేస్తోంది కూడా. సుమారు 30 దేశాల్లో ‘పోకెమాన్’ మొబైల్ గేమ్ వేలం వెర్రిగా మారిపోయిన క్రమంలో ప్రమాదాల బారినపడుతున్న వారి సంఖ్య విపరీతంగా ఉంది. మన దేశంలో ఈ గేమ్ ఇంకా అధికారికంగా విడుదలకానప్పటికీ, దీనిపై మోజు కనపరుస్తున్న వారు, ఏదోఒక విధంగా డౌన్ లోడ్ చేసుకుని ఆడేస్తున్న వారూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ పోకేమాన్ ఫీవర్ తోనే ఆట మొదలుపెట్టిన ముంబైకు చెందిన ఇరవై ఆరేళ్ల జబ్బీర్ అలీ ప్రమాదానికి గురయ్యాడు. ఇండియాలో ఇదే తొలి పోకేమాన్ యాక్సిడెంట్.

జబ్బీర్ తన ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కారు నడుపుతూ, ‘పోకెమాన్’ ఆడుతూ ప్రమాదానికి గురయ్యాడు. ఒక ఆటో వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో కారు దెబ్బతింది. దీంతో కారు గ్యారేజ్ కు పోవడం...రూ.20 వేల బిల్లు అయిందని స్వయంగా జబ్బీర్ తన సోషల్ మీడియా పోస్ట్ లో చెప్పాడు. నిన్న తన కారులో ఇంటికి వెళ్లే సమయంలో ఈ గేమ్ ఆడానని, మొదటిసారే ఇంత నష్టం తెచ్చిందని ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం తన ఫొటోను సోషల్ మీడియాలో పెట్టానని చెప్పాడు. కారు నడుపుతూ, ‘పోకేమాన్’ గేమ్ ఆడటం వల్ల తనకు వచ్చిన ప్రతిఫలం ఇదీ అంటూ తన దెబ్బతిన్న కారు ఫొటోను పోస్ట్ చేశాడు. కాగా, ముంబైలో ‘పోకేమాన్’ నమోదు చేసిన తొలి యాక్సిడెంట్ ఇదే కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

పోకేమాన్ ఆట దెబ్బ రుచి చూసిన జబ్బీర్ ఇప్పుడు అందరికీ సుద్దులు చెబుతున్నాడు. ఆట మాయలో పడి అనర్థాలు తెచ్చుకోవద్దంటున్నాడు. సరదా పడినా కూడా వీలయినంత జాగ్రత్తగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చని అతడు చెప్పాడు. ఇప్పటికే ఈ గేమ్ కారణంగా జపాన్, అమెరికాలో పెద్ద మొత్తంలో ప్రమాదాలు జరుగుతుండగా ముంబయిలో తొలి కేసు నమోదైంది.