Begin typing your search above and press return to search.

చైనా జర్నలిస్టులను బహిష్కరించిన మోడీ

By:  Tupaki Desk   |   24 July 2016 6:07 AM GMT
చైనా జర్నలిస్టులను బహిష్కరించిన మోడీ
X
ఇండియా - చైనాల మధ్య కోల్డ్ వార్ మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్ లో పనిచేస్తున్న ముగ్గురు చైనా జర్నలిస్టులను ప్రధాని మోడీ ఇండియా నుంచి బహిష్కరించడం సంచలనంగా మారింది. చైనాకు చెందిన అధికార న్యూస్ ఏజన్సీ 'క్సిన్హువా' తరఫున ఇండియాలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను దేశం నుంచి వెళ్లిపోవాలని మోడీ సర్కారు ఆదేశించింది. వీరు ముగ్గురూ దేశ భద్రతాంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారని నిఘా వర్గాలు పసిగట్టడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

అరుణాచల్ ప్రదేశ్ భూభాగం... సరిహద్దుల్లో చొరబాట్లు.. ఇతర అంశాలపై తరచూ చైనా మీడియాలో భారత్ కు వ్యతిరేకంగా కథనాలొస్తున్నాయి. చైనా విలేకరులు భారత్ లో పనిచేస్తున్నారు. వీరు కేవలం వార్తలకే పరిమితం కాకుండా భారత దేశ భద్రతకు సంబంధించిన రహస్య అంశాలను కూడా సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ కారణంగానే వారిపై మోడీ సీరియస్ యాక్షన్ తీసుకున్నారని తెలుస్తోంది. చైనాకు చెందిన 'జిన్హువా' న్యూస్ ఏజెన్సీ తరుఫున ఢిల్లీలో పనిచేస్తున్న బ్యూరో చీఫ్ వూ క్వింగ్ - ముంబైలోని రిపోర్టర్లు లూ తాంగ్ - షీ యోగ్యాంగ్ లు నిషేధిత ప్రాంతాలను సందర్శించడం - అక్కడి సమాచారాన్ని సేకరించడం వంటి పనులను వీరు చేస్తున్నట్లు తేలింది. దీంతో జూలై 31లోగా దేశం విడిచి పెట్టాలని వారిని ఆదేశించారు.

కాగా చైనా జర్నలిస్టులకు దేశ బహిష్కరణ శిక్ష విధించడం ఇదే తొలిసారి. వీరి కదలికలపై నిఘా పెట్టిన అధికారులు - ఓ నివేదికను ఇవ్వగా, దీన్ని పరిశీలించిన హోం శాఖ ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. కాగా, ఈ ముగ్గురు సీనియర్ జర్నలిస్టుల వీసా గడువు ముగిసిపోగా, దాన్ని పొడిగించుకుని ఇండియాలో ఉంటున్నారని అధికారులు పేర్కొన్నారు. విలేకరుల బహిష్కరణపై చైనా విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు. అయితే.. దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారాల్లో ఇంకా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ పొరుగుదేశంతో ఘర్షణలు పెంచుకోరాదన్న సదుద్దేశంతోనే మోడీ వీరిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారని తెలుస్తోంది. లేదంటే ఇంకా కఠిన శిక్షలు వేయడానికి అవకాశం ఉండేది.