నమ్మకంలో మోదీ ప్రభుత్వానిది మూడో స్థానమట!

Mon Nov 20 2017 16:29:27 GMT+0530 (IST)

అంతర్జాతీయంగా వివిధ రంగాల్లో దేశ ప్రతిష్ఠను మారుమోగిస్తున్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అరుదైన మరో ఘనత సొంతం చేసుకుంది. దేశీయంగానూ అనేక సంస్కరణలకు తెరతీసి ఇప్పటికే ప్రజలకు చేరువకావడంలో గత ప్రధానులకు భిన్నంగా వ్యవహరిస్తున్న మోదీ.. తన ప్రయత్నంలో సఫలమయ్యారనే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వారి విశ్లేషణలను నిజం చేస్తూ ఓ అంతర్జాతీయ సంస్థ సైతం తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రభుత్వాన్ని ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారన్న విషయమై ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ (ఓఈసీడీ) తాజాగా ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విడుదల చేసింది.ఈ ఫలితాల్లో మోదీ సర్కారు టాప్-3 స్థానాన్ని దక్కించుకుంది. ఈ సందర్భంగా "ప్రజలు అత్యధికంగా నమ్మిన ప్రభుత్వాల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కూడా ఉంది. ఇండియాలోని మూడొంతుల మంది తమ దేశ ప్రభుత్వంపై నమ్మకం ఉంచారు. ప్రభుత్వం చేపట్టిన అవినీతి వ్యతిరేక విధానం - పన్ను సంస్కరణలు ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని మరో మెట్టు ఎక్కించాయి" అని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రశంసించింది. దేశంలో సుమారు 74 శాతం మంది మోదీ ప్రభుత్వంపై నమ్మకముంచారని తెలిపింది.

ఇక ఈ జాబితాలో తొలిస్థానంలో స్విట్జర్లాండ్ ఉండగా రెండో స్థానంలో ఇండొనేషియా ఉంది. ఇండియా తరువాత లక్సెంబర్గ్ - నార్వే - కెనడా - టర్కీ - న్యూజిలాండ్ - ఐర్లాండ్ - నెదర్లాండ్స్ - జర్మనీ - ఫిన్ ల్యాండ్ - స్వీడన్ - డెన్మార్క్ - ఆస్ట్రేలియాలు నిలిచాయి. ప్రజలకు నమ్మకమైన ప్రభుత్వంగా మోదీ సర్కార్ ఘనత సాధించడంతో బీజేపీ నాయకులకు ఎన్నికల వేళ మరింత ప్రోత్సహించినట్లైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.