Begin typing your search above and press return to search.

ఏపీలో రూ.33లక్షల కోట్ల నిధి దొరికింది

By:  Tupaki Desk   |   27 July 2016 4:48 AM GMT
ఏపీలో రూ.33లక్షల కోట్ల నిధి దొరికింది
X
‘‘ప్రతి ప్రతికూలతలోనూ ఒక అనుకూలత ఉంటుంది. కానీ.. అదేమిటన్నది తెలుసుకోవటమే ముఖ్యం. ప్రకృతి అందరిని ఒకేలా చూస్తుంది. ఎవరినీ అన్యాయం చేయదు’’ లాంటి మాటలు చాలామంది చెబుతుంటారు. ఇలాంటి మాటలకు కొందరు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు. అలాందేమీ లేదంటారు. కానీ.. అలాంటి నిరాశలో నిజం లేదని మరోసారి తేలిపోయింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఎంతో అన్యాయం జరిగిందని.. హైదరాబాద్ మహానగరం లాంటిది కోల్పోవటం వల్ల జరిగే నష్టాన్ని పూడ్చటం సాధ్యం కాదని చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు.

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్నట్లుగా.. ఇంతకాలం బయటకు రాని ఒక కొత్త విషయం తాజాగా బయటకు వచ్చింది. ఏపీలోని కేజీ బేసిన్ లో సహజ వనరుల భారీ నిధి ఒకటి బయటపడింది. శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే గ్యాడ్ హైడ్రేట్స్ గా చెప్పాలి. ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే గ్యాస్ నిక్షేపం. అది కూడా అత్యంత అరుదైన గ్యాస్ నిక్షేపంగా చెప్పాలి. ఈ నిక్షేపలంలో దాదాపు 14 లక్షల కోట్ల ఘనటడుగుల గ్యాస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.33లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు.

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఓఎన్ జీసీ తో కలిసి అమెరికా జియోలిజికల్ సర్వే ఈ ఆపార నిధిని కనుగొంది. ఏపీ పరిధిలోని కృష్ణా-గోదావరి బేసిన్ లోని మందపాటి ఇసుక రిజర్వాయర్లలో ఈ గ్యాస్ హైడ్రేట్ నిల్వలు ఉన్నాయని.. వీటిని వెలికి తీసేందుకు సాధ్యమ్యే అంశంగా చెబుతున్నారు. సహజ వాయువు.. నీరు కలిసిపోయి ప్రకృతి సిద్ధంగా గడ్డ కట్టి మంచు రూపంలో ఉండటాన్ని గ్యాస్ హైడ్రేట్లుగా పరిగణిస్తారు. వాస్తవానికి ఈ తరహా గ్యాస్ హైడ్రేట్లు మహా సముద్రాల్లో.. ఖండాల అంచున.. ధ్రువ ప్రాంతాల్లో కనిపిస్తాయి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ గ్యాస్ హైడ్రేట్లు పలు ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించినా.. అవి ఏ రూపంలో ఉన్నాయి.. వాటిని వెలికి తీయటం సాధ్యమా? అన్న సమస్య ఉంది. తాజాగా కనుగొన్న కేజీ బేసిన్ లోని గ్యాస్ హైడ్రేట్లు వెలికి తీతకు వీలుగా ఉండటం.. ఏపీకి లాభించే అంశంగా చెప్పాలి. కేజీ బేసిన్ లోని 982.. డీ3.. డీ6.. డీ9 బ్లాకుల్లో ఈ గ్యాస్ హైడ్రేట్స్ నిక్షేపాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఇవి రిలయన్స్ గ్యాస్ క్షేత్రమైన కేజీడీ 6 బ్లాక్ కు 30 కిలో మీటర్ల నైరుతిగా ఉన్నాయి. మరో కీలకాంశం ఏమిటంటే.. రిలయన్స్ గ్యాస్ ఇండస్ట్రీస్ 2002లో కనుగొన్న అతి భారీ గ్యాస్ క్షేత్రంలో పేర్కొన్న గ్యాస్ కంటే కూడా తాజాగా కనుగొన్న కేజీ బేసిన్ గ్యాస్ హైడ్రేట్లు పది రెట్లు అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఏపీ అభివృద్ధికి తాజాగా కనుగొన్న గ్యాస్ హైడ్రేట్స్ ఎంతోకొంత సాయం చేస్తాయనటంలో సందేహం లేదని చెప్పాలి.