Begin typing your search above and press return to search.

భార‌త్‌ కు బ‌లం ఇచ్చిన చైనా

By:  Tupaki Desk   |   30 Aug 2015 10:32 AM GMT
భార‌త్‌ కు బ‌లం ఇచ్చిన చైనా
X
చైనా పతనం ఇండియాకి కలిసివస్తోంది. ఒక్కో అడుగు వెనక్కు వేస్తూ... వృద్ధి రేటును కోల్పోతున్న చైనా ఆర్థిక వ్యవస్థ... ఐసీయూలో జాయిన్ అవడానికి రెడీ అవుతోంది. ఇదే సమయంలో ఇండియా జీడీపీ ఊపందుకుంటూ ప్రపంచ దేశాలను ఆకట్టుకుంటోంది. నెమ్మదిస్తున్న పారిశ్రామిక ఉత్పత్తి... అమ్ముడుపోని అనేక కమర్షియల్, రెసిడెంటల్ నిర్మాణాలు... వీటికి తోడు ఒక్క రోజులోనే ఏకంగా 8 శాతం మేర పతనమైపోతున్న స్టాక్ మార్కెట్లు. మొత్తంగా చైనా జీడీపీ మీద ప్రభావం చూపుతున్నాయి. దీంతో చైనా చతికిల పడుతూ.. సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ టైటిల్ ని నెమ్మదిగా చేజార్చుకుంటోంది. అత్యంత వేగంగా పరుగులు పెట్టిన డ్రాగన్ కంట్రీ ఆర్థిక వ్యవస్థ... అంతే వేగంగా సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోతోంది.

మొన్నటి వరకూ సూపర్ ఫాస్ట్ గా ఎదిగిన చైనా... ఇప్పుడు ఉన్నట్టుండి రివర్స్ గేర్ తీసుకోవడం ఇండియాకు కలిసివస్తోంది. నెమ్మదిగా మళ్లీ ధనిక దేశం దిశగా నడుస్తోన్న భారత్ కు... చైనా తడబాట్లు బూస్ట్ ఇస్తున్నాయి. ప్రపంచ ఫ్యాక్టరీగా పేరుపొందిన చైనా స్థానాన్ని భర్తీ చేయగల సత్తా... ఇండియాకు మాత్రమే ఉందని ఇప్పటికే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్బీఐ గవర్నర్ రఘరాం రాజన్ లు అన్నారు. ఆర్థిక వేత్తలు కూడా చైనాని రీప్లేస్ చేయగల దేశం ఇండియానేని అంటున్నారు. దీనికి అనేక కారణాలనే చెబుతున్నారు.

చైనాలో తయారైన వస్తువులకు ప్రపంచ మార్కెట్ లో డిమాండ్ తగ్గిపోయింది. దీంతో ఫ్యాక్టరీల్లోనే... తయారైన వస్తువుల స్టాక్ పేరుకుపోతోంది. పెట్టుబడులు నిలిచిపోతున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయటబడానికే... చైనా యువాన్ విలువను తగ్గించి... పరోక్షంగా వస్తువుల ధరలను తగ్గించింది. ఈ చర్యతో కరెన్సీ యుద్ధానికి మరోసారి తెరలేపిన చైనా... వస్తువులను అమ్ముకోవడంలో మాత్రం విజయం సాధించలేదని అంచనా. ఇదే సమయంలో చైనా కంటే నాణ్యత ఉన్న ఇండియన్ వస్తువులకు డిమాండ్ పెరుగుతోందని చెబుతున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఒక వేళ విదేశాల్లో ఇండియన్ వస్తువులు అమ్ముడుపోకపోయినప్పటికీ... లోకల్ మార్కెట్ లో అయినా సేల్ అయిపోతాయని అంటున్నారు. అయితే, లోకల్ డిమాండ్ ఛాన్స్ చైనాకు మాత్రం లేదు.

చైనాలో లోకల్ డిమాండ్ 40 శాతమే కాగా... ఇండియాలో తయారైన వస్తుకులకు ఇక్కడ డిమాండ్ 70 శాతం ఉంటుంది. అమ్ముడిపోని వస్తువుల కారణంగా చైనా అప్పుల భారం కూడా పెరిగింది. అది కూడా ప్రమాద ఘంటికలు మోగే రేంజికి చేరింది. ఈ విషయంలో ఇండియా ది బెస్ట్ గా ఉంది. గోస్ట్ సిటీల పేరుతో డ్రాగన్ కంట్రీలో నిర్మాణాలు ఖాళీగా ఉండి దేశ భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేశాయి. దీనికి తోడు అక్కడి ప్రజల పని శక్తి పడిపోతూ ఉంది. యువకుల సంఖ్య తగ్గుతూ... ముసలివారి శాతం పెరుగుతూ ఉంది. చైనాతో పోల్చితే ఇండియాలోనే ఇప్పుడు యువకుల సంఖ్య ఎక్కువగా ఉంది. 2050 నాటికి చైనాలో పనిచేయగల వారి శాతం 67కి పడిపోతుందని అంచనా కాగా... ఇదే సమయంలో ఇండియాలో 94 శాతంగా ఉంటుందని చెబుతున్నారు ఆర్థిక రంగ నిపుణులు.

ప్రస్తుతం చైనా వృద్ధి రేటు మారింది. ఇకపై రెండెంకల వృద్ధిని నమోదు చేసే అవకాశం కనిపించడం లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంటున్నారు. చైనా ఆర్థిక వ్యవస్థకు పోటీనిస్తోన్న ఇండియా జీడీపీ పరుగులు పెడుతూ... డ్రాగన్ కంట్రీ ఎకానమీని రీప్లేస్ చేయగల సత్తా ఉందనే సంకేతాలు ఇస్తోంది.

అయితే అవ‌కాశాలు అందిపుచ్చుకోవ‌డం, పోటీ త‌త్వానికి త‌గిన‌ట్లు ప‌నిచేయ‌డం వంటి ష‌ర‌తుల‌కు త‌గ్గట్లు ముందుకువెళితేనే భార‌త్‌కు భ‌విష్య‌త్ అనేది తెలిసిందే క‌దా.