Begin typing your search above and press return to search.

మోడీ అనుచరులు మటాష్

By:  Tupaki Desk   |   24 May 2016 9:53 AM GMT
మోడీ అనుచరులు మటాష్
X
కేంద్రంలో తిరుగులేని మెజారిటీతో అధికారం చేపట్టిన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి రెండు రోజుల్లో రెండేళ్ల పాలన పూర్తిచేసుకోబోబతున్నారు. ప్రజలకు "అచ్చే దిన్" తీసుకువస్తామన్న హామీతో గద్దెనెక్కిన మోదీ సర్కారు - ప్రజల విషయంలో ఏమో కానీ, మార్కెట్ వర్గాలకు మాత్రం సంతృప్తిని కలిగించలేకపోయింది. ముఖ్యంగా మోడీకి ముఖ్యమైన వ్యక్తులుగా పేరొందిన అదానీ - అంబానీలకు కూడా ఏమాత్రం లాభం చేకూరకపోగా తీవ్ర నష్టాలు ఎదురయ్యాయి.

స్టాక్ మార్కెట్ గణాంకాల ప్రకారం - ఇండియాలోని టాప్ 15 కార్పొరేట్ గ్రూపులు ఈ రెండేళ్లలో సరాసరిన 17 శాతం నష్టపోయాయి. ఈ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 31 లక్షల కోట్లు కాగా, మొత్తం బీఎస్ ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 96 లక్షల కోట్లతో పోలిస్తే, దాదాపు మూడో వంతు. మోదీ అధికారాన్ని స్వీకరించిన మే 26, 2014న ఈ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 37.44 లక్షల కోట్లుగా ఉండగా, ఆపై తొలి ఏడాది పూర్తయ్యే సరికి ఇది రూ. 36.5 కోట్లకు తగ్గింది. ఇండియాలో లీడింగ్ కార్పొరేట్ గ్రూపులుగా ఉన్న అంబానీలు - అదానీలు - జిందాల్ లు నిర్వహిస్తున్న సంస్థలన్నీ నష్టపోగా, అనిల్ అగర్వాల్ - అనిల్ అంబానీల సంపద 51 శాతం మేరకు హరించుకుపోయింది. ప్రపంచవ్యాప్తంగా కమోడిటీ మార్కెట్ల పతనం కారణంగా ఆదాయం తగ్గడం, కీలకమైన సంస్కరణల అమలులో ఆలస్యం - విదేశీ ఇన్వెస్టర్లు దూరం కావడం వంటి కారణాలతో ప్రముఖ పారిశ్రామికవేత్తల సంస్థలు భారీగా నష్టపోయాయి.

ఇదే సమయంలో ఐటీ - ఫార్మా - కన్స్యూమర్ గూడ్స్ తదితర రంగాల్లోని కంపెనీలు లాభపడగా, సంప్రదాయ భారత ఆర్థిక సామ్రాజ్యాలుగా ఉన్న మెటల్స్ - పవర్ - ఇన్ ఫ్రా - ఎనర్జీ రంగాల్లోని కంపెనీలు నష్టపోయాయి. ఇక ఈ రెండేళ్లలో వ్యక్తిగత లాభనష్టాలను పరిశీలిస్తే, ముఖేష్ అంబానీ సంస్థల విలువ రూ. 3.56 లక్షల కోట్ల నుంచి రూ. 3.03 లక్షల కోట్లకు తగ్గి 14.97 శాతం దిగజారింది. ఓం ప్రకాష్ జిందాల్ కంపెనీల విలువ రూ. 74.23 వేల కోట్ల నుంచి రూ. 51.30 వేల కోట్లకు తగ్గి 31 శాతం దిగజారింది. అదానీ సంస్థల మార్కెట్ కాప్ రూ. 1.17 లక్షల కోట్ల నుంచి రూ. 57.15 వేల కోట్లకు తగ్గి అత్యధికంగా 51.32 శాతం నష్టపోయింది. లాభపడ్డ కంపెనీల్లో పిరామల్ అజయ్ (109 శాతం), షాపూర్జీ పల్లోంజీ (163 శాతం), బిర్లా సీకే (81 శాతం) తదితర కంపెనీలున్నాయి. ఈ పతనం, ఇండియాలో రెండో అతిపెద్ద ధనవంతుడి హోదాను అనుభవించిన గౌతమ్ అదానీని ఇప్పుడు ఐదో స్థానానికి పరిమితం చేసింది. అనిల్ అంబానీ టాప్-20 ధనవంతుల జాబితా నుంచి స్థానం కోల్పోయేలా చేసింది. మొత్తానికి మోడీ ప్రభుత్వంలో ముఖ్య పారిశ్రామికవేత్తలంతా దారుణంగా నష్టపోయారు.