ఇండియా టుడే గ్రాఫ్స్: గెలిచేది ఈపార్టీనే..

Wed Feb 20 2019 10:39:18 GMT+0530 (IST)

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీకి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్నీ సర్వేల్లోనూ వైసీపీ గాలి వీస్తోందని తేటతెల్లమవుతోంది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ మరింత పెరిగిందని తాజాగా ఇండియా టుడే సర్వేలో తేలింది.జాతీయ స్థాయిలో విశ్వసనీయత గల ఇంగ్లీష్ చానెల్ ఇండియా టుడే తాజాగా ఏపీ రాజకీయ పరిస్థితులపై సర్వేను బయటపెట్టింది. ఆరు నెలల క్రితంతో పోలిస్తే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ మరింత పెరిగినట్టు తేల్చింది. ఆరు నెలల కింద జగన్ కు 43శాతం మంది ఏపీలో మద్దతు తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్ లో ఈ పరిస్థితి ఉంది. ఈ ఏడాది ప్రస్తుత ఫిబ్రవరిలో ఇండియా టుడే సర్వే చేయగా జగన్ కు మద్దతు శాతం 45కు పెరిగింది. జగన్ గ్రాఫ్ లో రెండు శాతం పెరుగుదల నమోదైనట్లు ఇండియాటుడే చానెల్ పేర్కొంది.

ఇదే సమయంలో ఏపీ సీఎం.. అధికార పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి గ్రాఫ్ రెండు శాతం పడిపోయిందని ఇండియా టుడే వివరించింది. గతేడాది సెప్టెంబర్ లో బాబుకు లభించిన మద్దతు 38శాతంగా ఉండగా.. ఇప్పుడది 36శాతానికి పడిపోయిందని పేర్కొంది.

ప్రస్తుత ఫిబ్రవరి నెలలో ఏపీలో 45శాతం మంది ప్రజల మద్దతు జగన్ కు ఉండగా.. 36శాతం మంది మద్దతు మాత్రమే చంద్రబాబుకు ఉందని ఇండియా టుడే తాజాగా ప్రకటించింది. వీరిద్దరి మధ్య వ్యత్యాసం 9శాతం అని గణంకాలు విడుదల చేసింది.

ఇక జనసేనాని పవన్ కు గతేడాది సెప్టెంబర్ లో 5శాతం ఏపీ ప్రజలు మద్దతు పలకగా.. ప్రస్తుత ఫిబ్రవరిలో మద్దతు 4శాతానికి పడిపోయింది. ఇతరులకు ప్రస్తుతానికి 15శాతం మంది ప్రజలు మద్దతు పలుకుతున్నట్టు తమ సర్వేలో తేలినట్టు ఇండియా టుడే వివరించింది.

2014 ఎన్నికల్లో అధికార టీడీపీ - ప్రతిపక్ష వైసీపీల మధ్య ఓట్ల శాతం తేడా అత్యల్పం. కానీ జగన్ ఈసారి తొమ్మిది శాతం లీడ్ లో ఉండడంతో ఏపీలో జగన్ గెలుపు లాంఛనమేనని ఇండియా టుడే అభిప్రాయపడింది.