Begin typing your search above and press return to search.

సిలికాన్ వ్యాలీ ని తలదన్నే రోజు త్వరలోనే

By:  Tupaki Desk   |   3 Oct 2015 5:30 PM GMT
సిలికాన్ వ్యాలీ ని తలదన్నే రోజు త్వరలోనే
X
చైనాను ఏ విషయంలో అయినా అధిగమించడం భారత్‌ కు ఇప్పట్లో సాధ్యమయ్యే విషయం కాదని సాక్షాత్తూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ స్వయంగా ప్రకటించి ఉండవచ్చు కానీ ఒక రంగంలో మాత్రం చైనా మనతో పోటీ పడలేకపోవచ్చని స్పష్టమవుతోంది. 160 కోట్ల జనాభాతో దూసుకుపోతున్న చైనా పట్ల సిలికాన్ వ్యాలీలోని సాఫ్ట్ వేర్ కంపెనీలకు అత్యంత ఆకర్షణ ఉండటం ప్రస్తుతానికి నిజమే అయినా సమీప భవిష్యత్తులో ప్రపంచానికి మరో సిలికాన్ వ్యాలీగా భారత్ రూపొందనున్నది. మరో రకంగా చెప్పాలంటే.. సిలికాన్ వ్యాలీని తలదన్ని యావత్ ప్రపంచానికే సరికొత్త సాఫ్ట్ వేర్ కేంద్రబిందువు గా భారత్ ఆవిర్భవించే అవకాశాలున్నాయి.

దాదాపు 30 ఏళ్ల తర్వాత కాలిఫోర్నియా సందర్సించిన తొలి భారత ప్రధాని నరేంద్రమోదీ అక్కడి సిలికాన్ వ్యాలీలోని సాఫ్ట్ వేర్ దిగ్గజాల ప్రధాన కార్యాలయాలను సందర్శించినప్పుడు భారత్ భవిష్యత్ చిత్రపటాన్ని అమెరికా మీడియా సరిగానే అంచనా వేసింది. భారత్ భవిష్యత్ గతవారం అక్కడే పూర్తిగా ప్రదర్శితమైందని యుఎస్ ఎ టుడే పత్రిక పేర్కొంది. సిలికాన్ వ్యాలీలోని ఫేస్‌ బుక్ - గూగుల్ - టెస్లా వంటి దిగ్గజ కంపెనీల సీఈఓలతో భేటీ అయిన మోదీ వారిని అమితంగా ఆకట్టుకున్నారు. చైనాలో ఫేస్‌ బుక్ - గూగుల్ సర్వీసులను నిషేధించిన నేపథ్యంలో వీటి భవిష్యత్ ముఖచిత్రం భారతదేశమేనని మోదీ పర్యటన సూచించింది.

మోదీ ఆహ్వానం మేరకు అప్పటి కప్పుడే వెయ్యి కోట్ల డాలర్ల పెట్టుబడులను ప్రకటించిన సాఫ్ట్ వేర్ కంపెనీలు బ్రాండ్ బ్యాండ్ - వైఫీ సేవలను వందకోట్ల పైగా భారతీయులకు చౌక ధరకు అందిస్తామని మాట ఇచ్చాయి కూడా. ఒకటి మాత్రం నిజం. దక్షిణ శాన్‌ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ఉన్న సిలివాన్ వ్యాలీలో వందలాది స్టార్ట్ అప్‌ లు - ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు కొలువు దీరి ఉన్నాయి. మోదీ పర్యటన తర్వాత వీటి చూపు ప్రధానంగా భారత్‌ పైనే మళ్లుతోందని విశ్లేషకుల అంచనా.

సాఫ్ట్ వేర్ రంగ నిపుణులు - వ్యాపార దిగ్గజాలు అంచనా వేస్తున్న ప్రకారం అన్నీ అనుకున్నట్లుగా జరిగితే గనుక.. రాబోయే సంవత్సరాల్లో.. ప్రపంచంలోని ఇతర దేశాలనుంచి కూడా.. సాఫ్ట్ వేర్ నిపుణులు - దిగ్గజాలు - భారత్ కు వచ్చి ఇక్కడి కార్యాలయాల్లో కొలువులు వెతుక్కునే పరిస్థితి వస్తుంది, అంటున్నారు. అదే జరిగితే మొన్నటి అమెరికా పర్యటనలో మోడీ ‘బ్రెయిన్ డ్రెయిన్ కాస్తా బ్రెయిన్ గెయిన్’ గా మారుతున్నదని అన్నారు. అలాంటి బ్రెయిన్ డ్రెయిన్ మన దేశం వైపు మళ్లి ఇక్కడకు వచ్చి చేరుతుందని అనుకోవాలి.