Begin typing your search above and press return to search.

ర‌ష్యా ఎస్‌-400 కొనుగోలుకు భార‌త్ ఒప్పందం

By:  Tupaki Desk   |   12 Dec 2017 10:21 AM GMT
ర‌ష్యా ఎస్‌-400 కొనుగోలుకు భార‌త్ ఒప్పందం
X
పొరుగునే ఉన్న‌ప్ప‌టికీ...స‌ఖ్య‌త కంటే...స‌మ‌స్య‌లు సృష్టించ‌డం పైనే ఎక్కువ శ్ర‌ద్ధ చూపిస్తున్న పాకిస్తాన్‌ - చైనాకు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చేందుకు భార‌త్ సిద్ధ‌మ‌వుతోందా? రష్యాకు చెందిన‌ ఎస్-400 ట్రయంప్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేయ‌డం ద్వారా ఆధునాతన ఆయుధ వ్యవస్థను భార‌త్ త‌న అమ్ముల పొదిలో చేర్చుకోనుందా? రష్యా రక్షణ - పరిశ్రమల బృందం(రోస్‌ టెక్) డైరెక్టర్ విక్టర్ ఎన్ క్లడోవ్ వెల్లడించిన వివ‌రాల ప్రకారం అవుననే స‌మాధానం వ‌స్తోంది.

అత్యంత శక్తివంతమైన ఎస్-400 ట్రయంప్ విశిష్ట‌మైన ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ క‌లిగి ఉంది. లాంగ్‌ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ అయిన ఎస్‌-400 ఆకాశంలో 400 కిలోమీటర్ల పరిధిలో దూసుకొచ్చే శత్రుదేశాల యుద్ధ విమానాలు - క్షిపణులు - డ్రోన్లను నాశనం చేయగలదు. దీంతోపాటుగా రక్షణ పొరలాంటిది సృష్టించి ఒకేసారి 36లక్ష్యాలను గురిపెట్టగలదు. శత్రుదేశాల క్షిపణుల నుంచి దేశంలోని ముఖ్య నగరాలను నాశనం కాకుండా రక్షణ ఛత్రం ఏర్పాటు చేయవచ్చు. ఎస్-400 ద్వారా మొత్తం మూడు క్షిపణులను ప్రయోగించే అవకాశం ఉంటుంది. ఇంత‌టి కీల‌క‌మైన క్షిప‌ణి వ్యవస్థ అమెరికా వద్ద కూడా లేకపోవడం గమనార్హం. ఈ క్షిప‌ణి కొనుగోలుకు ఈ ఏడాది మొద‌ట్లో బీజం ప‌డింది. ప్రధాని నరేంద్ర మోడీ - రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గోవాలో బ్రిక్స్ దేశాల సదస్సు సందర్భంగా ఈ కొనుగోలుపై చర్చించారు. అనంత‌రం ఈ ఒప్పందం గురించి ప్రకటించారు.రష్యా నుంచి 5 బిలియన్ డాలర్లతో ఎస్-400 ట్రయంప్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేస్తామని ప్ర‌ధాని మోడీ వెల్ల‌డించారు. త‌దనుగుణంగా చ‌ర్చ‌లు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. దీంతోపాటు రెండు దేశాలు సంయుక్తంగా కమోవ్ హెలికాప్టర్ల తయారీ చేపడతున్నారు. బెంగ‌ళూరుకు స‌మీపంలోని తుమ‌కూరు వ‌ద్ద ఈ హెలీకాప్ట‌ర్‌ల త‌యారీ సాగుతోంది.

ఈ నిర్ణ‌యంపై రష్యా రక్షణ - పరిశ్రమల బృందం(రోస్‌ టెక్) డైరెక్టర్ విక్టర్ ఎన్ క్లడోవ్ ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ భార‌త్ అమ్ముల పొదిలో ఎస్‌-400 చేరేందుకు సంబంధించిన చ‌ర్చ‌లు కీల‌క ద‌శ‌కు చేరాయ‌న్నారు. ఈ క్షిప‌ణి వ్య‌వ‌స్థ కొనుగోలుకు సంబంధించిన ధర, దీని ఉప‌యోగించచేందుకు కావాల్సిన శిక్షణ - త‌గు సాంకేతిక సేవ‌లు - కీల‌క‌మైన‌ నియంత్రణ వ్యవస్థల ఏర్పాటు గురించి చర్చలు కొన‌సాగుతున్నాయిని క‌డ్లోవ్ వివ‌రించారు. ఈ ఒప్పందం అనంత‌రం వెంట‌నే ఎస్-400లను సరఫరా చేసినప్ప‌టికీ...భార‌త్‌కు అందుబాటులోకి వ‌చ్చేందుకు స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు. ఈ వ్యవస్థ గురించి శిక్షణ ఇచ్చేందుకు రెండేళ్లు పడుతుందని పేర్కొంటూ అప్పుడే వీటిని వినియోగించగలరని క్లడోవ్ తెలిపారు. కాగా, ఇరుదేశాల మ‌ధ్య ఒప్పందం కుదిరి...ఈ ప‌టిష్ట క్షిప‌ణి వ్య‌వస్థ భార‌త్ అమ్ముల‌పొదిలో చేరితే..పాక్‌ - చైనా క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు బ్రేక్ ప‌డ‌టం ఖాయ‌మ‌ని అంటున్నారు.