Begin typing your search above and press return to search.

పాక్ అష్టదిగ్బంధనం.. భారత్ భారీ స్కెచ్

By:  Tupaki Desk   |   22 Feb 2019 4:42 AM GMT
పాక్ అష్టదిగ్బంధనం.. భారత్ భారీ స్కెచ్
X
పుల్వామాలో భారత్ సైనికులపై ఉగ్రవాద దాడి తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరోక్ష యుద్ధానికి దిగుతోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసే ఎత్తుగడకు ప్లాన్ చేసింది. రోజుకో షాక్ అన్నట్లుగా పాక్ పై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇటీవలే ‘అత్యంత ప్రాధాన్యత దేశం’ హోదాను పాకిస్తాన్ కు తీసేసింది. దిగుమతి సరుకులపై 200శాతం సుంకం విధించి పాకిస్తాన్ వస్తువులపై దాదాపు నిషేధం విధించింది. భారత్ నుంచి నిత్యావసరాలను పాకిస్తాన్ కు ఆపేసింది. దీంతో పాక్ లో కిలో టమాటా 180 రూపాయలు అయ్యి పాక్ ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. ఇక పలు దేశాలతో చర్చలు జరుపుతూ పాకిస్తాన్ ను ఏకాకి చేయడానికి వడివడిగా అడుగులు వేస్తోంది.

తాజాగా పాకిస్తాన్ కు మూలాధారమైన సింధూ నది జలాలను నిలుపుదల చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సింధూ నది జలాలను ఇతర ప్రాజెక్టుల్లోకి మళ్లించి జమ్మూ కాశ్మీర్-పంజాబ్ రాష్ట్రాల్లోని రైతులకు అందిస్తామని తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

ఇక తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ పైన అతిపెద్ద యాక్షన్ తీసుకునేందుకు భారత్ సిద్ధమవుతున్నట్లుగా రాజ్ నాథ్ హింట్ ఇచ్చారు. అయితే ఆ యాక్షన్ ఏంటనేది మాత్రం తెలుపలేదు. ప్రజల ఆశలు - అంచనాలు నెరవేర్చే సమయం వస్తుందని వ్యాఖ్యానించారు. పుల్వామా దాడి తర్వాత దేశంలో ఏ కార్యక్రమంలో ఉత్సాహం కనిపించడం లేదని.. ఇంకా భారత్ బాధలోనే ఉందన్నారు. ప్రజలు కోరుకునే ప్రతీకారం తీర్చుకునేందుకు సమయం వస్తుందని.. భారతీయుల ఆలోచనలు, అంచనాలు నిజమవుతాయని రాజ్ నాథ్ పేర్కొన్నారు. దీంతో ఏంటా చర్య అనేది హాట్ టాపిక్ గా మారింది.