Begin typing your search above and press return to search.

సంప‌న్న దేశాల జాబితాలో భార‌త్ వ‌చ్చేసింది

By:  Tupaki Desk   |   21 May 2018 7:53 AM GMT
సంప‌న్న దేశాల జాబితాలో భార‌త్ వ‌చ్చేసింది
X
భారత్ అంటే పాములు ఆడించే వాళ్లు ఎక్కువ‌గా ఉంటార‌ని.. కోతులు ఎక్కువ‌ని.. అక్క‌డి వారు అనాగ‌రికంగా ఉంటార‌న్న పేరు ఇప్ప‌టికి కొంత‌మంది ప్రాశ్చాతుల ఫీలింగ్ గా చెబుతారు. ఘ‌న‌మైన చ‌రిత్ర‌.. మ‌న సంస్కృతి సంప్ర‌దాయాల మీద పాజిటివ్ గా ఉండేవాళ్లు ఉన్న‌ట్లే.. నెగిటివ్ గా ఉండేవాళ్ల‌కు కొద‌వ లేదు. పేద దేశంగా.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి ప‌థంలోకి ప‌య‌నిస్తున్న‌ట్లుగా చెప్పే భార‌త్ ఇప్పుడు సంప‌న్న దేశాల జాబితాలోకి ఎక్కేసింది. తాజాగా ఒక స‌ర్వే ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌టం గ‌మ‌నార్హం.

అంతేనా.. భార‌త్ ఐశ్వ‌ర్యం అవాక్కు అయ్యేలా ఉండ‌ట‌మే కాదు.. రానున్న రోజుల్లో భార‌త్ సంప‌న్న దేశంగా అవ‌త‌రించే అవ‌కాశాలు ఉన్న విష‌యాన్ని తాజా రిపోర్ట్ స్ప‌ష్టం చేస్తోంది. అంత‌ర్జాతీయ సంప‌ద వ‌ల‌స స‌మీక్ష పేర‌తో మారిష‌స్ లోని ఆఫ్రో ఆసియా బ్యాంకు తాజా నివేదిక‌ను విడుద‌ల చేసింది. ఈ నివేదిక‌లో ఒక్కో దేశంలో జీవిస్తున్న వారి వ్య‌క్తిగ‌త సంప‌ద‌ను దేశ మొత్తం సంప‌ద‌గా లెక్క వేశారు. ఇందులో ప్ర‌భుత్వ ఆదాయాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. అప్పుల్ని తీసేసిన త‌ర్వాత నిక‌రంగా ఉన్న ఆదాయాన్ని లెక్క క‌ట్టి ప్ర‌పంచ దేశాల‌కు ర్యాంకులు క‌ట్ట‌బెట్టారు.

ఈ ర్యాంకుల్లో భార‌త్ మెరుగైన స్థానంలో నిల‌వ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. తాజాగా విడుద‌ల చేసిన జాబితాలో అమెరికా మొద‌టి స్థానంలో నిల‌వ‌గా.. భార‌త్ ఆరో స్థానంలో నిలిచింది. అత్యంత ధ‌నిక దేశాల జాబితాలో అమెరికా త‌ర్వాత చైనా రెండో స్థానంలో నిలిచింది.

వ్యాపారం చేసే వారు ఎక్కువ‌గా ఉండ‌టం.. మంచి విద్యా వ్య‌వ‌స్త‌.. ప‌టిష్ట‌మైన ఐటీ రంగం.. బీపీవో.. స్థిరాస్తి వ్యాపారం.. ఆరోగ్య‌సేవ‌లు.. వార్తా సంస్థ‌ల రంగం లాంటి అంశాల‌తో భార‌త్ సంప‌ద సృష్టికి కార‌ణ‌మ‌వుతున్న‌ట్లు గుర్తించారు. తాజా లెక్క‌ల ప్ర‌కారం అమెరికా సంప‌ద 4,254 ల‌క్ష‌ల కోట్లు అయితే.. భార‌త్ సంప‌ద 559 ల‌క్ష‌ల కోట్లుగా లెక్క వేశారు. రానున్న ప‌దేళ్ల కాలంలో భార‌త సంప‌ద వేగంగా పెరిగే వీలుంద‌ని అంచ‌నా వేశారు. 2027 నాటికి మ‌న దేశం జ‌ర్మ‌నీ.. బ్రిట‌న్ ల‌ను అధిగ‌మించి సుసంప‌న్న‌మైన దేశాల జాబితాలో నాలుగో స్థానంలో నిలుస్తుంద‌ని చెబుతున్నారు. 2027 నాటికి చైనా సంప‌ద దాదాపు 4,721 ల‌క్ష‌ల కోట్ల రూపాయిలు అయితే.. మ‌న దేశ సంప‌ద రూ.800 లక్ష‌ల కోట్ల కంటే ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెబుతున్నారు. అదే స‌మ‌యంలో అమెరికా సంప‌ద మొత్తం రూ.5,105ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకుంటుంద‌ని లెక్క‌లు క‌ట్టారు. ప్ర‌స్తుతం పప్ర‌పంచ వ్యాప్తంగా ప్రైవేటు సంప‌ద రూ.14,616 ల‌క్ష‌ల కోట్లు కాగా రానున్న ప‌దేళ్ల కాలంలో ఇది కాస్తా రూ.21,823 ల‌క్ష‌ల కోట్లుగా పెరుగుతుంద‌న్న అంచ‌నా వేశారు. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమిటంటే.. రూ.6.7కోట్ల కంటే ఎక్కువ సంప‌ద ఉన్న వారి సంఖ్య ప్ర‌పంచ వ్యాప్తంగా 1.52కోట్ల మందిగా లెక్క తేల్చారు.