Begin typing your search above and press return to search.

ముంచుకొస్తున్న ఆర్థిక‌మాంద్యం..

By:  Tupaki Desk   |   24 Aug 2019 5:12 AM GMT
ముంచుకొస్తున్న ఆర్థిక‌మాంద్యం..
X
ఆర్థిక మాంద్యం.. అంటువ్యాధి లాంటిది.. ఎక్క‌డో ప్ర‌బ‌లి..మ‌రెక్క‌డికో వ్యాప్తి చెందుతుంది. అప్ర‌మ‌త్తంగా లేకుండా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను అత‌లాకుతలం చేస్తుంది. దేశాల‌ను గ‌జ‌గ‌జ‌లాడిస్తుంది. కొద్దిరోజులుగా భార‌త్‌ లోనూ ఆర్థిక మాంద్యం ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని ఆర్థిక‌వేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. రోజురోజుకూ కంపెనీలు లాభాలు ప‌డిపోతున్నాయ‌ని - ఆయా కంపెనీల్లో ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్నార‌ని.. ఇవ‌న్నీ కూడా ఆర్థిక‌మాంద్యం సంకేతాల‌ను చెబుతున్నారు. తొంద‌ర‌గా మేల్కోక‌పోతే.. ప్ర‌మాద‌కరంగా మారుతుంద‌ని కంపెనీలు అంటున్నాయి. ఇప్ప‌టి నుంచే త‌మ‌కు ఆర్థిక ఉద్దీప‌న ప్యాకేజీలు కావాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరుతున్నాయి. అయితే.. భార‌త్ ఆర్థిక శ‌క్తిగా ఎదుగుతోంద‌ని చెబుతున్న మ‌న పాల‌కుల‌కు ఈ ప‌రిణామాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి.

అయితే.. సాధార‌ణంగా.. దేశంలో కార్ల విక్ర‌యాల‌ను ఆధారంగా చేసుకుని ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌రిస్థితి చెబుతుంటారు. విక్ర‌మాలు బాగా ఉంటే.. ఆర్థిక వ్య‌వ‌స్థ బాగుంద‌ని - లేకుంటే.. క్షీణిస్తుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తుంటారు. ఇప్పుడు ఒక‌సారి.. తాజాగా కార్ల విక్రయాల లెక్కలు చూస్తుంటే భారత్‌ లో ఆర్థిక మాంద్యం ప్రభావం ప్రారంభమైందనే ఆర్థిక నిపుణులు అంటున్నారు. కార్ల పరిశ్రమలో మాంద్యం నెలకొంది. 2018 జులై నెలలో వివిధ రకాల వాహనాలు 22.45 లక్షలు అమ్మగా - 2019 జులైలో 18.25 లక్షలకు పడిపోయింది. అంటే.. 4.20 లక్షల వాహనాల అమ్మకం తగ్గింది. గత మూడు నెలల కాలంలోనే వాహన పరిశ్రమలో 15 వేల మంది ఉద్యోగులను తొలగించారు. ఈ మాంద్యం ఇలానే కొనసాగితే ఒక్క వాహన రంగంలోనే వేల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని ఆర్థిక నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

దేశంలో కంపెనీల ఆదాయాలు - లాభాలు బాగా పడిపోతున్నాయ‌ని చెప్ప‌డానికి ఈ లెక్క‌లే నిదర్శ‌నం. జూన్ త్రైమాసికంలో భారతీయ కంపెనీలు నికర విక్రయాల్లో వృద్ధి 4.6 శాతంగా మాత్రమే నమోదైంది. గత ఏడాది జూన్ లో ఇది 13.5 శాతంగా ఉంది. నికర లాభంలో వృద్ధి 6.6 శాతంగా మాత్రమే నమోదైంది. గత జూన్ లో ఇది 24.6 శాతంగా ఉండింది. త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన సుమారు 3 వేల కంపెనీల ఫలితాలను బట్టి ఈ గణాంకాలను కేర్ రేటింగ్స్ వెల్లడించింది. జనవరి - మార్చి మధ్య కాలంలో దేశ ఆర్థిక వృద్ధి 5.8 శాతంగా ఉండింది. అయితే.. గత ఐదేళ్ల‌ కాలంలో ఇదే కనిష్ఠం. మార్చి నుంచి జూన్ మధ్య కాలానికి ఇప్పుడు అది మరింతగా పడిపోయి 5.7 శాతానికి చేరుకుందని నోమురా సంస్థ వెల్లడించింది. దీనిని బ‌ట్టే అర్థం చేసుకోచ్చు.. వ‌చ్చే ప‌రిస్థితులు ఎంత ప్ర‌మాద‌కంగా ఉంటాయో.

అయితే.. ఇక్క‌డ స‌మ‌స్య ఏమిటంటే.. ఈ మాంద్యం ప్రభావం ఇతర రంగాలకు కూడా వేగంగా విస్త‌రిస్తుంది. ఇలా విస్తరిస్తే ఉద్యోగాలు కోల్పోయే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే కంపెనీలు త‌మ‌కు ఆర్థిక ఉద్దీప‌న ప్యాకేజీలు కావాల‌ని కోరుతున్నాయి. ఒక్క వాహ‌న‌రంగ‌మే ల‌క్ష‌కోట్ల ప్యాకేజీ అడుతున్న‌ట్లు వార్తులు వినిపిస్తున్నాయి. ఇంకా ఇత‌ర కంపెనీలు కూడా జీఎస్టీని తొల‌గించాల‌ని కోరుతున్నాయి. ప్ర‌జ‌ల కొనుగోలు శ‌క్తి ప‌డిపోతున్న వేళ‌.. ప్ర‌భుత్వం దిద్దుబాటు చ‌ర్య‌లు తీసుకోకుంటే.. తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వ‌ని ఆర్థిక‌రంగ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ ప్ర‌పంచానికి పెద్ద‌న్న‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న అమెరికాలోనూ ఆర్థిక మాంద్యం ప్ర‌భావం క‌నిపిస్తోందని, దాని ప్ర‌భావం ప్ర‌పంచ దేశాల‌పై ప‌డుతుంద‌ని - అందులో భార‌త్ కూడా ఉంటుంద‌ని, ఆ విష‌యాన్ని పాల‌కులు మ‌రిచిపోకూడ‌ద‌ని అంటున్నారు.