డోక్లాంలో ఇప్పుడేం జరుగుతుందంటే..?

Sat Aug 12 2017 18:06:19 GMT+0530 (IST)

కొద్ది నెలలుగా భారత్ - చైనాల మధ్య డోక్లాం సరిహద్దులో ప్రతిష్ఠంభన నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల సైనికులు పోటాపోటీగా మొహరించిన డోక్లాంలో తాజా పరిస్థితుల విషయానికి వస్తే.. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు దేశాల సైన్యాలు నిర్వహించిన ఫ్లాగ్ మీటింగ్ అసంపూర్తిగా ముగిసినట్లు తెలుస్తోంది.రెండు దేశాలకు చెందిన ఆర్మీ మేజర్.. జనరల్ స్థాయి అధికారులు సిక్కింలోని నాగుల వద్ద సమావేశమయ్యారు. డోక్లాం ఇష్యూ మీద విస్తృతంగా చర్చించారు. దాదాపు ఎనిమిది వారాలుగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభన తాజా మీటింగ్ తో ఒక కొలిక్కి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైనా.. అదేమీ జరగలేదు.

ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతలు నివారించేందుకు ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు. ప్రస్తుత పరిస్థితిని మెరుగుపరిచేందుకు వీలుగా రెండు దేశాల సైన్యాలు డోక్లాంను ఒకేసారి వదిలి వెళితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని భారత్ వ్యక్తం చేసింది. దీనికి అంగీకరించని చైనా.. భారత్ బలగాలు మాత్రం తక్షణమే డోక్లాంను విడిచి వెళ్లాలంటూ పట్టుబట్టింది. దీంతో.. రెండు దేశాల సైన్యాధికారుల మధ్య జరిగిన సమావేశం అసంపూర్తిగా ముగిసింది.

నిజానికి డోక్లాం వివాదం మీద ఇరు దేశాల మధ్య సమావేశాలు జరగటం ఇదే తొలిసారి కాదు. ఈ నెల 8న కూడా రెండు దేశాల సైన్యాలకు చెందిన బ్రిగేడ్ కమాండర్లు సమావేశయ్యారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం రాలేదు. ఇదిలా ఉండగా మూడు రోజుల వ్యవధిలో నిర్వహించిన తాజా సమావేశంలోనూ ఎలాంటి పురోగతి రాలేదు.

ఇదిలా ఉంటే.. డోక్లాం వివాదంపై చైనా మీడియా అదే పనిగా హెచ్చరికలు మీద హెచ్చరికలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ తరహా హెచ్చరికలకు సమాధానం చెప్పేందుకు వీలుగా భారత్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా సిక్కిం.. అరుణాచల్ ప్రదేశ్ లోని చైనా సరిహద్దులకు భారీ సైనిక బలగాల్ని భారత్ తరలిస్తున్నట్లుగా పీటీఐ సహా కొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే.. ఈ విషయాల్ని ఆర్మీ అధికారులు మాత్రం కన్ఫర్మ్ చేయటం లేదు. సైన్యం అంతర్గత వ్యవహారాల్ని బయట పెట్టకూడదన్న మాటను అధికారులు చెబుతున్నట్లుగా తెలుస్తోంది.

మరోవైపు డోక్లాం వ్యవహారంలో భారత్ అనుసరిస్తున్న వైఖరిని అమెరికా ప్రశంసలు కురిపించటం విశేషం. చైనా ఇష్యూలో భారత్ చాలా పరిణితి చెందిన శక్తిగా వ్యవహరిస్తోందని.. చైనా మాత్రం అసహనంతో వ్యవహరిస్తోందని అగ్రరాజ్యం పేర్కొంది. అమెరికాకు చెందిన నేవీ యుద్ధ కళాశాలకు చెందిన ప్రొఫెసర్ జేమ్స్ ఆర్ హేమ్స్ తాజాగా డోక్లాం ఇష్యూ మీద రియాక్ట్ అయ్యారు.

గడిచిన కొద్దిరోజులుగా డోక్లాం మీద సాగుతున్న ప్రతిష్ఠంభనను తాను చేసిన విశ్లేషణలో భారత్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందన్న మాటను ఆయన చెబుతున్నారు. డోక్లాం ఇష్యూలో భారత్ చేస్తున్న పనులన్నీ సరైనవేనని.. వివాదం ఇష్యూలో కానీ.. సమాధానం ఇవ్వటంలో కానీ చైనా కంటే భారత్ గొప్పగా వ్యవహరిస్తోందన్నారు. పరిణితి చెందిన భారత్ వైఖరితో చైనా ఒక పెంకి ఘటం మాదిరి ప్రపంచానికి కనిపించేలా చేస్తుందని వ్యాఖ్యానించటం గమనార్హం.