Begin typing your search above and press return to search.

చైనాలో వ‌చ్చిన మార్పు నిజ‌మేనా?

By:  Tupaki Desk   |   24 Sep 2017 9:22 AM GMT
చైనాలో వ‌చ్చిన మార్పు నిజ‌మేనా?
X
త‌న చుట్టూ ఉన్న దేశాల్లోని ప్రాంతాల‌ను ఆక్ర‌మిస్తూ.. త‌ను ఒప్పుకున్న ఒప్పందాల‌నే ధిక్క‌రిస్తూ.. నేల‌, నీరు అనే సంబంధం లేకుండా స‌రిహ‌ద్దు దేశాల ప్ర‌దేశాల‌ను క‌బ్జా చేస్తూ ముందుకు సాగుతోంది.. చైనా. ప్ర‌పంచంలోనే జ‌నాభా అతి ఎక్కువ ఉన్న దేశంగా, వైశాల్యంప‌రంగా నాలుగో అతిపెద్ద దేశంగా వ్య‌వ‌హ‌రిస్తూ సూప‌ర్ ప‌వ‌ర్ కావాల‌నుకుంటోంది. ఈ క్ర‌మంలో ప్ర‌పంచంలోనే అమేయ శ‌క్తిగా త‌న నౌకా, వాయు, ఆర్మీ విభాగాల‌ను ఆధునికీక‌ర‌ణ చేస్తోంది. మ‌రోవైపు త‌మ‌తో స‌మానంగా ఎదుగుతూ.. శ‌ర‌వేగంగా ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్న భార‌త్‌ ను చూసి కుళ్లుకుంటోంది. భార‌త్‌ ను ప్ర‌శాంతంగా ఉండ‌నీయ‌కుండా.. త‌న మిత్ర దేశం పాకిస్థాన్‌ కు అన్ని విధాలా అండ‌గా ఉంటూ ఉగ్ర‌వాదాన్ని ఎగ‌దోయ‌డంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తోంది. ఇటీవ‌ల సిక్కింలో డోక్లామ్‌ ను ఆక్ర‌మించుకోవ‌డానికి విశ్వ‌ప్ర‌య‌త్నం చేసి యుధ్దానికి సిద్ధ‌మంటూ తొడ‌లు గొట్టి సైలెంట్ అయింది. అలాంటి దేశం ఒక్క‌సారిగా భార‌త్‌ పైన ప్రేమ కురిపిస్తూ మాట్లాడుతోంది. ఈ మార్పు నిజంగానే వ‌చ్చిందా లేదా ఇందులో చైనా ప్ర‌యోజ‌నాలు ఇమిడి ఉన్నాయా?

తాజాగా మ‌న‌దేశంతో బలమైన మైత్రి కోసం చైనా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య డోక్లామ్ సృష్టించిన ప్రతిష్టంభనను మరిచిపోయి - సహకారం - సత్సంబంధాలు పెంచుకోవాలని త‌మ‌ దేశం కృషి చేస్తున్నట్లు చైనా కాన్సుల్ జనరల్ మా ఝన్వు చెబుతున్నారు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా కోల్‌ కతాలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో భాగంగా ఝన్వు ఈ వ్యాఖ్య‌లు చేశారు. భారతదేశం - చైనా కలిసి పని చేస్తున్నాయన్నారు. సంబంధాలను బ‌లోపేతం చేసుకునేందుకు అనుస‌రించాల్సిన‌ విధానాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ - చైనా అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్ ఈ నెల 5న చర్చలు జరిపారని ఆయ‌న అన్నారు. ఇరు దేశాలు కలిసి పని చేసినంత కాలం, పరస్పర అభివృద్ధికి సహకరించుకోవ‌చ్చని కూడా చెప్పారు.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఢీ అంటే ఢీ అని.. యుద్ధం వ‌స్తే భార‌త్ ఒక్క‌రోజులోనే తోక ముడుస్తుంద‌ని త‌మ అధికార మీడియాలో ఊద‌ర‌గొట్టింది.. చైనా. మరి ఇప్పుడు ఇలా మాట్లాడ‌టానికి కార‌ణం ఉందంటున్నారు నిపుణులు. అంత‌ర్జాతీయంగా భార‌త్ పేరు ప్ర‌తిష్ట‌లు పెర‌గడం, ప్ర‌పంచ స‌మస్య‌ల ప‌రిష్కారంలో భార‌త్ చొర‌వ‌, అమెరికా - జపాన్ - వియ‌త్నాం లాంటి చైనా శ‌త్రుదేశాల‌తో మ‌న దేశం స‌న్నిహిత సంబంధాలు నెరుపుతుండ‌టం, చైనా వ‌స్తువుల‌కు ప్ర‌పంచంలోనే అతిపెద్ద మార్కెట్ గా ఉండ‌టం త‌దిత‌ర కార‌ణాల‌తో చైనా దిగిరాక త‌ప్ప‌లేద‌ని అంటున్నారు.

అంతేకాకుండా చైనాకు ధీటుగా అణ్వాయుధ సంప‌త్తిని పెంచుకోవ‌డంతోపాటు హిందూ మ‌హా స‌ముద్రంలో అమేయ నౌకాబ‌లం గల దేశంగా భార‌త్ ఉండ‌టంతో ఆ దేశానికి ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయ‌ని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే క‌శ్మీర్ స‌మ‌స్య‌.. భార‌త్‌ - పాక్‌ ల మ‌ధ్య వివాద‌మ‌ని.. దీన్ని ఈ రెండు దేశాలే ప‌రిష్క‌రించుకోవాల‌ని ఇందులో త‌మ జోక్యం ఉండ‌బోద‌ని చెప్ప‌డం, తాజాగా భార‌త్‌ తో సంబంధాలు ప‌టిష్టం చేసుకుంటామ‌నడం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని వారంటున్నారు. అయితే చైనాతో సంబంధాలు పెంపొందించుకుంటూనే మ‌న జాగ్ర‌త్త‌లో మ‌నం ఉండాల‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.