Begin typing your search above and press return to search.

ఇండిగో విమానంలో ఐసిస్ నినాదాలు

By:  Tupaki Desk   |   28 July 2016 8:06 AM GMT
ఇండిగో విమానంలో ఐసిస్ నినాదాలు
X
చౌకధరల విమాన సంస్థగా పేరున్న ఇండిగో విమానంలో ఊహించని ఘటన జరిగింది. దుబాయ్ నుంచి కొచ్చికి వెళుతున్న విమానంలో ఒక ప్రయాణికుడి తీరు వివాదాస్పదంగా మారటంతోపాటు.. అతడు చేసిన నినాదాలు ఆ విమానంలో ప్రయాణిస్తున్న వారికి ముచ్చమటలు పుట్టేలా చేసింది.

దుబాయ్ నుంచి కొచ్చికి వెళుతున్న విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు తోటి ప్రయాణికుల పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించటమే కాదు.. బిగ్గరగా ఐసిస్ అనుకూల నినాదాలు చేయటంతో విమానంలో ప్రయాణించే వారు ఉలిక్కిపడ్డారు. వెంటనే.. స్పందించిన ఇండిగో సిబ్బంది అత్యవసరంగా విమానాన్ని ముంబయి విమానాశ్రయానికి మళ్లించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ఐసిస్ అనుకూల నినాదాలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం విమానం బయలుదేరి వెళ్లింది. విమానం ల్యాండ్ అయి.. సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకునే వరకు విమాన సిబ్బంది.. ప్రయాణికులు గుండెల్ని అరచేతిలోపెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపిన పరిస్థితి.