స్వతంత్రులదే ఉప ముఖ్యమంత్రి పీఠం..!?

Mon Dec 10 2018 07:00:01 GMT+0530 (IST)

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అన్ని సంచలనమే. అంతటా సంచలనమే. ఈ సారి ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాదేమోనని వార్తలు వస్తున్న వేళ స్వతంత్ర అభ్యర్ధులు విజయం సాధిస్తే వారిదే అధికారంలో పైచేయి అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. లోక్‌సభ మాజీ సభ్యుడు సర్వే నిపుణుడు లగడపాటి రాజగోపాల్ చేసిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో స్వతంత్రులదే హవా అని తేలింది. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో దాదాపు ఎనిమిది మంది వరకూ విజయం సాధిస్తారని అంటున్నారు. పైగా వీరి విజయమే తెలంగాణలో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానుంది అంటున్నారు.ఈ సమయంలో తెలంగాణ వ్యాప్తంగా ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్దులు విజయం సాధిస్తే వారిని తమ పార్టీలోకి అంటే తమ పార్టీలోకి అంటూ ఆహ్వానించేందుకు అధికార తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు ప్రజాకూటమి కూడా సిద్ధంగా ఉంది. మరొక కీలక అంశం లగడపాటి రాజగోపాల్ సర్వే ప్రకారం విజయం సాధిస్తారని చెబుతున్న వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. దీంతో వారిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం కూడా రంగంలోకి దిగుతుందనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా స్వతంత్రుల్లో ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేందుకు కూడా అధికార - ప్రతిపక్షాలకు చెందిన వారు వెనుకాడరని చెబుతున్నారు. స్వతంత్ర అభ్యర్ధులు తాము గెలిస్తే తమ మద్దతు తెలిపేందుకు భారీ నజరానాలు కోరడం ఖాయంగానే ఉందంటున్నారు. ఇందులో భాగంగా తమ మద్దతు కావాలంటే తమలో సీనియర్ అయిన ఒకరిని ఉప ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ ను తెరపైకి తీసుకురావాలని వారు అనుకుంటున్నారని సమాచారం.

స్వతంత్రంగా గెలిచే అవకాశాలున్నాయంటున్న వారంతా ఒక వేదిక మీదకు వచ్చి తమ డిమాండ్లను పార్టీల ముందు పెట్టే అవకాశం ఉందంటున్నారు. ఇదే జరిగితే ఎంత మంది స్వతంత్రులు విజయం సాధిస్తే వారిలో ఇద్దరికి క్యాబినెట్ పదవి... అందులోనూ ఉప ముఖ్యమంత్రి వంటి కీలక పదవి ఇవ్వాలని డిమాండ్ చేయనున్నట్లు సమాచారం. ఇక మిగిలిన వారికి ఈ ఎన్నికల్లో వారు ఖర్చు చేసిన మొత్తం తిరిగి ఇచ్చేయడంతో పాటు పలు కార్పొరేషన్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. దీనికి వారే ఓ కూటమిగా ఏర్పడి అధికార పార్టీతో పాటు ప్రజాకూటమినితో కూడా బేరసారాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో హంగ్ ఏర్పడితే మాత్రం ఇంతకు ముందు చూడని రాజకీయాలు ఇక ముందు చూసే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.