Begin typing your search above and press return to search.

ఖర్చు రెండు కోట్లు..ఓట్లు 1284 ఓట్లు

By:  Tupaki Desk   |   13 Dec 2018 7:23 AM GMT
ఖర్చు రెండు కోట్లు..ఓట్లు 1284 ఓట్లు
X
ఇప్పుడు రాజకీయాలు చాలా ఖరీదైన వ్యవహారంలా మారిపోయాయి. ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు మినిమం పది కోట్ల దాకా ఖర్చు పెట్టేస్తున్నారు. ఇక రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకుండా ఉండి.. ఏదైనా పార్టీ తరఫున పోటీ చేయాలంటే ఖర్చు మరింత పెరుగుతుంది. చిన్న స్థాయి పార్టీల తరఫున పోటీ చేసేవాళ్లు.. ఇండిపెండెట్లు కూడా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టేస్తున్నారు. అసలు గెలిచే అవకాశాలే లేవనుకున్న వాళ్లు సైతం ముందు వెనుక చూడకుండా ఖర్చు పెట్టేస్తున్నారు. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడ్డ వారిలో ఇలాంటి అభ్యర్థులు చాలామందే ఉన్నారు. అందులో ఒక వ్యక్తి తన నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి తన చేతిలో చమురు బాగానే వదిలించుకున్నట్లు సమాచారం.

ఆయన రూ.2 కోట్ల దాకా ఖర్చు పెట్టాడట మొన్నటి ఎన్నికల్లో. నియోజకవర్గ పరిధిలో ఎక్కడ ఏ ప్రైవేటు ఫంక్షన్ జరిగినా అక్కడ అతను వాలిపోయేవాడట. భారీగా బహుమతులు పంచాడట. లక్షల విలువైన బహుమతులు అందించాడట. ఇక స్థానిక యువతకు క్రికెట్ కిట్లు పంచడం.. టూర్లకు స్పాన్సర్ చేయడం.. పెద్ద ఎత్తున పార్టీలు ఏర్పాటు చేయడం.. ఇలా చాలా హంగామానే చేశాడట. ఇలా ఆయన మొత్తం ఖర్చు రూ.2 కోట్లకు చేరుకుందట. ఇంతా చేస్తే ఆయనకు వచ్చిన ఓట్లు ఎన్నంటే కేవలం 1284. తన దగ్గర వేలమంది ప్రయోజనాలు పొందారు కానీ.. వాళ్లందరూ ఆయనకు ఓటు మాత్రం వేయలేదు. డబ్బులు తీస్కో.. నచ్చిన వాడికి ఓటేస్కో అనే సిద్ధాంతాన్ని జనాలు ఫాలో అయిపోయినట్లున్నారు. డబ్బులు పెట్టి ఓట్లు కొనేయొచ్చని నమ్మేవాళ్లకు ఈ ఫలితం చెంపపెట్టు లాంటి సమాధానం అనడంలో సందేహం లేదు.