Begin typing your search above and press return to search.

టీడీపీ ఎమ్మెల్యేకు ఐటీ షాక్‌

By:  Tupaki Desk   |   28 Sep 2016 5:44 AM GMT
టీడీపీ ఎమ్మెల్యేకు ఐటీ షాక్‌
X
గుంటూరు జిల్లా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే - టీడీపీ సీనియ‌ర్ నేత మోదుగుల వేణుగోపాల‌రెడ్డికి ఇన్‌ కం టాక్స్ డిపార్ట్ మెంట్ నుంచి పెద్ద షాకే త‌గ‌ల‌నుందా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. టీడీపీలో సీనియ‌ర్ నేత‌గా ఉన్న ఆయ‌న 2009లో తొలిసారి ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఎంపీ అయ్యారు. 2014 ఎన్నిక‌ల్లో గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఆయ‌న ఏపీ స‌హా బెంగ‌ళూరులోనూ వ్యాపారం చేస్తున్నారు. అయితే - అనూహ్యంగా ఆయ‌నకు చెందిన బెంగ‌ళూరు నివాసంపై ఇన్‌ కం టాక్స్ అధికారులు దాడులు చేశారు. ఆయ‌న వ్యాపార వివ‌రాలు - ఆస్తుల చిట్టాల‌ను కూడా ప‌రిశీలించిన‌ట్టు స‌మాచారం. అయితే, ఈ దాడులు జ‌రిగిన స‌మ‌యంలో మోదుగుల బెంగ‌ళూరులో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఐటీ అధికారులు ఐదు బృందాలుగా విడిపోయి మోదుగుల‌కు సంబంధించిన వ్యాపారాల‌పై దాడులు చేయ‌డం టీడీపీలో పెద్ద చ‌ర్చ‌కు దారితీసింది.

బెంగ‌ళూరులోని రాంకీ ఉత్స‌వ్‌ - శీన‌ప్ప లే అవుట్‌ లో వ‌వేదా ఇన్‌ ఫ్రా ప్రాజెక్ట్స్ పేరుతో మోదుగుల రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఈ సంస్థ‌కి మేనేజింగ్ డైరెక్ట‌ర్ హోదాలో ఉన్న వేణుగోపాల రెడ్డి.. ఇటీవ‌ల కాలంలో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్పడ్డార‌ని స్థానిక మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. వాస్త‌వానికి రాం గ్రూప్‌ ను మోదుగుల సొంత బావ‌ అయోధ్య రామిరెడ్డి నిర్వ‌హిస్తున్నారు. అయితే, దీనికి తెర‌వెనుక అన్నీ మోదుగులే న‌డిపిస్తున్నారు. అయితే 2013లో వ‌వేదా ఇన్‌ ఫ్రాను కూడా స్థాపించారు. ఇక‌, రాంకీ గ్రూపు కింద వేల కోట్ల రూపాయ‌ల‌ను పెట్టుబ‌డులుగా పెట్టారు. హైద‌రాబాద్‌ - రంగారెడ్డి జిల్లాల్లోనూ రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్లు వేశారు. ఇన్ ఫ్రా - ఫార్మా కంపెనీల్లోనూ భారీ ఎత్తున పెట్టుబ‌డులు పెట్టారు.

ఒక్క రాంకీ సంస్థలోనే మోదుగుల వెయ్యి కోట్లు పెట్టుబ‌డిగా పెట్టిన‌ట్టు స‌మాచారం. ఈ సంస్థ ఐటీ కారిడార్‌ లో ఇంద్ర భ‌వ‌నాల‌ను త‌ల‌ద‌న్నే అపార్ట్‌ మెంట్ల‌ను నిర్మిస్తుంది. ఈ క్ర‌మంలోనే లావాదేవీల్లో అవ‌క‌వ‌త‌వ‌క‌లు జ‌రిగి.. విష‌యం ప‌త్రిక‌ల‌కు కూడా చేరింది. దీంతోనే ఐటీ దాడులు జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. బుధవారం మోదుగులకు చెందిన హైదరాబాద్ - గుంటూరు కార్యాలయాల్లో కూడా ఈ దాడులు నిర్వహించనున్నట్లు తెలిసింది. మోదుగుల బెంగళూరులో అందుబాటులో లేని సమయంలో ఈ దాడులు జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏదైనా సమాచారం మేరకు ఈ దాడులు జరిగాయా, లేక రాజకీయకోణంలో జరిగాయా అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/