Begin typing your search above and press return to search.

బాబుకు ముందుంది ముస‌ళ్ల పండ‌గ‌!

By:  Tupaki Desk   |   15 Oct 2018 10:59 AM GMT
బాబుకు ముందుంది ముస‌ళ్ల పండ‌గ‌!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ నేత‌ల ఇళ్లు, కార్యాల‌యాల‌పై తాజా ఐటీ దాడులు పెను క‌ల‌క‌లం సృష్టించాయి. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడి క్యాష్ టీంగా ప‌లువురు అభివ‌ర్ణంచే సి.ఎం.ర‌మేశ్ - నారాయ‌ణ వంటి నేత‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకొని జ‌రిగిన ఈ దాడులు.. కేవ‌లం రాష్ట్రంలోనే గాక యావ‌త్ భార‌త‌దేశంలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. చంద్ర‌బాబును టార్గెట్ చేసి.. కేంద్ర‌మే ఈ ఐటీ దాడులు చేయించిందంటూ ప‌లువురు విమ‌ర్శించ‌గా, చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతుంద‌ని కేంద్ర‌వ‌ర్గాలు చెప్పుకొచ్చాయి.

తాజాగా ఐటీ దాడుల గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. టీడీపీ నేత‌ల‌పై జ‌రిగిన దాడులు ట్ర‌య‌ల‌ర్ మాత్ర‌మేన‌ని.. ముందు ముందు మ‌రిన్ని దాడుల‌తో చంద్ర‌బాబు ఉక్కిరిబిక్కిరి కాబోతున్నార‌ని స‌మాచారం అందుతోంది. ఈ దాడుల వెనుక కేంద్ర‌ప్ర‌భుత్వ హ‌స్తం.. మ‌రీ ముఖ్యంగా చెప్పాలంటే అమిత్ షా హ‌స్తం ఉంద‌న్న‌ది కాద‌న‌లేని స‌త్య‌మ‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.

ఆంధ్ర‌ప్రదేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా మాట తప్పార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ చంద్ర‌బాబు ఎన్డీయే స‌ర్కారు నుంచి బ‌య‌ట‌కొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆపై ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాల‌ను ల‌క్ష్యంగా చేసుకొని బాబు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. దీంతో బీజేపీ అధిష్ఠానం తీవ్రంగా నొచ్చుకుంది. ఇక తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో చెయ్యి క‌ల‌ప‌డం కూడా క‌మ‌ల‌నాథుల‌కు ఆయ‌న‌పై ఆగ్ర‌హాన్ని తెప్పించింది. ఆయ‌న విష‌యంలో ఎంత‌మాత్రం కూడా ఉపేక్షించ‌కూడ‌ద‌ని.. దూకుడుగా వ్య‌వ‌హ‌రించాల‌ని నిర్ణ‌యించుకుంది. టీడీపీ నేత‌లపై ఐటీ దాడులు అందులో భాగ‌మేన‌న్న‌ది ప‌లువురి వాద‌న‌.

అయితే, ఐటీ దాడులు శాంపిల్ మాత్ర‌మేన‌ని.. చంద్ర‌బాబుకు ముందు ముందు చుక్క‌లు చూపించేందుకు బీజేపీ ప‌క్కా వ్యూహాలు ర‌చిస్తోంద‌ని కొంద‌రు విశ్లేషిస్తున్నారు. సొంత పార్టీలో త‌మకు త‌ల‌నొప్పిగా మారిన కురు వృద్ధుడు ఎల్‌.కె.అడ్వాణీ నోటికి మోదీ - షా తాళం వేసిన సంగ‌తిని వారు గుర్తుచేస్తున్నారు. వెంక‌య్య‌నాయుడికి ఉప రాష్ట్రప‌తి ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డం ద్వారా ఆయ‌న్ను క్రియాశీల రాజ‌కీయాల్లో నుంచి ప‌క్క‌కు త‌ప్పించిన విష‌యాన్నీ ప్ర‌స్తావిస్తున్నారు. అలాంటి ఉద్ధండులే కిమ్మ‌న‌కుండా చేసిన మోదీ - షాల‌కు చంద్ర‌బాబు లెక్కే కాద‌ని.. త్వ‌ర‌లో ఆయ‌న నోరు మూయించ‌డం ఖాయ‌మ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆ ప్ర‌య‌త్నాల్లో భాగంగానే ట్ర‌య‌ల‌ర్‌గా తొలుత ఐటీ దాడులు జ‌రిగాయ‌ని.. అస‌లు
సినిమా త్వ‌ర‌లో ప్రారంభ‌మ‌వ్వ‌బోతోంద‌ని చెబుతున్నారు.

పోల‌వ‌రం ప్రాజెక్టు, అమ‌రావ‌తి నిర్మాణానికి సంబందించిన ఒప్పందాలు, రాజ‌ధాని కోసం జ‌రిగిన‌ భూసేక‌ర‌ణ‌లో అక్ర‌మాలు, తాత్కాలిక నిర్మాణాల పేరుతో చోటుచేసుకున్న దోపిడీపై ప్ర‌ధానంగా అమిత్ షా దృష్టి కేంద్రీక‌రించిన‌ట్లు స‌మాచారం. రుణ‌మాఫీ ప‌థ‌కం అమ‌లులో లోపాల‌నూ ఆయ‌న ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోంది. వీట‌న్నింటిలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అక్ర‌మాల‌కు పాల్ప‌డింద‌ని ఆయ‌న బ‌లంగా విశ్వ‌సిస్తున్నార‌ట. వాటిని ఆధార స‌హితంగా ప్ర‌జ‌ల ముందు వివ‌రించి.. చంద్ర‌బాబును ఏకిపారేయాల‌ని షా వ్యూహాలు ప‌న్నుతున్నార‌ని తెలుస్తోంది. కేంద్రం అందిస్తున్న నిధులు ప్ర‌జ‌ల‌కు అంద‌కుండా చంద్ర‌బాబు అడ్డు ప‌డుతున్నార‌ని.. కేంద్ర ప‌థ‌కాల‌కే పేర్లు మార్చి జ‌నాన్ని చంద్ర‌బాబు బురిడీ కొట్టిస్తున్నార‌ని విమ‌ర్శ‌ల జ‌డి పెంచేందుకు ఆయ‌న స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల స‌మాచారం.