Begin typing your search above and press return to search.

మోడీకి ఏదో చూపిస్తానంటున్న ఇమ్రాన్ ఖాన్

By:  Tupaki Desk   |   29 Sep 2016 5:37 PM GMT
మోడీకి ఏదో చూపిస్తానంటున్న ఇమ్రాన్ ఖాన్
X
సహనంతో వ్యవహరిస్తూ.. ఎన్ని పిచ్చి చేష్టలు చేసినా ఒపిగ్గా భరిస్తున్న భారత్.. ఒక్కసారి తానేంటో చూపించేసరికి పాక్ ప్రధాని నుంచి.. ఆ దేశ నేతలు ఉడికిపోతున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత సైనికులు జరిపిన లక్షిత దాడుల (సర్జికల్ స్ట్రైక్స్)పై అగ్గిమీద గుగ్గిలం అయిపోతున్నారు. ఉగ్రవాద శిబిరాల మీద భారత సైన్యం చేపట్టిన దాడుల్న మాజీ క్రికెటర్.. పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ రియాక్ట్ అయ్యారు.

భారత్ చేసిన ఇలాంటి దురాక్రమణలపై ఎలా రియాక్ట్ కావాలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు తాను చేసి చూపిస్తానని చెప్పిన ఆయన.. భారత ప్రధాని మోడీకి కూడా తన రియాక్షన్ చూపిస్తానని చెబుతున్నారు. తాను మొదట నవాజ్ షరీఫ్ కు సందేశం ఇవ్వాల్సి ఉందని.. ఆ తర్వాత మోడీకి బలమైన సందేశాన్ని ఇస్తామని చెప్పుకొచ్చారు. రేపు నిర్వహించే ఐక్యతా ర్యాలీలో పాక్ ప్రజలంతా పాల్గొనాలని కోరుతున్నారు. భారత సైన్యం చేసిన లక్షిత దాడులపై పాక్ సైన్యం తోసి పుచ్చుతుంటే.. పాక్ నాయకులు మాత్రం ఆవేశంతో రగిలిపోవటం గమనార్హం.

మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. తాజాగా చేసిన దాడులపై భారత రాజకీయ వర్గాలన్నీ.. తమ విభేదాల్ని పక్కన పెట్టేసి ఒకే తాటి మీదకు వచ్చేస్తే.. పాక్ లో మాత్రం పార్టీలు.. నేతలంతా తలోదారిగా తయారయ్యారు. భారత్ సైన్యం వ్యవహరించిన తీరుపై వారు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే.. భారత సైన్యం చేసిన లక్షిత దాడులు పాక్ రాజకీయ నేతల మధ్య విభేదాలు పెంచటమే కాదు.. పాక్ ప్రజల్ని అయోమయంలో ముంచెత్తాయనటంలో సందేహం లేదు.