Begin typing your search above and press return to search.

ఈ అప్ డేట్స్ ను మిస్ కావొద్దు

By:  Tupaki Desk   |   25 Nov 2015 7:45 AM GMT
ఈ అప్ డేట్స్ ను మిస్ కావొద్దు
X
కొన్ని ముఖ్యమైన కీలకమైన పరిణామాలు.. అప్ డేట్స్ చోటు చేసుకున్నాయి. వాటి వివరాల్లోకి వెళితే..

ట్యూనీషియాలో ఎమర్జెన్సీ ఎందుకు పెట్టారంటే..

ఉత్తర ఆఫ్రికా దేశం ట్యూనీషియాలో అత్యవసర పరిస్థితి విధించారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి చోటు చేసుకున్న పరిణామాలు ఆ దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఈ దేశ రాజధాని ట్యూనిష్ నగరం బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. దేశాధ్యక్షుడి కాన్వాయ్ కి చెందిన బస్సును గుర్తు తెలియని దుండగులు పేల్చేశారు. ఈ ఘటనలో 15 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 30 మంది వరకు మరణించారు. ఈ నేపథ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. దేశాధ్యక్షుడు కాన్వాయ్ లో లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. దీన్ని ఉగ్రదాడిగా అనుమానిస్తున్నారు.

12 వారాల సెలవులు 26 వారాలకు పెంచుతున్నారెందుకు?

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. మహిళా ఉద్యోగులకు ఇప్పటివరకూ ఇస్తున్న 12 వారాల ప్రసూతి సెలవుల్ని 26 వారాలకు పెంచే దిశగా కసరత్తు చేస్తోంది. అద్దె గర్భం.. దత్తత పిల్లల విషయంలోనూ ఈ సెలవును వర్తింపచేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించి కార్మిక సంఘాల నాయకులతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్లుగా చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే.. మహిళలకు ఇప్పటివరకూ ఇస్తున్న 12 వారాల ప్రసూతి సెలవులు 26 వారాలకు మారనున్నాయి.
వెంకయ్య మనసుకు అంత బాధ కలిగించిందెవరు?

భారత్ లో మత అసహనం ఎక్కువైందని.. తన భార్య దేశం విడిచి వెళ్లాలన్న మాటను కూడా చెప్పిందంటూ బాలీవుడ్ టాప్ స్టార్ అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా అగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అమీర్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి వెంకయ్య స్పందించారు. అమీర్ చేసిన వ్యాఖ్యలు మనసుకు తీవ్ర ఇబ్బందిని కలిగించాయని.. మనసుకు చాలా బాధేసిందని వ్యాఖ్యానించారు. కొంతమంది తప్పుదారిలోకి వెళ్లబడుతున్నారని.. మరికొందరు తప్పుదోవ పడుతున్నారన్న ఆయన.. మరే దేశంలోనూ లేని చక్కటి పరిస్థితులు భారత్ లోనే ఉన్నాయని స్పష్టం చేశారు.
సీమ.. దక్షిణ కోస్తాల మీద మరో ‘పిడుగు’

ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న రాయలసీమ.. దక్షిణ కోస్తాలకు మరో ముప్పు పొంచి ఉందా అంటే అవుననే చెబుతున్నారు వాతావరణ నిపుణులు. దక్షిణ అండమాన్ సముద్ర పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నెమ్మదిగా బలపడుతోంది. గురువారం (రేపటికి) నాటికి అల్పపీడనంగా బలపడనుంది. ఈ కారణంగా రాయలసీమ.. దక్షిణ కోస్తా (గుంటూరు నుంచి నెల్లూరుజిల్లా వరకు) ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ అల్పపీడనం.. వాయుగుండంగా మారి.. తీవ్ర ప్రభావం చూపిస్తే.. ఇప్పటికే వర్షాలతో కిందామీదా పడుతున్న సీమ.. దక్షిణ కోస్తాలకు మరింత కష్టం తప్పదంటున్నారు.

‘అమీర్’ బ్రాండ్లకు మరింత ముప్పు

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన మత అసహన వ్యాఖ్యలు.. దేశం విడిచి వెళ్లాలంటూ తన భార్య చెప్పిన మాటలు చెప్పి భారీ తప్పు చేశాడా? అంటే అవుననే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే స్నాప్ డీల్ యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేస్తున్న వారు.. ఇప్పుడు అమీర్ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న బ్రాండ్ల మీద దృష్టి సారిస్తున్నారు. అమీర్ బ్రాంపడ్ అంబాసిడర్ గా ఉన్న స్నాప్ డీల్ మొబైల్ యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేసేందుకు యాప్ వాపసీ కార్యక్రమం ఉద్యమం మాదిరి ఆన్ లైన్ లో సాగుతోంది. స్నాప్ డీల్ కు సింగిల్ రేటింగ్ ఇచ్చి మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. మరోవైపు.. అమీర్ ను బలపర్చేవారు స్నాప్ డీల్ కు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తున్నారు. అమీర్ బ్రాండ్ల పై వెల్లువెత్తుతున్న నిరసనను గుర్తించి గోద్రెజ్ తమ మీద ప్రభావం పడుతుందన్న భావనతో ముందు జాగ్రత్తగా తాము గత ఏడాదే అమీర్ తో కాంట్రాక్ట్ ముగించుకున్నట్లుగా పేర్కొని జాగ్రత్తపడుతోంది. మొత్తంగా చూస్తే.. అమీర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న బ్రాండ్లకు కొత్త ముప్పు మొదలైంది.