Begin typing your search above and press return to search.

గుడ్ న్యూస్: 4ల‌క్ష‌ల ఆదాయం వ‌ర‌కు నో ఐటీ

By:  Tupaki Desk   |   18 Jan 2017 9:55 AM GMT
గుడ్ న్యూస్: 4ల‌క్ష‌ల ఆదాయం వ‌ర‌కు నో ఐటీ
X
2017-18 బడ్జెట్ లో మధ్యతరగతి వారికోసం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీపి క‌బురు అందిస్తార‌ని చెప్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్న నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలు ఈసారి బడ్జెట్‌ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. డిమానిటైజేషన్ ప్రభావంతో మిడిల్‌ క్లాస్‌ లో ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఈసారి బడ్జెట్లో బోలెడు వరాలు కురిపించవచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. వివిధ వ‌ర్గాల అంచ‌నా ప్ర‌కారం కేంద్ర మంత్రి ఈ పది చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

1. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంపు:
ప్రస్తుతం రూ.2.5 లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపు లభిస్తోంది. ఈ పరిమితిని గరిష్ఠంగా రూ.4 లక్షల వరకు పెంచే అవకాశం ఉంది. తద్వారా మధ్యతరగతి వారికి భారీ ఊరట లభించనుంది.

2. పన్ను శ్లాబుల్లో మార్పులు
రూ.2.5-5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారు 10 శాతం పన్ను శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.5 -10 లక్షల వరకు 20 శాతం, ఆపైన 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ శ్లాబులను కూడా మార్చవచ్చని అంచనా. అదే గనుక జరిగితే మధ్యతరగతి వారిపై పన్ను భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది.

3. అలవెన్సులపై పన్ను మినహాయింపు పరిమితి పెంపు
సాధారణంగా ఉద్యోగులకు కంపెనీ నుంచి పలురకాల అల వెన్సులు - భత్యాలు లభిస్తుంటాయి. వీటిపై లభించే పన్ను మినహాయింపు పరిమితిని మరింత పెంచే అవకాశం ఉంది. తద్వారా మధ్యతరగతి వేతన జీవులపై పన్ను భారం తగ్గే అవకాశం ఉంటుంది.

4.సెక్షన్ 80సీ మినహాయింపుల పరిమితి పెంపు
ఐటీ చట్టంలో సెక్షన్ 80సీ కింద లక్షన్నర వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ పరిమితిని పెంచే అవకాశం ఉంది. ఫలితంగా మిడిల్ కాస్ల్ మరింత ఆదా చేసుకోవచ్చు.

5.సీనియర్ సిటిజెన్స్‌కు మరిన్ని మినహాయింపులు
ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు(60-80 ఏళ్ల‌ వయసున్నవారు) రూ.3 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు లభిస్తోంది. ఈ పరిమితిని రూ.4 లక్షలకు పెంచే అవకాశం ఉంది. అలాగే వృద్ధులకు (80 ఏళ్ల‌ పైబడినవారు) పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షల స్థాయి నుంచి రూ.6.50 లక్షలకు పెంచవచ్చని అంచనా.

6. ఇన్‌ ఫ్రా బాండ్లలో పెట్టుబడులపై పన్ను రాయితీలు
మౌలిక బాండ్లలో రూ.20 వేల వరకు పెట్టుబడులపై గతంలో కల్పించిన పన్ను రాయితీలను పునఃప్రవేశపెట్టే అవకాశం ఉంది. తద్వారా మధ్యతరగతి వర్గాల పొదుపు సొమ్మును ఈ బాండ్లలోకి మళ్లించాలని కేంద్రం భావిస్తున్నది.

7.ఎన్‌ పీఎస్ పెట్టుబడులపై మరిన్ని ప్రోత్సాహకాలు
నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ లో (ఎన్‌ పీఎస్) పెట్టుబడులు పెట్టేవారికి కేంద్రం ఈసారి బడ్జెట్లో మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించవచ్చు.

8. గృహ రుణాల వడ్డీపై సబ్సిడీ
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తృతీయ శ్రేణి నగరాల్లో రూ.12 లక్షల వరకు గృహరుణం తీసుకునేవారికి 3 శాతం వడ్డీరాయితీ, రూ.9 లక్షల వరకు లోన్ తీసుకుంటే 4 శాతం వడ్డీ సబ్సిడీ కల్పిస్తున్నది కేంద్రం. ఈ పథకాన్ని పెద్ద నగరాల్లో నివసించేవారికి, అధిక మొత్తంలో రుణం తీసుకునేవారికీ వర్తింపజేసే అవకాశం ఉంది.

9.గృహ రుణ ఈఎంఐలపై పన్ను రాయితీ పరిమితి పెంపు
ప్రస్తుతం ఏటా రూ.2 లక్షల వరకు గృహరుణ వడ్డీ చెల్లింపులతో, రూ.1.50 లక్షల వరకు అసలు మొత్తం చెల్లింపులపై పన్ను మినహాయింపు లభిస్తున్నది. బడ్జెట్లో ఈ రెండు పరిమితులను మరింత పెంచే అవకాశం ఉంది.

10. గృహ రుణ వడ్డీపై మరింత వెసులుబాటు
ప్రస్తుతం రుణం తీసుకొని ఇల్లు కొనుగోలు చేసినవారు ఆ ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాతే వడ్డీ చెల్లింపులపై మినహాయింపు పొందే అవకాశం ఉంది. ఇకపై అంతకు ముందు కూడా మినహాయింపు పొందే అవకాశం కల్పించవచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/