అడ్డంగా దొరికి!... ఈ అఫెన్సింగేంటీ రాజా?

Mon Feb 18 2019 17:27:02 GMT+0530 (IST)

ఓటుకు నోటు కేసులో నాడు టీడీపీ నేతగా ఉన్న రేవంత్ రెడ్డి అడ్డంగా బుక్కైపోయారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్చే స్టీఫెన్ సన్ ఓటును కొనుగోలు చేసేందుకు టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పథకం రచిస్తే... దానిని అమలులో పెట్టేందుకు నాడు టీ టీడీపీలో కీలక నేతగా ఉన్న రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. అయితే ఈ తంతుపై విశ్వసనీయ సమాచారం అందుకున్న కేసీఆర్ సర్కారు... పక్కా నిఘా పెట్టి రేవంత్ ను రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఓ నెల పాటు రేవంత్ రెడ్డి జైల్లో కూడా ఉండివచ్చారు. ఆ తర్వాత టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరిన రేవంత్... మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. అయితే ఎన్నికలకు ముందు వరకు ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి కదలిక కనిపించలేదు. అయితే ఎన్నికలు ముగియగానే ఈ కేసులో కదలిక వచ్చేసింది.ఇప్పటికే ఈ కేసు దర్యాప్తును స్వీకరించేసిన ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. ఇటీవలే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వేం నరేందర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడిని కూడా విచారించింది. తాజాగా రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్న ఉదయ సింహకు కూడా ఈడీ శ్రీముఖం అందింది. నేడో రేపో రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు అందనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఆసక్తికర కామెంట్లు చేశారు. ఈ కేసులో తాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డానన్న విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండానే... ఎదురు దాడికి దిగేశారు. ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్ చేతులు కలిపారని ఈ కారణంగానే ఈ కేసులో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసిందని ఆయన తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు.

మోదీ కేసీఆర్ ఒక్కటయ్యారు కాబట్టే తనపై ఈడీ కేసు నమోదు చేసిందని ఆరోపించిన రేవంత్... అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రూ. 150 కోట్లు సీజ్ చేశారని వారందరి మీదా ఈడీ కేసు పెట్టిందా? అని ప్రశ్నించారు. పట్నం నరేందర్ రెడ్డి దగ్గర రూ. 50 లక్షలు దొరికాయని మరి ఆయనపై ఈడీ కేసు ఎందుకు పెట్టలేదని రేవంత్ సూటిగా ప్రశ్నించారు. తన మీద చార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత మళ్ళీ ఈ కేసును ఈడీకి ఎందుకు అప్పగించారని ప్ఱశ్నించిన రేవంత్...  కేవలం తనను రాజకీయంగా వేధించడానికే ఈడీ కేసును వాడుకుంటున్నారని ఆరోపించారు. మొత్తంగా ఎంతైనా తాను రాజకీయ నేతనని తాను తప్పులు చేసి అడ్డంగా బుక్కైనా కానీ ఏమీ చేయరాదన్న కోణంలో రేవంత్ చేసిన వాదనపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.