క్రైం - మాఫియాకు డెన్ గా 'అమరావతి'

Mon Feb 18 2019 12:38:28 GMT+0530 (IST)

సమీప భవిష్యత్తులో ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని ‘అమరావతి’  ప్రపంచస్థాయి నగరంగా మారుతోందని ఏపీ సీఎం చంద్రబాబు సహా టీడీపీ నేతలు నొక్కివక్కాణిస్తున్నారు.  కానీ ఇప్పుడు అమరావతిలో వేల్లూనుకుంటున్న పరిస్థితులు చూస్తే మాత్రం అమరావతి ప్రపంచస్థాయి నగరానికంటే ముందు క్రైం మరియు మాఫియాకు డెన్ గా మారబోతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.అమరావతిలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఇటీవల కాలంలో వరుసగా మూడు హత్యలు అమరావతి పరిధిలోని తాళ్లూరు - మంగళగిరి మండలాల్లో చోటుచేసుకున్నాయి. 

ఇక షాకింగ్ విషయం ఏంటంటే.. అమరావతి చుట్టుపక్కల ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. చంద్రబాబు నివాసం ఉన్న ఉండవల్లి సమీపంలో కూడా యథేచ్ఛగా ఇసుకను కొల్లగొడుతున్నారు. ఇక ఇక్కడ నుంచి విచ్చలవిడిగా ఇసుక తరలిస్తున్నా ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలను పోలీసులు అధికారులు చేపట్టకపోవడంతో ఈ మాఫియా మూడు పువ్వులు - ఆరు కాయలుగా ఇసుకను దోచేస్తోంది.

పెనుమాక ఇసుక రీచ్ నుంచి ఇసుక మాఫియా అక్రమంగా ఇసుకను తవ్వుతూ యథేచ్ఛగా తరలిస్తోంది. ఇక్కడ ఇసుక కరిగిపోవడంతో భవిష్యత్తులో విజయవాడకు నీటి కష్టాలు దాపురిస్తాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇసుక మాఫియా ఎంత బలంగా ఉందంటే.. రోడ్డు పనుల కోసం అమరావతికి వచ్చిన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లను ఇసుక విషయంలో తలదూర్చినందుకు హత్య చేశారు. ఇదే విషయంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయానికి కేవలం 5 కి.మీల దూరంలో నవలూరులో ఒక మహిళ జ్యోతి హత్యకు గురైంది.

ఈ కేసును పోలీసులు మూసి వేశారు. డిసెంబర్ 2014లో అమరావతి రాజధాని ప్రాంతంలో పంటలు దెబ్బతింటున్న విషయంలో రైతులు ఆందోళనలు చేశారని.. ఆ గొడవల్లోనే చనిపోయినట్టు పోలీసులు చెప్పి ఇసుక మాఫియా నేరస్థులను కాపాడారని ఆరోపణలు వచ్చాయి.

అమరావతిలో పోలీసులు కేవలం టీడీపీ నేతలకు మాత్రమే భద్రత కల్పిస్తూ ప్రజలను రైతులు మధ్యతరగతి వ్యాపారులను విస్మరిస్తున్నారు. అందుకే అమరావతిలో విచ్చలవిడిగా భూ - ఇసుక దందాలు - హత్యలు జరుగుతున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇలాగే సాగితే అమరావతి ప్రపంచస్థాయి నగరానికంటే కూడా క్రైం మాఫియాకు కేంద్రంగా మారడం ఖాయమని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.