Begin typing your search above and press return to search.

బ్లాక్‌ మెయిల్‌ కు భ‌య‌ప‌డే టీవీ9పై స్పందించ‌లేదా బాబు?

By:  Tupaki Desk   |   20 April 2018 4:35 PM GMT
బ్లాక్‌ మెయిల్‌ కు భ‌య‌ప‌డే టీవీ9పై స్పందించ‌లేదా బాబు?
X
జ‌న‌సేన పార్టీ అధినేత - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీడియాపై త‌న ఎదురుదాడిని కొన‌సాగిస్తున్నారు. ఫిలింన‌గ‌ర్ లోని ఫిలించాంబ‌ర్ లో ప‌లు అంశాల‌పై స్పందించిన ఆయ‌న అనంత‌రం కూడా మీడియాపై మండిప‌డ్డారు. న్యాయవాదులతో సమావేశంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప‌లు అంశాల‌పై ఘాటుగా స్పందించార‌ని జ‌న‌సేన పార్టీ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ఒక అమ్మాయి నడిరోడ్డు మీద బట్టలు విప్పేసిన‌పుడు బట్టలు కప్పాలి కానీ అలా చేయకుండా వీడియో తీయటం ఏంటని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. `నాడు రామానాయుడు స్టూడియో దగ్గర బాంబు బ్లాస్ట్ జరిగి చెయ్యి తెగిపోయిన ఒక వ్యక్తి దగ్గర మైక్ పెట్టి మాట్లాడటం ఏంటి? అంతకంటే అమానవీయ వైఖరి మరొకటి ఉంటుందా? ఈ సెన్సేషనలిజం ఎందుకు` అంటూ ఆయ‌న సూటిగా ప్ర‌శ్నించారు.

ప్ర‌స్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ ఉందని - లైంగిక వేధింపుల గురించి ఒక్కసారి వార్తల్లో ప్రస్తావిస్తే సరిపోతుందని,అలా కాకుండా పదేపదే అదే విషయం గురించి ప్రస్తావించటం - గంటల తరబడి డిబేట్లు పెట్టడం వల్ల సమాజానికి ఏం చెప్పాలి అనుకుంటున్నారని ఆయ‌న ప్ర‌శ్నించారు. `మీరే వారిని మానసికంగా ప్రేరేపిస్తున్నారు. మొన్న ఎనిమిది ఏళ్ళ పసిపాపని అత్యాచారం చేశారు. నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు - మీరు చేస్తున్న ప్రచారాలు చూస్తే నాకు భయంగా ఉంది.. సినిమాకి సెన్సార్ ఉంది. చిన్న పిల్లలు చూడకూడని విషయాలని నిర్మొహమాటంగా తీసేస్తారు. కానీ మీడియాకి సెన్సార్ ఎందుకు లేదు? మీడియాకి కూడా జవాబుదారీతనం తీసుకుని రావాలి` అని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. `టీవీ9 రవి ప్రకాష్ తనని బ్లాక్‌ మెయిల్ చేసాడని చంద్రబాబునాయుడు గారే స్వయంగా చెప్పారు, మరి అలాంటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎందుకు? అంటే ఆయన ఏదో తప్పు చేసాడనే కదా?` అంటూ కొత్త పాయింట్‌ ను ప‌వ‌న్ తెర‌మీద‌కు తీసుకువ‌చ్చారు.

పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ సంబంధించిన వారిని కూర్చోబెట్టి ప్రస్తుతం జరుగుతున్న సమస్యపై వారి ఆలోచన ఏంటో అడుగుదామ‌ని - మున్ముందు - అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనుకుంటున్నారో అడుగుదామ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వివ‌రించారు. `టీవీ5 న్యూస్ ప్రజెంటర్ సాంబశివరావు చిత్ర పరిశ్రమని ఉద్దేశించి చాలా మాములుగా మీ ఇండస్ట్రీలో ల**లు లేరా అన్నాడు. అంత దారుణమైన బూతుని అంత మాములుగా ఆయన ఎలా అన్నాడు? నేను కేరళలో షూటింగ్‌కి వెళ్ళినప్పుడు నా ముందే కొంత మంది ఆకతాయిలు అమ్మాయిలని వేధించారు. వారిని ఆపడానికి నేను కర్ర పట్టుకుని కొట్టాల్సి వచ్చింది. ఇలాంటి వ్యక్తులు ఉన్న సమాజంలో ఒక వ్యక్తి చిత్ర పరిశ్రమని ఉద్దేశించి అలా మాట్లాడి సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? విలువలు పాటించని మీరా మాకు విలువల గురించి చెప్పేది?` అంటూ ప‌వ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు వివ‌రించారు. `మీరు మీరు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు సెటిల్మెంటులు చేసుకుంటారు. మధ్యలో ఏ సంబంధం లేని మమ్మల్ని ఎందుకు అంటున్నారు? నన్ను బూతు మాట అన్న ఆమె బాధని నేను అర్థం చేసుకోగలను కానీ వేరే ఎవరూ కూడా ఇలా బరితెగించకుండా ఉండటానికి ఆమెకి, ఆమె అన్న మాటలని ఖండించాల్సింది పోయి పదేపదే ప్రదర్శించిన మీడియాకి శిక్ష పడాలి` అని అన్నారు.

`ఒకడు ఏమో నీలిచిత్రాలు చూడటంలో తప్పులేదు అంటాడు. ఒకడు ఏమో నీలిచిత్రాలే నా లోకం అంటాడు. అసలు వారి ఇష్టాయిష్టాలు సమాజానికి మీడియా ద్వారా చెప్పటం ఎందుకు? ప్రతీ ఛానల్ ఒక మాఫియా లాగా తయారు అయ్యింది. మీరు మాకు చాలా మానసిక అశాంతిని కలిగిస్తున్నారు. మనకి అసలు వార్తలు అవసరం లేదు. మనం పురాతన కాలం నాటికి వెళ్ళిపోదాం. అత్యాచారానికి గురి అయిన ఎందరో చిన్నపిల్లలు సునీతాకృష్ణన్ దగ్గర ఉన్నారు. వారిని చూస్తే నా గుండె తరుక్కుపోతుంది. అంతమంది చిన్నపిల్లల జీవితాలని నాశనం చేసిన ఈ సమాజంలో మీడియా ఎంత బాధ్యతగా ఉండాలి. అవేవి లేకుండా ఒక విషయం గురించి సూటిగా చెప్పకుండా పక్కదారి పట్టిస్తున్నారు.` అంటూ విరుచుకుప‌డ్డారు. `ఒక వ్యక్తిని కించపరిచి మీరు వ్యాపారం చేస్తారా? అసలు ఒకరి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడాల్సిన అవసరం ఏంటి? మేము మీ వ్యక్తిగత జీవితాలలోకి చొరబడలేము అనుకుంటున్నారా?` అంటూ ప్ర‌శ్నించారు.