Begin typing your search above and press return to search.

పటేల్ ప్రధాని అయితే ఏమయ్యేది?

By:  Tupaki Desk   |   30 Nov 2015 7:48 AM GMT
పటేల్ ప్రధాని అయితే ఏమయ్యేది?
X
దేశానికి తొలి ఉప ప్రధాని - హోంమంత్రిగా వ్యవహరించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పై ప్రముఖ మేధావి కంచె ఐలయ్య తన కోపమంతా చూపించారు. పటేల్ కు ప్రధాని పదవి దక్కకపోవడం వల్ల భారత్ దేశం బతికిపోయిందని... ఆయనకు ప్రధాని పదవి కానీ ఇచ్చి ఉంటే ఇండియాను ఇంకో పాకిస్థాన్ చేసి ఉండేవాడని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన టైమ్స్ లిటరేచర్ ఫెస్టివల్ లో మాట్లాడిన ఐలయ్య అక్కడ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి. అంతేకాదు... రాజ్యాంగ రచన విషయంలో అంబేద్కర్ కు ఆటంకాలు సృష్టించడానికి కూడా పటేల్ ఎన్నో ప్రయత్నాలు చేశారని ఐలయ్య ఆరోపించారు. మనుస్మృతిని నమ్మేవారు మాత్రమే రాజ్యాంగ రచన చేయాలని వాదించి అంబేద్కర్ ను రాజ్యాంగం రాయనివ్వకుండా అడ్డుకోవాలని పటేల్ ట్రై చేశారని ఐలయ్య ఆరోపించారు.

కాగా ఐలయ్య పటేల్ తో పాటు ప్రధాని నరేంద్ర మోడీనీ లక్ష్యంగా చేసుకున్నారు. పటేల్ ను విపరీతంగా అభిమానించే మోడీ ఆయన భారీ విగ్రహాన్ని నెలకొల్పనున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. 2014 ఎన్నికల సందర్భంలో మోడీ వల్లభాయ్ పటేల్ ప్రస్తావన పదేపదే చేసేవారు. పటేల్ ను దేశానికి మొదటి ప్రధాని చేసుంటే భారత్ గమనం మరోలా ఉండేదని నరేంద్ర మోదీ 2014 ఎన్నికల ప్రచారం అన్నారని గుర్తు చేసిన ఆయన అందుకు కౌంటర్ గా ఈ వ్యాఖ్యలు చేశారు. పటేల్ ప్రధాని పదవిని చేపట్టివుంటే మనదేశం కూడా పాకిస్థాన్ లా తయారయ్యేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం కుప్పకూలేదని ఆయన అన్నారు.

మరోవైపు ఇటీవల పాకిస్థాన్ మంత్రి పుస్కకావిష్కరణకు పూనుకొని శివసేన నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కొన్న, ముఖంపై నల్లరంగు వేయించుకున్న రచయిత సుదీంధ్ర కులకర్ణి కూడా పటేల్ పై ఆరోపణలు చేశారు. సామాజిక ఐక్యత, సమానత్వం లేదా రాజకీయ ఏకాభిప్రాయానికి వల్లభాయ్ పటేల్ కృష్టి చేయలేదని ఆయన అన్నారు. 'మనకు ఉక్కుమనిషి అక్కర్లేదు. అందరినీ కలుపుపోయే హృదయం ఉన్న నాయకులు కావాలి' అని కులకర్ణి వ్యాఖ్యానించారు. వ్యవహారం చూస్తుంటే మోడీ వ్యతిరేకత కాస్త పటేల్ వ్యతిరేకతగానూ మారుతున్నట్లుగా ఉంది. గతాన్ని తవ్వుకుని గల్లాలు పట్టుకునేకంటే వర్తమానానికి పనికొచ్చే మాటలు చెప్పడం ఎవరికైనా మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.