Begin typing your search above and press return to search.

ఆ ప్ర‌ధాని ప్లేస్‌ లోకి ఆయ‌న సోద‌రుడు!

By:  Tupaki Desk   |   23 July 2017 4:41 AM GMT
ఆ ప్ర‌ధాని ప్లేస్‌ లోకి ఆయ‌న సోద‌రుడు!
X
అక్ర‌మాస్తులు కూడ‌బెట్టిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ పీక‌ల్లోతు క‌ష్టాల్లో కూరుకుపోయిన పాక్ ప్ర‌ధాన‌మంత్రి న‌వాజ్ ష‌రీఫ్ ముచ్చ‌ట తెలిసిందే. అయ్య‌గారి లీల‌ల్ని పనామా పేప‌ర్స్ లీకేజ్ పుణ్య‌మా అని బ‌య‌ట‌ప‌డింది. ఈ వ్య‌వ‌హారంలో ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్న అంచ‌నాల్ని నిజం చేస్తూ.. తాజాగా ష‌రీఫ్ కు ప‌ద‌వీ గండం ప‌క్కా అన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ కేసులో ఆయ‌న దోషిగా తేలే అవ‌కాశం ఎక్కువ‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. మ‌రి దోషిగా తేలితే ప్ర‌ధాని కుర్చీలో ఎవ‌రు కూర్చుంటార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇప్పుడు వస్తున్న వార్త‌ల ప్ర‌కారమైతే అక్ర‌మాస్తుల కేసులో తుది తీర్పు ఎలా వ‌చ్చినా.. అందుకు న‌వాజ్ సిద్ధ‌మైన‌ట్లుగా చెబుతున్నారు. ఒక‌వేళ‌.. ఆయ‌న కానీ దోషిగా తేలితే.. ప్ర‌ధాని కుర్చీలో ఆయ‌న సోద‌రుడ్ని కూర్చోబెట్టే దిశ‌గా పావులు జోరుగా క‌దులుతున్నాయి. ష‌రీఫ్ సోద‌రుడు పంజాబ్ ప్రావిన్స్ సీఎం (షెహ్ బ‌జ్ ష‌రీఫ్‌)గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు

అయితే.. ఇదంతా చెప్పినంత ఈజీ కాద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. ఎందుకంటే.. జాతీయ అసెంబ్లీలోనూ.. పార్ల‌మెంటుల‌లో న‌వాజ్ సోద‌రుడు స‌భ్యుడు కాక‌పోవ‌ట‌మేన‌ని చెబుతున్నారు. ఒక‌వేళ షెహ‌బ‌జ్ కానీ ప్ర‌ధాని కుర్చీలో కూర్చోబెడితే.. ఉప ఎన్నిక‌ల్ని నిర్వ‌హించాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు.

అయితే.. ఉప ఎన్నిక కార్య‌క్ర‌మం పూర్తి అయ్యే వ‌ర‌కూ దేశ ర‌క్ష‌ణ మంత్రి ఖ‌వ‌జా అసిఫ్ ను మ‌ధ్యంత‌ర ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు అప్ప‌జెబుతార‌ని.. ఎన్నిక కార్య‌క్ర‌మం పూర్తి అయ్యాక ఆయ‌న వైదొలిగి.. ఆయ‌న స్థానంలో న‌వాజ్ సోద‌రుడు ప్ర‌ధాని కుర్చీలో కూర్చోవ‌చ్చ‌న్న అభిప్రాయం వినిపిస్తోంది. అక్ర‌మాస్తుల కేసులో న‌వాజ్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తూ.. ఆయ‌న ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయినా..ఆయన పార్టీ మాత్రం న‌వాజ్ వైపే ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే.. అక్ర‌మాస్తుల కేసులో పీక‌ల్లోతు కూరుకుపోయిన న‌వాజ్ ను ప్ర‌ధాని ప‌ద‌వి నుంచి వెంట‌నే త‌ప్పుకోవాలంటూ విప‌క్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. వీటిని న‌వాజ్ తోసిపుచ్చుతున్నారు. కోర్టు తీర్పు వెలువ‌డే వ‌ర‌కూ న‌వాజ్ ప్ర‌ధాని కుర్చీలో నుంచి దిగేందుకు ఏ మాత్రం సుముఖంగా లేర‌ని చెబుతున్నారు.