Begin typing your search above and press return to search.

రోడ్ల‌మీద న‌మాజ్‌.. యోగి ఓపెన్ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   17 Aug 2017 9:41 AM GMT
రోడ్ల‌మీద న‌మాజ్‌.. యోగి ఓపెన్ కామెంట్స్‌
X
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ త‌న హిందూ ఇజాన్ని బ‌య‌ట పెట్టుకున్నారు. లౌకిక దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి తాను ముఖ్య‌మంత్రిగా ఉన్నాన‌ని, అన్ని కులాలు, అన్ని మ‌తాల వారిని స‌మానంగా క‌లుపుకొని భాయి భాయిగా పాల‌న సాగించాల‌ని అనుక్ష‌ణం గుర్తు పెట్టుకోవాల్సిన ఆయ‌న... ఆర్ ఎస్ ఎస్ నుంచి నేర్చుకున్న పాఠాల‌ను అమ‌లు చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. మైనార్టీ ముస్లింల‌పై ఉక్కుపాదం మోపాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తాజాగా చేసిన వ్యాఖ్య‌లు దేశాన్ని కుదిపేస్తున్నాయి.

దీంతో ముస్లిం వ‌ర్గాల నుంచి పెద్ద ఎత్తున యోగిపై విమ‌ర్శ‌ల దాడి పుంజుకుంది. అస‌లేం జ‌రిగిందో చూద్దాం.. నిన్న దేశ వ్యాప్తంగా కృష్ణాష్ట‌మి వేడుక‌లు జ‌రిగాయి. దీంతో యాద‌వులు ఎక్కువ‌గా ఉన్న యూపీలోనూ పెద్ద ఎత్తున ఈ సంబ‌రాల‌ను మిన్నంటాయి. అయితే, ఒకింత అత్యుత్యాహం చూపించిన పోలీసులు త‌మ త‌మ పోలీస్ స్టేష‌న్ల‌ను బృందావ‌నాలుగా మార్చేసి.. వాళ్లు శ్రీకృష్ణులుగా మారిపోయారు. దీంతో ప్ర‌తి పోలీస్ స్టేష‌నూ కృష్ణాష్ట‌మి వేడుక‌ల కేంద్రంగా మారిపోయింది. ఫ‌లితంగా అనేక మంది ఫిర్యాదిదారులు తీవ్ర ఇక్క‌ట్లు ప‌డ్డారు.

ఈ విష‌యం ఆనోటా ఈనోటా సీఎం యోగికి తెలిసింది. దీంతో ఆయ‌న నేరుగా పోలీస్ స్టేష‌న్ల అధికారుల‌తో మాట్లాడి కృష్ణాష్ట‌మి వేడుక‌ల విష‌యంలో కొన్ని నిబంధ‌న‌లు పాటించండి అంటే స‌రిపోయేది. అయితే, ఆయ‌న మాత్రం త‌న‌లో క‌ర‌డు గ‌ట్టుకుపోయిన ముస్లిం వ్య‌తిరేక‌త‌ను ఈ సంద‌ర్భంగా బ‌య‌ట పెట్టుకున్నారు. కృష్ణాష్ట‌మికి రంజాన్‌కి ముడిపెడుతూ.. రంజాన్‌ పర్వదినం రోజున రోడ్లపైకి వచ్చి నమాజ్‌ చేయడం సరి కాదని అన్నారు. ముస్లింలు అలా రోడ్ల మీద న‌మాజ్ చేస్తున్నారు కాబ‌ట్టి .. వారిని చూసి పోలీసులు త‌మ స్టేష‌న్ల‌ను బృందావ‌నాలుగా మార్చేశార‌ని వెనుకేసుకొచ్చారు.

ముందు ముస్లింలు మారాల‌ని సూచించారు. వారు త‌మ త‌మ ప్రార్థ‌న‌ల‌ను మ‌సీదుల్లోనే నిర్వ‌హించుకోవాల‌ని, ఎక్క‌డ బ‌డితే అక్క‌డ కూడ‌ద‌ని సెల‌విచ్చారు. ముస్లింలను తాను ఇలా అడగకపోతే ఉత్తరప్రదేశ్‌ పోలీసు స్టేషన్లలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకోవడం ఆపేయాలని తాను కోరలేనని అన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌కు మైనార్టీ వ‌ర్గాలు తీవ్రంగా మండిప‌డుతున్నాయి. సో.. ఎంత పెద్ద సీట్లో కూర్చోబెట్టినా.. ప‌రిస్థితి మార‌ద‌ని యోగి మ‌రోసారి నిరూపించారు.