బీజేపీ మళ్లీ వస్తే...ఇండియా హిందూపాకిస్థాన్

Thu Jul 12 2018 14:31:12 GMT+0530 (IST)

కట్టుకున్న భార్య మానసిక క్షోభకు - అనంతరం ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడన్న ఆరోపణలు ఎదుర్కుంటూ ముందస్తు బెయిల్ పై స్వేచ్చా జీవితం గడుపుతున్న కాంగ్రెస్ నేత శశి థరూర్ భారతదేశం గురించి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పొరుగుదేశమైన పాకిస్థాన్ లోని ఉగ్రవాదంతో ఆయన భారత్ ను పోల్చారు. రాజకీయంగా ఈ కామెంట్లు చేసినప్పటికీ దురుద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చర్చ జరుగుతోంది. తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో శశి థరూర్ మాట్లాడుతూ 2019లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ఇండియా ఓ హిందూ పాకిస్థాన్ అవుతుందని అన్నారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ సహా పలువురు జాతీయవాదుల మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.తిరువనంతపురంలో శశిథరూర్ మాట్లాడుతూ బీజేపీ గెలిస్తే కొత్త రాజ్యాంగాన్ని రాస్తుందని అది దేశాన్ని మరింత అసహనం దిశగా తీసుకెళ్తుందని థరూర్ అన్నారు. దేశంలో మైనార్టీల హక్కులను అణిచేస్తారని ఆయన ఆరోపించారు.`మన ప్రజాస్వామ్య రాజ్యాంగం ఇక మనుగడ సాగించలేదు. ఆ రాజ్యాంగాన్ని మొత్తం మార్చేసి కొత్తదాన్ని రాసే అన్ని శక్తులు బీజేపీలో ఉన్నాయి. కొత్త రాజ్యాంగంలో హిందూ రాష్ట్ర ఆదర్శాలు మాత్రమే ఉంటాయి. మైనార్టీలకు సమానత్వం అనేది ఉండదు. గాంధీ - పటేల్ - నెహ్రూ - మౌలానా ఆజాద్ తీవ్రంగా వ్యతిరేకించిన హిందూ పాకిస్థాన్ గా ఇండియా మారుతుంది` అని థరూర్ ఆరోపించారు.

థరూర్ ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్ వల్లే పాకిస్థాన్ ఏర్పడిందని - ఇప్పుడు మరోసారి దేశాన్ని - దేశంలోని హిందువులను అవమానించేలా థరూర్ వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర స్పష్టం చేశారు. దేశంలో ఉగ్రవాదం పెరిగిపోయేందుకు రాజకీయ అలజడులు చోటుచేసుకునేందుకు కారణం అయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పాకిస్థాన్ తో భారత్ ను పోల్చడం ఏమిటని ప్రశ్నించారు. ఇలా భారతీయు మనోభావాలను రెచ్చగొట్టే నాయకులకు సారథ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ కచ్చితంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.