Begin typing your search above and press return to search.

జియోను దెబ్బేసేందుకు వారిద్ద‌రూ క‌లిశారు

By:  Tupaki Desk   |   20 March 2017 7:27 AM GMT
జియోను దెబ్బేసేందుకు వారిద్ద‌రూ క‌లిశారు
X
జియో పుణ్య‌మా అని సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా రెండు ప్ర‌ముఖ టెలికం కంపెనీలు నిర్ణ‌యం తీసుకున్నాయి. మ‌హా దూకుడుగా దూసుకెళుతున్న జియోను నిలువ‌రించ‌టానికి.. రెండు ప్ర‌ముఖ కంపెనీలు తామిద్ద‌రం విలీనం కావాల‌న్న నిర్ణ‌యాన్ని తీసుకోవ‌ట‌మే కాదు.. తాజాగా ఆ దిశ‌గా పెద్ద అడుగు ప‌డింది. ప్ర‌ముఖ టెలికం కంపెనీలుగా ఉన్న వొడాఫోన్‌.. ఐడియా సంస్థ‌లు రెండు క‌లిసి మెగా విలీనానికి ఓకే చెప్పేశాయి. ఇందుకు సంబంధించి మెగా విలీనానికి ఐడియా సెల్యూలార్ బోర్డు తాజాగా ప‌చ్చ‌జెండా ఊపేసింది.

దీంతో.. 40 కోట్ల క‌స్ట‌మ‌ర్ల‌తో.. ఈ రెండు సంస్థ‌ల ఆదాయం రూ.80వేల కోట్ల‌కు చేరుకోనుంది. మొత్తం మార్కెట్లో 40 శాతం వినియోగ‌దారుల‌తో 43 శాతం రెవెన్యూ వాటా ఉన్న ఈ రెండు కంపెనీలు మార్కెట్ లీడ‌ర్‌గా అవ‌త‌రించ‌నున్నాయి. విలీనానికి ఐడియా సెల్యులార్ బోర్డు ఓకే చెప్పేసిన నేప‌థ్యంలో దేశంలోనే అతి పెద్ద టెలికాం దిగ్గ‌జంగా ఈ సంస్థ అవ‌త‌రించ‌నుంది. తాజా విలీనంతో ఎయిర్ టెల్ కంటే దాదాపు ప‌ది శాతం మార్కెట్ షేర్ ఈ విలీన సంస్థ సొంతం కానున్న‌ట్లుగా చెబుతున్నారు.

అంతేకాదు.. వైర్ లెస్ స‌బ్ స్క్రైబ‌ర్ల‌లో ఈ విలీన సంస్థ మార్కెట్ లీడ‌ర్ గా నిల‌వ‌నుంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఎయిర్ టెల్ తొలిస్థానంలో ఉండ‌గా.. వొడాఫోన్ రెండో స్థానంలో.. ఐడియా మూడో స్థానంలో నిలిచింది. జియో ఎంట్రీతో ప‌రిస్థితి ఒక్క‌సారిగా మారింది. ఎయిర్ టెల్ స్థానాన్ని జియో అక్ర‌మించింది. ఈ నేప‌థ్యంలో జియో దూకుడుకు క‌ళ్లాలు వేసేందుకు వొడాఫోన్‌.. ఐడియాలు విలీనానికి తెర తీశాయి.

తాజా విలీనంతో ఖ‌ర్చులు త‌గ్గ‌టంతో పాటు.. ఆదాయం మెరుగ‌య్యే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. విలీనం త‌ర్వాత ఏర్ప‌డే సంస్థ‌లో వొడాఫోన్‌కు 45 శాతం వాటా.. ఐడియా ప్ర‌మోట‌ర్ల‌కు 26 శాతం వాటా ఉండ‌నుంది. తాజా విలీనంతో బ‌ల‌మైన నెట్ వ‌ర్క్‌తో పాటు.. నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు మ‌రింత త‌గ్గ‌టంతో మ‌రింత దూసుకెళ్లే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/