Begin typing your search above and press return to search.

నేను హిందువునే....మీడియాతో అనిత‌!

By:  Tupaki Desk   |   22 April 2018 6:48 AM GMT
నేను హిందువునే....మీడియాతో అనిత‌!
X
ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా మ‌రో వివాదంలో చిక్కుకున్న సంగ‌తి తెలిసిందే. ఏడాది కాలంగా నాన్చి...నాన్చి...ఎట్ట‌కేల‌కు పూర్తిస్థాయి టీటీడీ ధర్మకర్తల మండలిని నియ‌మించిన బాబుకు కొత్త చిక్కులు వ‌చ్చిప‌డ్డాయి. ఆ మండ‌లిలోని మహిళా స‌భ్యుల‌లో టీడీపీ ఎమ్మెల్యే అనిత‌కూ బాబు చోటు క‌ల్పించారు. అయితే, తాను క్రిస్టియ‌న్ అని, తన బ్యాగు - కారులో బైబిల్‌ ఉంటుందని స్వ‌యంగా ప్ర‌క‌టించుకున్న అనిత‌కు చోటు క‌ల్పించ‌డంపై పెను దుమారం రేగుతోంది. నూతన పాలకమండలిలో అనిత కూడా స‌భ్యురాలిగా ఉండ‌డంపై స్వామి పరిపూర్ణానందతో పాటు మ‌రికొంద‌రు తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నారు. తాను క్రిస్టియన్ అని అనిత స్వ‌యంగా చెప్పిన ఓ ఇంట‌ర్వ్యూ వీడియోను స్వామి పరిపూర్ణానంద తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. టీటీడీ నూతన పాలక మండలిలో ఓ క్రిస్టియన్ కి అవకాశం ఇవ్వడంపై ఆయ‌న మండిప‌డ్డారు. మ‌రోవైపు - బీజేపీ నాయకులు కూడా అనిత నియామ‌కంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆమె నియామకాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకొంటామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాశ్‌ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై ఎమ్మెల్యే అనిత స్పందించారు.

ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె త‌న పై వ‌చ్చిన వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. తాను బేసిక్ గా క్రిస్టియ‌న్ అయిన‌ప్ప‌టికీ...తాను నూటికి నూరు శాతం హిందువునని అనిత స్ప‌ష్టం చేశారు. తాను హిందువున‌ని నిరూపించుకునేందుకు త‌న వ‌ద్ద ధృవ‌ప‌త్రాలు కూడా ఉన్నాయ‌న్నారు. తన ఇంట్లో పూజ గది కూడా ఉందని - క్రిస్టియ‌న్ అయితే ఇంట్లో పూజ గది ఎందుకు ఉంటుందని ఆమె వివరణ ఇచ్చారు. ఎస్సీ మాదిగ సామాజికవర్గానికి చెందిన తన స్టడీ సర్టిఫికెట్లలో హిందూ అనే ఉందని ఆమె మీడియాకె వెల్ల‌డించారు. త‌న ఇంట్లో ఉన్న హిందూ దేవుళ్ల ప్రతిమలను - తులసికోటను - దేవుడి గదిని మీడియాకు చూపించారు. తాను హిందువున‌ని - వెంక‌టేశ్వ‌ర‌స్వామి భ‌క్తురాలినని నిరూపించుకునే స్థాయికి కొంద‌రు త‌న‌ను తీసుకువ‌చ్చార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బేసిక్ గా తాను క్రిస్టియ‌న్ అని - ఆ త‌ర్వాత పూర్తిగా హిందూమ‌తాన్ని అనుస‌రిస్తున్నాన‌ని చెప్పిన వ్యాఖ్య‌ల‌ను...ప్ర‌తిప‌క్షాలు క‌ట్ అండ్ పేస్ట్ చేసి లేనిపోని వివాదాలు సృష్టిస్తున్నాయ‌ని అన్నారు. త‌న ఇంట్లో రుద్రాభిషేకాలు జ‌రిపిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయ‌న్నారు. త‌న‌ను అవ‌మానించ‌లేద‌ని, త‌న భ‌క్తిని అవ‌మానించార‌ని అన్నారు. త‌న‌పై సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేసిన వారికి నోటీసులు పంపిస్తాన‌ని - ప‌రువున‌ష్టం దావా వేస్తాన‌ని అన్నారు. వైసీపీ - బీజేపీ తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. త‌న‌పై దుష్ప్ర‌చారం చేస్తోన్న వారిపై న్యాయ‌పోరాటం చేస్తాన‌ని హెచ్చ‌రించారు.