బాబు ముందు ప్రత్యేక డిమాండ్ పెట్టిన ఐవైఆర్

Sun Apr 15 2018 20:00:01 GMT+0530 (IST)

నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్ ను తీర్చిదిద్దే విషయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదనలను ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మరోమారు తప్పుపట్టారు. రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు ప్రణాళికలు లోపభూయిష్టంగా ఉన్నాయని ఆయన ఆక్షేపించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా కృషి చేయాలని కోరారు. ఆదివారం అనంతపురం లలిత కళా పరిషత్తులో అభివృద్ధి వికేంద్రీకరణ-రాయలసీమ లో హైకోర్టు అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనని  రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాల్సిన బాద్యత ప్రభుత్వంపై ఉందని కృష్ణారావు స్పష్టం చేశారు.రాజధాని నిర్మాణం కోసం రాజమౌళి లాంటి దర్శకులను సంప్రదించడం ఏమిటని అసలు రాజధాని నిర్మాణానికి దర్శకులెందుకని గతంలో ఐవైఆర్ సూటిగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. రాజధాని నిర్మాణం అంటే సినిమా సెట్టింగులా అని నిలదీసిన ఐవైఆర్ డిజైన్ల ఖరారులోనే ఇంత సుదీర్ఘ సమయం గడిచిపోతే...ఇక నిర్మాణం ఎప్పుడవుతుందని కూడా ప్రశ్నించారు. ఇదే రీతిలో తాజాగా మరో అంశాన్ని ప్రస్తావించారు. కోస్తాలో రాజధాని ఏర్పాటు చేస్తున్నారని ఏపీలోని మరో కీలక ప్రాంతమైన సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటుగా బెంగళూరు-హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ వల్ల సీమకు ఎంతో ప్రయోజనం జరుగుతుందని వెంటనే ఈ డిమాండ్‌ను కేంద్రం వద్దకు తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో తీసుకున్న నిర్ణయాల ఫలితంగా తెలంగాణ అంతా హైదరాబాద్ నగరమేనని...మిగిలిన పట్టణాలు అంతగా అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. కానీ ఏపీలో అలాకాదని పలు నగరాలు అభివృద్ధి చెంది ఉన్నాయని ఐవైఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి వికేంద్రీకరణకు తగు నిర్ణయం తీసుకోవాలన్నారు.

కాగా గతంలోనే రాజధానికి అమరావతి ఎంపికను ఐవైఆర్ కృష్ణారావు తప్పుపట్టిన సంగతి తెలిసిందే. అమరావతితో పోలిస్తే దోనకొండ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేదని దొనకొండలో ప్రభుత్వ భూములతోపాటు అన్ని వసతులు ఉన్నాయని చెప్పారు. రాజధాని ఎంపికలో శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పట్టించుకోకపోవడం సరికాదని ఐవైఆర్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొద్దికాలం క్రితం వర్షాలకు వచ్చిన వరద కంటే పదిరెట్లు ప్రమాదకర స్థాయిలో అమరావతిలో వరదలు వచ్చి మునిగే అవకాశముందని ఐవైఆర్ కృష్ణారావు హెచ్చరించారు. అలాగే పర్యావరణ పరిరక్షణకు తీవ్ర విఘాతం కలిగి భవిష్యత్తులో కాలుష్యం బారిన పడుతుందని అన్నారు. ఇన్ని అవరోధాలు కనిపిస్తున్నా ప్రభుత్వం ముందుకెళుతోందని విమర్శించారు. ఏక పక్షంగా నిర్మించిన రాజధానులు విజయవంతం కాలేదని ఏపీ రాజధానిని అందరి అంగీకారంతోనే నిర్మించాలని ఐవైఆర్ కృష్ణారావు డిమాండ్ చేశారు.