బాబుపై ఫైర్ అయి..కేసీఆర్ ను మెచ్చుకున్న ఐఏఎస్

Mon Mar 12 2018 13:26:01 GMT+0530 (IST)

తెలుగు రాష్ర్టాల్లో రాజ్యసభ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఎన్నికకు ముందు అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ కొనసాగగా..వారి ఎంపిక అనంతరం ఈ ప్రక్రియ సాగిన తీరుపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ రథసారథులు అయిన ఇద్దరు చంద్రుళ్ల తీరుపై రాజకీయవర్గాలే కాకుండా పార్టీ నేతలు సైతం చర్చించుకుంటున్నారు. ఈ పర్వం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అనూహ్య కితాబు దక్కింది. అది కూడా సీనియర్ ఐఏఎస్ అధికారి నుంచి - పైగా ఒకనాడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సన్నిహితంగా పనిచేసిన వ్యక్తి నుంచి కావడం గమనార్హం.రాజ్యసభలో ఎన్నికల సందర్భంగా తెలంగాణలోనే సామాజిక న్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ప్రశంసించారు. ఏపీలో అలాంటిది ఊహించలేమని ఆయన ఎద్దేవా చేశారు. ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టి ఐవైఆర్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘పలు సామాజిక వర్గాలు సామాజికంగా వెనుకబడి - ఆర్థికంగా బలంగా లేని కారణంగా ఎన్నడూ ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగలేదు. ఒకవేళ అన్నివర్గాలకు ప్రాధాన్యం కలిగించే అవకాశం కల్పిస్తే అలాంటి వారికి ఈ అవకాశం దక్కుతుంది. పరోక్ష ఎన్నికలు అయిన రాజ్యసభ వంటివాటిలో అలాంటి అవకాశం కల్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్ పలు వర్గాలకు న్యాయం జరగలేదు. ఓకే సామాజిక వర్గం - అదే స్థాయి ఆర్థిక స్థితిగతులు ఉన్నవారికే అవకాశం ఇచ్చారు. కానీ ఎంతో కసరత్తు చేసినట్లుగా బిల్డప్ ఇచ్చారు` అంటై ఐవైఆర్ ఎద్దేవా చేశారు. `తక్కువ జనాభా ఉన్న కులాలు ఒక్కతాటిపైకి రావాల్సి ఉంది. సరైన పాఠం చెప్పాల్సి ఉంది` అంటూ పరోక్షంగా తన మనసులోని భావాన్ని పంచుకున్నారు. `పెద్దల సభ ఎన్నికల్లో ముదిరాజులకు అవకాశం కల్పించిన టీఆర్ ఎస్ పార్టీకి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాంటి సామాజిక న్యాయాన్ని ఏపీలో ఊహించలేము.’ అని ఆయన ఎత్తిపొడిచారు.