Begin typing your search above and press return to search.

లోకేష్.. నీ అహంకారానికి పరాభవం తప్పదు: ఐవీ రెడ్డి

By:  Tupaki Desk   |   21 April 2017 7:43 AM GMT
లోకేష్.. నీ అహంకారానికి పరాభవం తప్పదు: ఐవీ రెడ్డి
X
అధికార మదం తలెక్కిక్కితే ఇలాగే ఉంటుంది. పోగాలం దాపురిస్తే ఇలా తయారవుతారు. ప్రజలిచ్చింది పరిమిత అధికారమే.. ఇది స్వతంత్ర భారతం. ప్రజాస్వామ్య భారతం. అబద్ధపు హామీలు, బూటకపు మాటలతో అధికారం సంపాదించుకుని.. హద్దులు దాటి వ్యవహరిస్తూ, నియంతలా మారారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు - ఆయన తనయుడు లోకేష్. ప్రజామోదం లేకుండా.. కేవలం తండ్రి ప్రాపకాన్ని అడ్డు పెట్టుకుని మంత్రి అయిన లోకేష్ తన చేతిలో అధికారముంది కదా.. అని ఏమైనా చేయొచ్చనే భ్రమలో బతుకుతున్నట్టుగా ఉన్నాడు.

జయంతికి, వర్ధంతికి తేడా తెలీని ఈ మంత్రిగారు.. తన తీరును ఎద్దేవా చేసి ఎండగట్టిన ఒక నెటిజన్ ను అరెస్టు చేయించడం దారుణం. ఇదో నియంత్రుత్వ పోకడ. ప్రజాస్వామ్యంలోని ప్రాథమిక హక్కు అయిన భావ ప్రకటన స్వేచ్ఛను దెబ్బతీయడం. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుకు సమాధి కట్టడం. అధికారం చేతిలో ఉందని చెప్పి లోకేష్ ఇలాంటి పోకడలకు పోవడం తన తోకకు తను నిప్పు పెట్టుకోవడమే.

తన నోటిని, నాలికను కంట్రోల్ చేసుకోలేని ఈ మంత్రిగారు.. ఏకంగా ప్రజలనే నియంత్రించాలని చూస్తున్నాడు. సునామీలాంటి సోషల్ మీడియాతో పెట్టుకుంటున్నాడు. రవికిరణ్ ఇంటూరి అనే ఫేస్ బుక్ పేజీ నిర్వాహకుడిని అరెస్టు చేయడం లోకేష్ నియంతలా ఫీలవుతున్న తీరుకు దర్పణంగా మారింది. అధికారం శాశ్వతం కాదు. అధికారం చేతిలో ఉన్న వేళ కూడా పరిమితులున్నాయి. ఆ పరిమితుల మేరకు నడుచుకుంటే.. పద్ధతిగా ఉంటుంది. పాలకుడైనా సరే.. హద్దు మీరితే ప్రజలు చూస్తూ ఊరికే కూర్చోరు.

అంతా తనను పొగిడే వాళ్లే ఉండాలి, అంతా తనను కీర్తించే వాళ్లే ఉండాలి, సోషల్ మీడియా అంటే అది కూడా తన పచ్చ మీడియాలాంటిదే అని లోకేష్ భ్రమ పడుతున్నట్టుగా ఉన్నాడు. జయంతి, వర్ధంతికి తేడా తెలీని మంత్రిగారు.. సోషల్ మీడియా, పచ్చ మీడియా అని ఒకటే అని అనుకొని ఉన్నారు కాబోలు. తనకు తిండిపై నియంత్రణ లేదు అని చెప్పుకునే లోకేష్ రాష్ట్రానికే ఇలా నియంతగా మారదామని ఎందుకనుకున్నాడో.. ఆయనకే తెలియాలి.

రవి కిరణ్ ఇంటూరిని అక్రమంగా అరెస్టు చేశారు. అతడి గురించి సమాచారం ఇచ్చి, విడుదలు చేయాలి. అలా కాకుండా.. అర చేతిని అడ్డు పెట్టి సూర్యుడిని అపుదామని.. ఇలాంటి తాటాకు చప్పుళ్లతో ఏకంగా సోషల్ మీడియా మొత్తాన్నే కంట్రోల్ చేయాలని అనుకుంటే.. లోకేష్ కు మించిన అమాయకుడు మరొకడు ఉండడు. ఒక నెటిజన్ ను అరెస్టు చేస్తే మరొకరు స్పందిస్తారు. లోకేష్ నియంత్రుత్వాన్ని చూస్తూ కూర్చోరు. తను సునామీతో పెట్టుకుంటున్నాను అని లోకేష్ కు తెలీదు. అంత అవగాహనే ఉంటే ఇలాంటి పని చేయడు.

ఇప్పటికే పలు రకాలుగా నోరు జారీ.. సొంత పార్టీ పరువును, తన పరువును తనే తీసుకున్నాడు. ఆ విషయంలో దిద్దుబాటు చేసుకోకుండా.. రోజుకొక రకంగా కామెడీ చేస్తూ.. మరోవైపు తన తీరును తప్పు పట్టిన వారిని అరెస్టు చేయిస్తూ.. రాష్ట్రం పాలిటి హింసించే రాజు పులకేశిలా తయారయ్యాడు తెలుగుదేశం అధినేత తనయుడు. సోషల్ మీడియాతో పెట్టుకున్న నాయకుడెవ్వడూ ఇంత వరకూ గెలిచినిలిచి బట్టకట్టింది లేదు. లోకేష్ అహంకారానికి కూడా ఆ పతనం తప్పదు.

-ఐవీ రెడ్డి,
గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,
ప్రకాశం జిల్లా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/