సొంత డబ్బా కొట్టుకునేందుకే జన్మభూమి: ఐవీ రెడ్డి

Sat Jan 13 2018 16:28:59 GMT+0530 (IST)

సొంత డబ్బా కొట్టుకునేందుకే జన్మభూమి-మా ఊరు కార్యక్రమం నిర్వహించారు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జీ ఐవీ రెడ్డి వ్యాఖ్యానించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నాలుగో విడత జన్మభూమి కార్యక్రమంలో 21 లక్షల ఆర్జీలు వస్తే..ఐదో విడతలో పది లక్షల ఆర్జీలు రావడాన్ని బట్టే...ప్రభుత్వ పనతీరు అర్థమవుతోందన్నారు. గత ఆర్జీలను పరిష్కరించకపోవడం వల్లనే తిరిగి ఆర్జీలు ఇస్తున్నారనే విషయం అర్థమవుతోందన్నారు. పార్టీలకు అతీతంగా పథకాలు అందిచ్చిన రోజే నిజమైన పాలనకు అర్థమని ఐవీ రెడ్డి అన్నారు. కేవలం పచ్చచొక్క వేసుకున్నవారికే పథకాలు ఇస్తే...ఆర్జీలు వస్తూనే ఉంటాయన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో..నాలుగేళ్లుగా అనర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని మండిపడ్డారు.రాచర్ల మండల కేంద్రానికి చెందిన తిరుపతి అనే వ్యక్తి పక్కా ఇల్లు కావాలని ఐదు జన్మభూమి కార్యక్రమాల్లో ఆర్జీ ఇచ్చినా..ప్రభుత్వం మంజూరు చేయలేదని ఐవీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు న్యాయం చేయలేని ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని చెప్పారు. పించన్లు - ఇళ్ల - రేషన్ కార్డులు ఇచ్చిన వారికి రూ. 2 నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పొదలకుంటపల్లెలో 81 సంవత్సరాలు ఉన్న వృద్ధుడికి పింఛన్ మంజూరు చేయని దురదృష్ట పాలకులు ఉన్నారని మండిపడ్డారు.

గిద్దలూరు నియోజకవర్గంలో రూ.600 కోట్లతో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే ఎం.అశోక్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నాడని వైఎస్ఆర్‌సీపీలో గెలిచి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరాక చంద్రబాబు చెప్పే అబద్దాలు బాగా వంటబట్టాయని ఎద్దేవా చేశారు. తాగునీటి సరఫరాకు రూ.5.45 కోట్లు మంజూరైతే టీడీపీ కార్యకర్తలకు కాంట్రాక్టులు ఇప్పించి నీరు సరఫరా చేయకున్నానిధులు దోచేస్తున్నారన్నారు. షాదీఖానాకు - బీసీ - కాపు చెప్పుకొంటున్నారని అయితే ఇదంతా బూటకమని ఐవీ రెడ్డి మండిపడ్డారు. కొంగళవీడులో రోడ్డులో ఉన్న ఈద్గాకు ఏడు నెలల క్రితం రూ.8 లక్షల నిధులు మంజూరైతే నేటికీ పనులు చేయలేదన్నారు. మంజూరైనవి పక్కనపెట్టి కానివాటిని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అబద్దపు మాటలు చెప్పి బీసీ - ముస్లిం - కాపులను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. గిద్దలూరు పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసేందుకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుబ్బారెడ్డి బైపాస్ రోడ్డుకు ప్రతిపాదనలు పంపగా...అది కూడా తాను చేశానని ఎమ్మెల్యే చెప్పుకోవడం సమంజసం కాదన్నారు. పట్టణంలోని ఎస్ పీజీ పాలెంట్ డ్రైనేజీ సమస్యను ఎమ్మెల్యే పరిష్కరించలేకపోవడంతో..తానే స్వంత నిధులతో బాగు చేయించానని ఐవీ రెడ్డి తెలిపారు. రాచర్లలోనూ తాగునీటి మోటారు మరమ్మతులకు నిధులు ఇచ్చానని తెలిపారు.