Begin typing your search above and press return to search.

ఓడిపోయింది వైఎస్సార్ కాంగ్రెస్ కాదు, ప్రజాస్వామ్యం: ఐవీ రెడ్డి

By:  Tupaki Desk   |   20 March 2017 2:22 PM GMT
ఓడిపోయింది వైఎస్సార్ కాంగ్రెస్ కాదు, ప్రజాస్వామ్యం: ఐవీ రెడ్డి
X
అన్నీ ఉన్న ఆకు అణకువగా ఉంటుంది.. ఏమీ లేని ఆకే ఎగిరెగిరి పడుతుంది… అనే సామెత గుర్తుకు వస్తుంది ప్రస్తుతం తెలుగుదేశం నేతల హడావుడిని చూస్తుంటే. మూడు జిల్లాల స్థానిక సంస్థల కోటాలో తమ పార్టీ విజయం సాధించిందని… నిస్సిగ్గుగా చెప్పుకొంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా అంతా ఇదే నిస్సిగ్గు తనాన్ని చాటుకుంటున్నారు. గెలిచామని చెప్పుకొంటూ.. ఎంగిలి విస్తరాకుల్లా ఎగిరెగిరి పడుతూ.. ఎలా గెలిచామనే విషయాన్ని దాచేయాలని చూస్తున్నారు తెలుగుదేశం నేతలు.

వాస్తవ బలం ఏమిటో ఎవరికీ తెలియని విషయం కాదు. స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. కడప - కర్నూలు - నెల్లూరు జిల్లాల్లో ప్రజల చేత ఎన్నుకోబడిన స్థానిక సంస్థల సభ్యుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన వారే మెజారిటీ గా ఉన్నారు. అసలు ఇలాంటి జిల్లాల స్థానిక సంస్థల కోటాలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడమే అప్రజాస్వామ్యికం. ఇలాంటి అప్రజాస్వామ్యిక తెంపరి తనాన్ని ప్రదర్శించాడు తెలుగుదేశం అధినేత. అనునిత్యం “నేను నిప్పును..’’ ‘విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాను..’ అని చెప్పుకునే బాబుగారు ఈ ఎన్నికలతో మరోసారి “విలువల..’’తో కూడి రాజకీయాలకు తెరతీశారు.

ఒక్కో స్థానిక సంస్థల సభ్యుడినీ కొనేయడం మొదలుపెట్టాడు. క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. మూడు దశాబ్దాల పరంపరలో చంద్రబాబుకు ఇలాంటి రాజకీయాలు కొత్తేమీ కాదు. ఆల్రెడీ ఒకసారి ఇలాంటి రాజకీయాలు చేసి తెలంగాణలో పట్టుబడ్డాడు చంద్రన్న. అందుకు సంబంధించి కేసుల్లో ఇరుక్కున్నాడు చంద్రబాబు. ఆ కేసుల విషయంలో చంద్రబాబుకు సుప్రీం కోర్టుల నుంచి కూడా నోటీసులు జారీ అయ్యాయి. మరి బాబ్ ఏక్ నంబరీ అయితే.. బేటా దస్ నంబరీ కదా.. అందుకే ఈ సారి నారా లోకేష్ బాబు రంగంలోకి దిగి కొనుగోలు వ్యవహారాన్ని సమీక్షించారు. చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే సంతలో పశువులను కొన్నట్టుగా స్థానిక సంస్థల సభ్యులను కొన్నారు తండ్రీకొడుకులు.

ఇదీ నేపథ్యం…మరి మూడు జిల్లాల్లో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందని చెప్పబడుతోంది. వీరి విజయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి అని కొంతమంది అంటున్నారు. అయితే ప్రజలు గాక, ప్రజల చేత ఎన్నుకోబడిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓట్లు వేసిన ఈ ఎన్నికల్లో ఓటమి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది మాత్రం కాదు. అది కచ్చితంగా ప్రజాస్వామ్యానిదే. అవును.. గెలుపు టీడీపీది - ఓటమి ప్రజాస్వామ్యానిది.

ఈ మూడు జిల్లాల స్థానిక సంస్థల కోటాలో తెలుగుదేశం పార్టీకి తగినంత బలం లేదనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అంశం కాదు. కడప - కర్నూలు - నెల్లూరు జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను గమనిస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. వైకాపా తరపున పోటీ చేసి గెలిచిన స్థానిక సంస్థల సభ్యులే ఎక్కువమంది ఉన్నారు. మరి ప్రజాస్వామ్యయుతంగా చూసుకుంటే... ఈ మూడు జిల్లాల్లోనూ తెలుగుదేశం పార్టీ అసలు అభ్యర్థినే పోటీలో పెట్టకూడదు. ఇక్కడ వైకాపా పోటీ చేసి ఏకగ్రీవంగా నెగ్గాల్సింది. అయితే.. కేవలం ఫిరాయింపులను ఆధారంగా చేసుకుని, ఓటర్ల కొనుగోలు మీద ఆధారపడి తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థులను పోటీలో పెట్టింది ఈ నియోజకవర్గాల్లో. మరి పోటీతోనే తెలుగుదేశం అడ్డదారి తొక్కింది.

అక్కడ నుంచి చూస్తే గెలుపుకోసం తెలుగుదేశం పార్టీ అనేక ఎత్తుగడలు వేసింది, వైకాపా తరపున గెలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కొనేసింది. వారితో క్యాంపు రాజకీయాలను నడిపింది. పాండిచ్చేరి వరకూ క్యాంపు రాజకీయాలు వెళ్లాయి. అధికారం చేతిలో ఉంది, ఏం చేసినా అడిగే వాడు లేడు, అమ్ముడుపోయే వాడిని కొనేశారు. లొంగడని వాడిని బెదిరించారు. కొందరు ఓటర్ల పిల్లలను కూడా కిడ్నాప్ చేశారు. ఇదీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగింది. మరి ఇంత జరుగుతున్నా ఈసీ కానీ, కోర్టులు కానీ మారు మాట్లాడలేదు. పోటీ లేని చోట అభ్యర్థిని ఎలా నిలబెడతారని ఈసీ అడగలేదు. విప్ ల ఉల్లంఘన జరిగింది.. అంతిమంగా టీడీపీ గెలిచింది. ప్రజాస్వామ్యం ఓడింది. ఇదీ నిప్పుగారి రాజకీయం ఇస్తున్న సందేశం!

ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో విప్ లు చెల్లవు.. అంటూ చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా ప్రకటించుకోవడం మరో ప్రహసనం. విప్ లు చెల్లకపోతే.. పక్క పార్టీ బలంతో గెలుస్తారా? పక్క వాళ్లకు పుట్టిన పిల్లలకు మీ పేర్లు పెట్టుకుంటారా? ఎంత కాలం ఇలా? ఎన్ని సార్లు ఇలా? అయితే ఇలా కొని గెలవడం చంద్రబాబుకు సులభమే కావొచ్చు.. అయితే ప్రతిసారీ ఇదే చెల్లదని బాబు గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యానికి పాతరేయడం ప్రతిసారీ జరగదు.. ప్రజల చేతిలో ఓటు అనే ఆయుధం ఉంది. దాన్ని ప్రయోగించే సమయానికి మరెంతో దూరం లేదు. అంత వరకూ చంద్రబాబు శిశుపాలుడిలా తప్పుల మీద తప్పులు చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది. రానున్న సారర్వత్రిక ఎన్నికలతో జరుగుతుంది శిశుపాల వధ.

-ఐవీ రెడ్డి,
గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త,
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రకాశం జిల్లా.