జగన్ పోరు.. తెలుగుజాతికి అవసరం :ఐవీరెడ్డి

Tue Feb 13 2018 22:08:07 GMT+0530 (IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడానికి తమ పార్టీ ఎంపీల పదవులను త్యాగం చేయడానికైనా వెనుకాడకుండా కేంద్రం మీద ఒత్తిడి పెంచడానికి సిద్ధపడిన  వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాటం.. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుజాతికి ఎంతో కీలకం - అవసరం అని ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ఐవీ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు జగన్ తాజా నిర్ణయం గురించి ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని అభినందిస్తూ - దీనివల్ల తెలుగుజాతికి న్యాయం జరుగుతుందని ఐవీరెడ్డి అభిలషించారు. జగన్ మోహన్ రెడ్డి రాజకీయ పరిణతికి - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడంలో ఉన్న చిత్తశుద్ధికి ఈ నిర్ణయం నిదర్శనం అని ఐవీ రెడ్డి పేర్కొన్నారు.సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ జగన్ ప్రతి సారీ తన సామర్థ్యాలను నిరూపించుకుంటున్నారని మడమతిప్పే అలవాటు లేని ఈ అవిశ్రాంత పోరాట యోధుడి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం ఉందని ఐవీ చెప్పారు. ఆయన నేతృత్వంలో రాష్ట్రం సమస్యలు - ఇబ్బందులనుంచి బయటపడగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణ యుగాన్ని.. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత.. జగన్మోహన్ రెడ్డి తిరిగి సాధించగలరని చెప్పారు.

ఐవీరెడ్డి గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రత్యేకహోదా కోసం జరుగుతున్న వైసీపీ పోరాటాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ఇటీవల హోదా కోసం నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఈ పోరాటంలో జగన్ వెంట ఆయనకు మద్దతుగా తాముంటామని కూడా ఐవీరెడ్డి తెలియజేశారు.