Begin typing your search above and press return to search.

'ఆధారాల‌'తో రెచ్చ‌గొడ‌తారు.. రెచ్చిపోకండి!

By:  Tupaki Desk   |   16 July 2018 4:09 AM GMT
ఆధారాల‌తో రెచ్చ‌గొడ‌తారు.. రెచ్చిపోకండి!
X
చూసినంత‌నే ఒళ్లు మండ‌టమే కాదు.. వెంట‌నే రియాక్ట్ అనిపించేలా చేయ‌టం సోష‌ల్ మీడియాలో ఇప్పుడు న‌డుస్తున్న కొత్త ట్రెండ్‌. అమాయ‌కంగా త‌మ‌కు అందే సందేశాల్ని త‌మ‌కు తెలిసిన వారికి స‌ర్క్యులేట్ చేయాల‌నుకోవ‌టం ఒక ప‌ద్ధ‌తి. దాన్నో అవ‌కాశంగా తీసుకొని.. ఆధారాలంటూ.. కొన్ని ఫోటోల్ని.. వీడియోల్ని చూపించి రెచ్చ‌గొట్టటం..భావోద్వేగాల‌కు గురి చేస్తుంటారు.

దీంతో కొంద‌రు అమాయ‌కులు అన‌వ‌స‌రంగా బ‌లి అయిపోతున్నారు. న‌కిలీ ఫోటోలు.. వీడియోలు.. వార్త‌ల్ని చూసి రెచ్చ‌పోతున్న వారి కార‌ణంగా హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. పిల్ల‌ల్ని ఎత్తుకుపోయే ముఠాలంటూ వ‌స్తున్న వాట్సాప్ సందేశాల్ని న‌మ్మి.. అనుమానం వ‌చ్చిన వారిపై ఆవేశంతో దాడి చేస్తున్న ఉదంతాల‌తో ప్రాణాలు పోతున్న ప‌రిస్థితి. తాజాగా క‌ర్ణాట‌క‌లోని బీద‌ర్ లో ముగ్గురు హైద‌రాబాదీలను కిడ్నాప‌ర్లుగా భావించి వారిపై స్థానికులు దాడి చేసిన వైనం తెలిసిందే.

ఈ దాడిలో ఆజం అనే వ్య‌క్తి మృతి చెందాడు. హైద‌రాబాద్ న‌గ‌రంలోనూ ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. దీంతో.. న‌కిలీ వార్త‌లు.. వ‌దంతుల్ని చూసి రెచ్చిపోవ‌ద్ద‌ని రాష్ట్ర ఐటీ శాఖ కోరుతోంది. అంతేకాదు.. న‌కిలీ వార్త‌లు.. ఫోటోలు.. వీడియోల‌పై అవ‌గాహ‌న పెంచేందుకు వీలుగా సోష‌ల్ మీడియాలో ఐటీశాఖ‌ ప్ర‌చారం షురూ చేసింది.

చూసినంత‌నే నిజ‌మ‌నిపించేలా ఉండే పోస్టుల్లో చాలావ‌ర‌కూ న‌కిలీవేన‌న్న విష‌యం అధికారులు నిర్వ‌హించిన ద‌ర్యాప్తులో తెలుస్తోంది. ఇలాంటి వాటిని చూసి ఆవేశప‌డొద్ద‌ని కోరుకుంటున్నారు.

రెచ్చ‌గొట్టాల‌న్న ల‌క్ష్యంతో ఉండే సందేశాల‌కు రెచ్చిపోకుండా ఉండ‌ట‌మే కాదు.. వాటిని వేరే వారికి ఫార్వ‌ర్డ్ చేయ‌కుండా ఉండాల‌ని కోరుతున్నారు. ఎక్క‌డో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను మ‌న ద‌గ్గ‌రే జ‌రిగిన‌ట్లుగా వ్యాప్తి చేయ‌టం ఇటీవ‌ల ఎక్కువైంది. ఇలాంటి వాటిని షేర్ చేయొద్ద‌ని ఐటీశాఖ కోరుతోంది. గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల ద‌గ్గ‌ర నుంచి.. పెద్ద‌గా ప‌రిచ‌యం లేని వారి నుంచి వ‌చ్చే సందేశాల్ని అవాస్త‌వాలుగా భావించాలే కానీ.. అవి నిజాలుగా అస్స‌లు న‌మ్మొద్ద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. వ‌దంతుల్ని వ్యాపింప‌చేయ‌టం కూడా నేర‌మేన‌న్న విష‌యాన్ని ప్ర‌జ‌లు గుర్తించాల‌ని అధికారులు చెబుతున్నారు. అనుమానాస్ప‌ద వ్య‌క్తులు క‌నిపించిన వెంట‌నే పోలీసుల‌కు ఆ స‌మాచారం ఇవ్వాలే కానీ.. చ‌ట్టాన్ని చేతుల్లో తీసుకొని దాడుల‌కు పాల్ప‌డ‌టం ఏ మాత్రం స‌రికాద‌న్న సూచ‌న‌ను చేస్తున్నారు.