Begin typing your search above and press return to search.

యూనియ‌న్లు ఐటీ ఉద్యోగుల‌కు న్యాయం చేయ‌లేవా?

By:  Tupaki Desk   |   27 May 2017 10:15 AM GMT
యూనియ‌న్లు ఐటీ ఉద్యోగుల‌కు న్యాయం చేయ‌లేవా?
X
ఐటీ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగుల తొల‌గింపు ప్ర‌క్రియ సాగుతున్న నేప‌థ్యంలో తెర‌మీద‌కు వ‌చ్చిన ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామం..ఐటీ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసుకోవ‌డం. పొరుగు రాష్ట్రమైన త‌మిళ‌నాడులో ఐటీ ఉద్యోగులు సంఘటితమై ''ఫోరం ఆఫ్‌ ఐటీ ఎంప్లాయీస్‌ - తమిళనాడు'' పేరుతో సంఘం స్థాపించుకున్నారు. ఈ మేరకు 100 మందికిపైగా సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్లు సభ్యులుగా సంతకాలు చేశారు. మహిళా ఉద్యోగినులకు భద్రత - ఐటీ సంస్థల్లో కార్మిక చట్టాల అమలు - ఉద్యోగుల హక్కులను కాపాడడం కోసం సంస్థ పనిచేస్తుందని యూనియన్ నాయకురాలు పీ పరిమళ తెలిపారు. అదే రీతిలో తెలంగాణ‌లోనూ ఉద్యోగుల ఐక్య‌త‌ జ‌రిగింది.

వివిధ సంస్థ‌ల నుంచి తొల‌గింపున‌కు గురైన ఉద్యోగులు కార్మిక శాఖ‌ను ఆశ్ర‌యించారు. వీరిలో మెజార్టీ టెక్ మ‌హీంద్రాలో ప‌నిచేసి ఉద్యోగం కోల్పోయిన వార‌ని స‌మాచారం. వీరంతా ఫైట్‌ కు అనుబంధ సంఘంగా ఏర్ప‌డి తెలంగాణ కార్మిక శాఖ‌ను ఆశ్ర‌యించారు. అయితే వీరికి నిబంధ‌న‌ల స‌మ‌స్య ఏర్ప‌డింది. సదరు యూనియన్స్ ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాలేదు. అంతేకాకుండా టెక్కీలు సమర్పించిన లెటర్ హెడ్‌ పై సైతం...యూనియన్‌ కు సంబంధించిన ఎలాంటి వివరాలు లేవు. అధ్యక్షుడు, ఎగ్జిక్యూటివ్ బాడీ లేకుండా యూనియన్ ఏర్పడటమేంటని లేబర్ అధికారులు ఆభ్యంత‌రం వ్యక్తం చేశారు. దీంతో నిరాశ‌ప‌డిన ఐటీ ఉద్యోగుల‌కు అదే అధికారులు మ‌రింత స‌మాచారం ఇచ్చారు. ఉద్యోగులు వ్య‌క్తిగ‌తంగా త‌మ అభ్య‌ర్థ‌న‌లు స‌మ‌ర్పించుకోవచ్చున‌ని తెలిపారు. ఈ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు.

మ‌రోవైపు ఐటీ ఉద్యోగుల్లో చాలా మంది యూనియన్‌ లో చేరడానికి ఇష్టపడడం లేదని స‌మాచారం. యూనియన్‌ లో చేరితే తాము పనిచేస్తున్న సంస్థల నుంచి అనవసరమైన ఇబ్బందులు వస్తాయని ఉద్యోగులు భావిస్తున్నట్టు తెలిసింది. మ‌రోవైపు త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చి స‌మ‌స్య‌లు విన్న‌వించుకునే ఉద్యోగుల‌కు ఎల్ల‌ప్పుడూ అండ‌గా ఉంటామ‌ని ఫైట్ సంస్థ ప్ర‌క‌టించింది.

ఇదిలాఉండ‌గా...కార్మికశాఖ చొరవతో కాగ్నిజెంట్ ఐటీ సంస్థ ఉద్యోగుల సమస్యకు పరిష్కారం లభించింది. సంస్థ నుంచి తీసేసిన ఉద్యోగుల్లో ముగ్గురిని తిరిగి తీసుకుంటామని, నోటీస్ పీరియడ్‌లో ఉన్న మరో నలుగురిని చేర్చుకునే విషయాన్ని పరిశీలిస్తామని శుక్రవారం కాగ్నిజెంట్ తెలిపింది. ఇప్పటికే రాజీనామా చేసిన ఉద్యోగిని తీసుకోలేమని చెప్పింది. పనితీరు మదింపు, అంతర్జాతీయ పరిణామాలను పేర్కొంటూ కాగ్నిజెంట్ ఐటీ కంపెనీ ఇటీవల పలువురు ఉద్యోగులను తొలగించగా, వారు రాష్ట్ర కార్మికశాఖను ఆశ్రయించారు. ఆ శాఖ జాయింట్ కమిషనర్ ఆర్ చంద్రశేఖరం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కార్మికశాఖ కార్యాలయంలో తెలంగాణ ఐటీ అసోసియేషన్(టీటా), తొలగించిన ఉద్యోగులు, కాగ్నిజెంట్ ప్రతినిధుల మధ్య శుక్రవారం రెండోదశ చర్చలు జరిగాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/