Begin typing your search above and press return to search.

సోదాల మీద సోదాలు.. త‌మిళ తంబీల తీర్పు ఏమిటి?

By:  Tupaki Desk   |   17 April 2019 5:32 AM GMT
సోదాల మీద సోదాలు.. త‌మిళ తంబీల తీర్పు ఏమిటి?
X
రాష్ట్రం ఏదైనా కావొచ్చు.. టార్గెట్ చేసిన‌ట్లుగా కొన్ని పార్టీల మీదా.. కొంద‌రు నేత‌ల మీదా నిర్వ‌హిస్తున్న ఆక‌స్మిక త‌నిఖీలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. జాతీయ స్థాయిలో రాజ‌కీయ చ‌ర్చ‌గా మారిన సోదాల వ్య‌వ‌హారం తాజాగా మ‌రో అంకం మొద‌లైంది. దేశ వ్యాప్తంగా సాగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రెండో విడ‌త పోలింగ్ రేపు జ‌ర‌గ‌నుంది.13 రాష్ట్రాల్లో 96 లోక్ స‌భ స్థానాల‌కు జ‌ర‌గ‌నున్న పోలింగ్ లో అత్య‌ధిక సీట్లు ఉన్న రాష్ట్రం త‌మిళ‌నాడుగా చెప్పాలి.

త‌మిళ‌నాడులో మొత్తం 30 లోక్ స‌భ స్థానాలు ఉండ‌గా.. రేపు (బుధ‌వారం) 38 స్థానాల‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. దీంతో.. అధికార అన్నాడీఎంకే.. విప‌క్ష డీఎంకేలు పోటాపోటీగా ఎన్నిక‌ల బ‌రిలో నిలిచాయి. అన్నాడీఎంకేకు బీజేపీ మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తూ బ‌రిలోకి నిల‌వ‌గా.. డీఎంకే ఒంట‌రిపోరు చేస్తోంది.

స్టాలిన్ నేతృత్వంలో జ‌రుగుతున్న మొట్ట‌మొద‌టి ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌న స‌త్తా చాటాల‌ని భావిస్తోంది. అమ్మ లేని వేళ‌.. అన్నాడీఎంకేను దెబ్బ తీయ‌టం పెద్ద క‌ష్టం కాద‌న్న మాట వినిపిస్తున్నా.. అదంత తేలికైన విష‌యం కాద‌న్న విష‌యం తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.

ఎన్నిక‌ల‌కు రెండు రోజుల ముందు ప‌లువురు డీఎంకే నేత‌ల ఇళ్ల‌ల్లో ఐటీ సోదాలు జ‌ర‌గ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. క‌రుణ కుమార్తె.. స్టాలిన్ సోద‌రి క‌మ్ మాజీ కేంద్ర‌మంత్రి క‌నిమొళి తూత్తుకుడి స్థానం నుంచి త‌మిళ‌నాడు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు త‌మిలిసై సౌంద‌ర‌రాజ‌న్ తో పోటీ ప‌డుతున్నారు. ఇలాంటివేళ‌.. క‌నిమొళి ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు చేయ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

డీఎంకే మీద ఒత్తిడి పెంచేందుకు సోదాలు నిర్వ‌హిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఓట‌మి భ‌యంతోనే బీజేపీ ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంద‌ని.. స్వ‌తంత్ర సంస్థ‌ల‌ను స్వార్థ ప్ర‌యోజ‌నాల‌కు ఉప‌యోగించుకుంటూ ప్ర‌జాస్వామ్యాన్ని హ‌త్య చేస్తున్న‌ట్లు స్టాలిన్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల్లోనూ టీడీపీ నేత‌లు ప‌లువురిపైన సోదాలు నిర్వ‌హిస్తున్న వైనం తెలిసిందే.

మిగిలిన రాష్ట్రాల్లో సంగ‌తి ఎలా ఉన్నా.. త‌మిళ‌నాడు ప‌రిస్థితి వేరుగా ఉంటుంద‌ని చెబుతున్నారు. టార్గెట్ చేస్తున్న‌ట్లుగా సాగుతున్న ఐటీ దాడుల కార‌ణంగా.. త‌మిళ ఓట‌రు స‌మీకృత‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని.. అదే జ‌రిగితే.. అధికార అన్నాడీఎంకేకు.. బీజేపీకి దిమ్మ తిరిగే షాక్ ప‌క్కా అని చెబుతున్నారు. మ‌రి.. త‌మిళ తంబీలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.