Begin typing your search above and press return to search.

అధికార పార్టీలో ఐటీ దాడుల అలజడి!

By:  Tupaki Desk   |   1 Oct 2016 5:02 PM GMT
అధికార పార్టీలో ఐటీ దాడుల అలజడి!
X
విజ‌య్ మాల్యా పేరు విన‌గానే ఆయ‌న ఎగ్గొట్టిన వేల కోట్ల అప్పులే అంద‌రికీ గుర్తొస్తాయి. అయితే, ఆయ‌న దేశం నుంచి ఉడాయిస్తూ కొన్ని ఆస్తుల‌ను కొంత‌మంది బినామీల పేర్ల బ‌దలాయించి ఉంటాడ‌న్న ఆరోప‌ణ‌లు అప్ప‌ట్లో వ్య‌క్తం అయ్యాయి. ఇప్పుడు అవే అనుమానాలు నిజం అవుతున్న‌ట్టుగా ఉన్నాయి! చిత్రం ఏంటంటే... మాల్యా బినామీ ఆస్తుల‌తో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే స‌త్య‌ప్ర‌భ‌కు సంబంధం ఉన్న‌ట్టు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

చిత్తూరు ఎమ్మెల్యే స‌త్య‌ప్ర‌భకు చెందిన‌ సంస్థ‌ల‌పై ఐటీశాఖ అధికారులు దాడులు చేశారు. స‌త్య‌ప్ర‌భ కంపెనీల్లోనూ ఇంట్లోనూ జ‌రిపిన దాడులో రూ. 43 కోట్ల లెక్క‌చూప‌ని న‌గ‌దును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, దీంతోపాటు రూ. 267 కోట్ల విలువ గ‌ల ఆస్తుల‌ను కూడా స్వాధీనం చేసుకున్న‌ట్టు ఆదాయ‌పు ప‌న్నుశాఖ అధికారులు బెంగ‌ళూరులో వెల్ల‌డించ‌డం ఇప్పుడు రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. భార‌తీయ బ్యాంకుల‌కు కుచ్చుటోపీ పెట్టి పారిపోయిన విజ‌య మాల్యా వ్య‌వ‌హారాన్ని ద‌ర్యాప్తు చేస్తున్న అధికారులే స‌త్య‌ప్ర‌భ సంస్థ‌ల‌పై దాడులు నిర్వ‌హించారు.

మాల్యాకీ స‌త్య‌ప్ర‌భ కుటుంబానికి చాలా స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ట‌! అందుకే, మాల్యా ఆస్తుల్లో కొన్నింటిని స‌త్య‌ప్ర‌భ ద‌గ్గ‌ర పెట్టి ఉంటార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారులు కూడా ఈ కోణంలో ద‌ర్యాప్తు చేసి, దాడులు నిర్వ‌హించిన ఉంటార‌ని అనుకుంటున్నారు. అంటే, టీడీపీ ఎమ్మెల్యే స‌త్య‌ప్ర‌భ రూ. 267 కోట్ల ఆస్తులకు సంబంధించిన లెక్క‌ల్ని ఐటీ అధికారుల‌కు చెప్పాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. తాజా దాడుల నేప‌థ్యంలో తెలుగుదేశం నేత‌లు కాస్త క‌ల‌వ‌ర‌పాటుకు గురౌతున్న‌ట్టు స‌మాచారం. ఎందుకంటే, అవినీతి అంటే అదేదో ప్ర‌తిప‌క్షానికి మాత్ర‌మే వ‌ర్తించే ప‌దం అన్న‌ట్టుగా ఇన్నాళ్లూ విమ‌ర్శ‌లు చేసిన వారు.. ఇప్పుడు సొంత పార్టీలోనే ఇలాంటి నేత‌లు ఉన్నార‌ని బ‌య‌ట‌ప‌డటంతో ఖంగుతిన్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో చెవులు కొరుక్కుంటున్నారు.