తిరుపతిలో మరో `కాల్` నాగు..100కోట్లు!

Thu Jul 12 2018 22:02:38 GMT+0530 (IST)

తిరుపతిలోని పల్లెవీధిలో నివాసముండే ఆ వ్యక్తి పేరు కంగిశెట్టి రమేష్.....పదేళ్ల క్రితం....కృష్ణాపురంలోని సైకిల్ షాప్ లో 50 రూపాయల రోజు కూలీకి పంక్చర్లు వేసుకునేవాడు. సీన్ కట్ చేస్తే...ఇపుడు దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టాడు. వడ్డీ వ్యాపారంలో అమాయకులను జలగలాగా పీడించిన రమేష్....అనతికాలంలోనే కోటీశ్వరుడయ్యాడు. వడ్డీల రమేష్ గా మారిన పల్లె వీధి రమేష్ ...రాజకీయ నేతలతో సత్సంబంధాలు పెట్టుకున్నాడు. అతడి వ్యవహారంపై అనుమానం వచ్చిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు...ఏకకాలంలో అతడి ఇల్లు - వ్యాపారాలపై దాడులు నిర్వహించారు. ఆ సోదాలలో దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తుల చిట్టా బట్టబయలు కావడంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు  విస్తుపోయారు. మంగళ - బుధ వారాల్లో సోదాలు నిర్వహించి నగదు - బంగారం - పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.ఈ రెండు రోజులపాటు జరిపిన సోదాలలో అధికారులకు దాదాపు 100కోట్ల విలువైన ఆస్తి పత్రాలు - నగదు - బంగారం లభించాయి. అయితే ఆ పత్రాల ఆధారంగా ఆ ఆస్తుల అసలు విలువను అధికారులు లెక్కగట్టే పనిలో పడ్డారు. వడ్డీ వ్యాపారం వల్లే ఇదంతా సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. ఆదాయపు పన్ను శాఖ జాయింట్ డైరెక్టర్ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో....25మంది సిబ్బంది ఈ సోదాలు నిర్వహించారు. ఆ సోదాలలో వందలాది అప్పు పత్రాలు - ప్రామిసరీ నోట్లు - భూమి పత్రాలు - ఆస్తుల పత్రాలు - నగదు - బంగారం లభించాయి. దాంతోపాటు మంచినీటి గుంటలో 5 అంతస్తుల భవనం - కోర్టు పక్కన మరో రెండు భవనాలు ఉన్నాయని తెలుస్తోంది. రోజువారీ కూలీ నుంచి రాజకీయ నేతల వరకు అవసరాన్ని బట్టి.....రకరకాల వడ్డీ రేట్లకు డబ్బులు అప్పు ఇవ్వడం రమేష్ స్పెషాలిటీ. అంతేకాకుండా సకాలంలో డబ్బు చెల్లించకుంటే....తనఖా పెట్టిన ఆస్తులు స్వాధీనం చేసుకోవడం...మాట వినని వారిఐ దాడి చేయడం పరిపాటి. ఆ దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా...తిరిగి దాడులు చేయడంతో చాలామంది తిరుపతి వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది.