Begin typing your search above and press return to search.

అమరావతిలో బ్లాక్ మనీ.. ఐటీశాఖ కన్ను!

By:  Tupaki Desk   |   28 July 2016 11:30 AM GMT
అమరావతిలో బ్లాక్ మనీ.. ఐటీశాఖ కన్ను!
X
రాష్ట్రవిభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని తెలిసినప్పటినుండీ ఆక్కడ భూములకు ఎవ్వరూ ఊహించని స్థాయిలో విలువ పెరిగింది. దీంతో అక్కడ ఎకరా భూమి సుమారు కోటిరూపాయల వరకూ చేరడం.. రైతుల వద్ద తక్కువధరలే భూములు కొన్న కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు - వాటిని ఎకారా కోటిపైనే అమ్మడంపై వార్తలు వచ్చాయి. ఇదే క్రమంలో కోటి రూపాయలకు పైగా విలువ చేసే ఎకరం భూమికి కేవలం 3 లక్షల రూపాయలే ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరగా నిర్ణయించడంపట్ల కూడా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇదే అదనుగా ఒకరిద్ధరు మంత్రులు కూడా తమ బినామీలతో విచ్చలవిడిగా భూములు కొనుగోలు చేసిన వ్యవహారాలపై కూడా అప్పట్లో హడావిడీ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాలన్నింటిపైనా తాజాగా ఐటీ శాఖ దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

అమరావతే ఏపీ రాజధాని అని తెలిసినప్పటి నుంచి ఎడాపెడా జరిగిపోయిన లావాదేవీల్లో భూములు అమ్ముకున్న కొంతమంది స్థానిక రైతుల వద్ద కూడా భారీస్థాయిలో బ్లాక్ మనీ ఉన్నట్లు ఐటీ శాఖ అభిప్రాయపడుతోంది. ఈ విషయాలకు సంబందించి ఇప్పటికే కీలక సమాచారాన్ని ఐటీశాఖ సంపాదించినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే అమరావతి ప్రాంతంలో ఐటీశాఖ దాడులకు ముహూర్తం ఖరారు కావొచ్చనేది విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఆ సంగతి అలా ఉంటే.. ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛంద ఆదాయపు వెల్లడి పథకం ప్రకటన అనంతరం కొన్ని కార్పొరేట్ సంస్థల నుంచి వారి వారి ఆదాయ విషయాలు వెల్లడయ్యాయి తప్ప వ్యక్తుల నుంచి మాత్రం ఎటువంటి స్పందనా రాలేదు. అయితే ఈ పథకానికి సంబందించిన తుదిగడుపు సమీపిస్తున్నా కూడా ఆయా వ్యక్తుల నుంచి ఆ దాఖలాలేవీ కనపడకపోవడంతో గడుపు పూర్తికాగానే తమవద్దనున్న సమాచారంతో భారీస్థాయిలో సోదాలు నిర్వహించవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు ఐటీ శాఖ చాలా పబడ్భందీగా వ్యూహరచన చేస్తోందట. అన్నీ అనుకూలంగా జరిగి ఇదేగనుక నిజమీతే.. అమరావతి భూముల రియల్ ఎస్టేట్ వ్యాపారాలపైనా - బ్లాక్ మనీ పైనా ఒక క్లారిటీ రావచ్చు!