Begin typing your search above and press return to search.

విక్టరీ తెలిసిన ఇస్రో ఈసారి చరిత్ర సృష్టించింది

By:  Tupaki Desk   |   26 Sep 2016 10:11 AM GMT
విక్టరీ తెలిసిన ఇస్రో ఈసారి చరిత్ర సృష్టించింది
X
విక్టరీ అంత ఈజీ కాదు. కానీ.. ఏపీలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి మాత్రం అది మంచినీళ్ల ప్రాయం. మొదట్లో కాసిన్ని తప్పటడుగులు పడినా.. తన తప్పుల్ని సరిదిద్దుకొని.. విజయం తర్వాత విజయం అన్నట్లుగా దూసుకెళుతోంది. ఒకటి తర్వాత మరొక ప్రయోగంగా సాగే ఇస్రో జైత్రయాత్రలో తాజాగా మరో విజయం నమోదైంది. ఈ విజయం మిగిలిన విజయాల్లాంటిది కాదు. చరిత్ర సృష్టించే విజయమిది. ఎందుకంటారా? దానికో ఆసక్తికర కోణం ఉంది.

ఒక రాకెట్ ద్వారా ఎనిమిది ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యల్లోకి ప్రవేశ పెట్టటమే ఈసారి ప్రత్యేకతగా చెప్పాలి.ఒక రాకెట్ నుంచి ఐదారు ఉపగ్రహాల్ని ప్రయోగించటం ఇస్రోకి కొత్తేం కాదు. కానీ.. ఇలా ఒకే రాకెట్ నుంచి ప్రయోగించిన ఉపగ్రహాలు వేర్వేరు కక్ష్యల్లోకి వెళ్లేలా చూడటంలోనే అసలు విషయం ఉంది. ఈ రోజు ఉదయం9.12 గంటల సమయంలో జరిపిన ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యింది. దాదాపు 48 గంటల పాటు జరిగిన కౌంట్ డౌన్ పూర్తి అయిన వెంటనే పీఎస్ ఎల్వీ – సీ35 నింగిలోకి దూసుకెళ్లింది. అన్ని అనుకున్నట్లే సాగినప్పటికీ.. తుది ఫలితం తేలటానికి 2.15 గంటల సమయం పడుతుంది. ఎందుకంటే.. నింగిలోకి రాకెట్ దూసుకెళ్లిన తర్వాత రాకెట్ నుంచి విడపోయే ఉపగ్రహాలు వేటికవే.. వాటిని నిర్దేశించిన కక్ష్యలో చేరుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియపూర్తి అంతా అనుకున్నది అనుకున్నట్లు జరిగిపోవటంతో ఇస్రోలో పండుగ వాతావరణం చోటు చేసుకుంది.

ఇస్రో విజయాన్ని దేశ ప్రజలంతా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. తాజాగా జరిపిన ప్రయోగంలో 971 కేజీల స్వదేశీ ఉపగ్రహంతో పాటు జర్మనీకి చెందిన రెండు ఉపగ్రహాలు (40 కేజీలు).. కెనడాకు చెందిన ఉపగ్రహం ఒకటి.. యూఎన్ఏ కు చెందిన ఉపగ్రహం.. అల్జీరియాకు చెందిన మూడు ఉపగ్రహాల్ని ఒకేసారి ప్రయోగించారు. తాజాగా ప్రయోగించిన ఈ ఉపగ్రహాలతో వాతావరణ పరిస్థితుల్ని..విపత్తుల్ని మరింత కచ్చితత్వంతో తెలుసుకునే వీలుంటుంది. భారతీయులందరికి సంతోష వార్తను అందించిన ఇస్రో శాస్త్రవేత్తలకు థ్యాంక్స్ చెబుదాం.