Begin typing your search above and press return to search.

నరరూప రాక్షసుల నీడలోనే ఇద్దరు తెలుగోళ్లు?

By:  Tupaki Desk   |   3 Aug 2015 5:20 AM GMT
నరరూప రాక్షసుల నీడలోనే ఇద్దరు తెలుగోళ్లు?
X
రాక్షసత్వానికి నిలువెత్తు రూపంగా వ్యవహరించే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు.. ఇద్దరు తెలుగువారిని కిడ్నాప్ చేయటం తెలిసిందే. లిబియాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఒకరు (శ్రీకాకుళం జిల్లా టెక్కలి).. తెలంగాణ ప్రాంతానికి చెందిన మరొకరు (హైదరాబాద్) కిడ్నాప్ కావటం తెలిసిందే.

వాస్తవానికి నలుగుర్ని కిడ్నాప్ చేసినా.. అందులోని ఇద్దరు కర్ణాటక వాసుల్ని విడిచిపెట్టటం.. తెలుగువారి (గోపీకృష్ణ.. బలరాం కిషన్) ని తమ చెరలోనే ఉంచటం తెలిసిందే.

లెక్చరర్లుగా పని చేస్తున్న వీరికి సంబంధించిన వ్యవహారం ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. లిబియా ప్రభుత్వంతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతుందన్న మాట చెబుతున్నా.. కిడ్నాప్ అయి మూడు రోజులు గడిచినా వారి ఆచూకీపై ఎలాంటి ప్రకటన చేయకపోవటం పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గంటలు గడుస్తున్న కొద్దీ.. బాధితుల కుటుంబాల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

బాధితుల్ని సురక్షితంగా తీసుకొస్తామని.. వారికి ఎలాంటి హాని కలగదని.. వీరి విడుదల కోసం.. ఏపీ.. తెలంగాణ.. కేంద్ర ప్రభుత్వాలు సమిష్టిగా కృషి చేస్తున్నాయంటూ ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు చెబుతున్నారు. మరోవైపు.. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కూడా కిడ్నాప్ కు గురైన బలరాం కిషన్ కుటుంబ సభ్యుల్ని కలిసి వారికి ధైర్యం చెప్పారు. రాక్షసుల పడగ నీడలో ఉన్న తెలుగోళ్లు ఇద్దరూ సురక్షితంగా బయటపడాలని నిండు మనసుతో కోరుకుందాం. మంచి జరగాలని ఆశిద్దాం.