Begin typing your search above and press return to search.

రెండో సారి ఐపీఎస్‌ ల బ‌దిలీ... ఈ సారి 22 మంది

By:  Tupaki Desk   |   23 Jun 2019 11:19 AM GMT
రెండో సారి ఐపీఎస్‌ ల బ‌దిలీ... ఈ సారి 22 మంది
X
వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత కేవ‌లం 20 రోజుల వ్య‌వ‌ధిలోనే రెండు సార్లు ఐపీఎస్ ల బ‌దిలీలు జ‌రిగాయి. తొలిసారి ఐపీఎస్ ల బ‌దిలీల‌కు - తాజా బ‌దిలీల‌కు మ‌ధ్య గ్యాప్ కేవ‌లం 15 రోజులే కావ‌టం గ‌మ‌నార్హం. గ‌త నెల 30న జ‌గ‌న్ సీఎంగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేయగా... టీడీపీ అనుకూలంగా వ్య‌వ‌హ‌రించిన వారిని లూప్ లైన్ లో పెట్టే కార్య‌క్ర‌మానికి అంకురార్ప‌ణ జ‌రిగిపోయింది. సీఎంఓలో ఉన్న న‌లుగురు ఐఏఎస్ ల‌ను బ‌దిలీ చేసిన జ‌గ‌న్‌... ఈ నెల 5న 26 మంది ఐపీఎస్ ల‌ను బ‌దిలీ చేసి పారేశారు. ఈ బ‌దిలీల్లో టీడీపీకి బ‌హిరంగంగానే స‌హ‌క‌రించిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుతో పాటు నాడు ఇంటెలిజెన్స్ లో ప‌నిచేస్తున్న ఘ‌ట్ట‌మ‌నేని శ్రీ‌నివాస్ స‌హా ప‌లువురు ఐపీఎస్ ల‌కు స్థాన‌చ‌ల‌నం క‌లిగింది.

ఈ బ‌దిలీల‌కు అనుగుణంగా బ‌దిలీ అయిన అధికారులు త‌మ కొత్త స్థానాల్లో చేరడం - అక్క‌డి వాతావ‌ర‌ణానికి అల‌వాటు ప‌డేలోగానే తాజాగా మ‌రోమారు బ‌దిలీలు జ‌రిగాయి. తొలి సారి 26 మంది ఐపీఎస్ ల‌ను బ‌దిలీ చేసిన జ‌గ‌న్ స‌ర్కారు.... ఈ ద‌ఫా 22 మందిని బదిలీ చేసేసింది. ఈ బ‌దిలీల్లో ఇటీవ‌లే స్థానచల‌నం క‌లిగిన ఐదుగురి పేర్లు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. గ‌త బ‌దిలీల్లో లా అండ్ ఆర్డ‌ర్ విభాగంలో కో-ఆర్డినేష‌న్ ఐజీగా ఉన్న ఘ‌ట్ట‌మ‌నేని శ్రీనివాస్ ను అనంత‌పురం పీటిసీకి బదిలీ చేయ‌గా... ఈ ద‌ఫా అక్క‌డి నుంచి కూడా ఆయ‌న‌ను త‌ప్పించి వెయిటింగ్ లో పెట్టేశారు.

ఏబీతో పాటు ఘ‌ట్ట‌మ‌నేని కూడా టీడీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని - ఆయ‌న‌ను ఎన్నిక‌ల విధుల నుంచి త‌ప్పించాల‌ని ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక గ‌తంలో ట్రాన్స్ పోర్ట్ క‌మిష‌న‌ర్ గా ప‌నిచేసి టీడీపీ నేత‌ల దాడిలో వార్త‌ల్లోకెక్కిన మ‌రో సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి బాల‌సుబ్ర‌హ్మణ్యంను కూడా జ‌గ‌న్ స‌ర్కారు వెయిటింగ్ లోనే పెట్టేసింది. ఘ‌ట్ట‌మ‌నేనితో పాటు బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంల‌ను హెడ్ క్వార్ట‌ర్స్ లో రిపోర్ట్ చేయాల‌ని బ‌దిలీ ఉత్త‌ర్వుల్లో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం పేర్కొన్నారు. ఈ బ‌దిలీలో కొంద‌రు కీల‌క అధికారులకు ద‌క్కిన పోస్టింగ్ లు ఈ కింది విధంగా ఉన్నాయి.

రాష్ట్ర విపత్తుల - అగ్నిమాపక శాఖ డీజీ: ఏఆర్‌ అనురాధ

విశాఖ పోలీస్‌ కమిషనర్‌: ఆర్‌ కే మీనా

పీటీవో ఐజీ: సత్యనారాయణ

పోలీస్‌ పర్సనల్‌ ఐజీ: మహేశ్‌ చంద్ర లడ్డా

టెక్నికల్‌ సర్వీసెస్‌ డీఐజీ: జి. పాలరాజు

ఏపీఎస్సీ ఐజీ: శ్రీనివాసులు

గుంటూరు రేంజ్‌ ఐజీ: వినీత్‌ బ్రిజ్‌ లాల్‌

ఎస్ ఐబీ డీఐజీ: సీహెచ్‌ శ్రీకాంత్‌

విశాఖ రేంజ్‌ డీఐజీ: ఎకేవీ రంగారావు

పోలీసు పరిపాలన విభాగం ఏఐజీ: హరికృష్ణ