Begin typing your search above and press return to search.

అధికారికం: పాక్ కళాకారులపై నిషేధం!

By:  Tupaki Desk   |   30 Sep 2016 11:32 AM GMT
అధికారికం: పాక్ కళాకారులపై నిషేధం!
X
పాకిస్థానీ సినీ న‌టులు - సాంకేతిక నిపుణులు ఇక‌పై భార‌తీయ సినిమాల్లో న‌టించ‌కూడ‌దూ సినిమాకు సంబంధించిన ఏ విభాగంలోనూ ప‌నిచేయ‌డానికి వీల్లేదు. భార‌త్‌-పాకిస్థాన్ ల మ‌ధ్య నెల‌కొన్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టుగా ఇండియ‌న్ మోష‌న్ పిక్చ‌ర్ ప్రొడ్యూస‌ర్స్ అసోసియేష‌న్ (ఐ.ఎమ్‌.పి.పి.ఎ.) తెలిపింది. అయితే, ఇప్ప‌టికే చేసుకున్న ఒప్పందాల‌పై ఎలాంటి ప్ర‌భావం ఉండ‌ద‌ని కాస్త వెసులుబాటు క‌ల్పించింది.

ఉరి సెక్టార్ పై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు దాడి చేసిన ఘ‌ట‌న‌లో 18 మంది భార‌త జ‌వాన్లు వీర మ‌ర‌ణం పొందిన సంగ‌తి తెలిసిందే. ఈ జ‌వాన్ల‌కు నివాళులు అర్పిస్తూ తాజా నిర్ణ‌యం తీసుకున్న‌ట్టుగా ఐ.ఎమ్‌.పి.పి.ఎ. వ‌ర్గాలు చెప్పాయి. ఉగ్ర‌వాదుల దాడిని మ‌న‌దేశంలోని సినిమాల్లో న‌టిస్తున్న పాక్ న‌టులు ఎవ్వ‌రూ ఖండించ‌క‌పోవ‌డంపై ఐ.ఎమ్‌.పి.పి.ఎ. అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ఏ ఒక్క‌రూ ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి నోరు విప్ప‌క‌పోవ‌డంపై మండిప‌డింది. పాకిస్థాన్‌లోని పెషావార్ లో అప్ప‌ట్లో ఓ ఎటాక్ జ‌రిగితే చాలామంది చిన్నారులు మ‌ర‌ణించారనీ, ఆ సంద‌ర్భంలో ఐ.ఎమ్‌.పి.పి.ఎ. ఆ పిల్ల‌ల ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని నివాళులు అర్పించింద‌ని ఒక స‌భ్యుడు గుర్తు చేశాడు.

మ‌న‌దేశంలో ఉగ్ర‌వాదుల దాడుల వ‌ల్ల ఇంత‌మంది సైనికులు చనిపోతే క‌నీస మాన‌వ‌తా విలువ‌లు పాటించ‌కుండా పాక్ సినీ క‌ళాకారులు స్పందించ‌క‌పోవ‌డం దారుణం అని అన్నారు. మ‌న సినిమాల ద్వారా ల‌బ్ధి పొందుతున్న‌వారు ఇలాంటి సమ‌యంలో స్పందించ‌డం క‌నీస సంస్కారం అన్నారు. అందుకే, రెండు దేశాల మ‌ధ్యా సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొనే వ‌ర‌కూ ఈ నిషేధం కొన‌సాగుతుంద‌ని ఐ.ఎమ్‌.పి.పి.ఎ. స్ప‌ష్టం చేసింది. తాజా నిర్ణ‌యంతో పాకిస్థానీ న‌టుడు ఫ‌రాద్ ఖాన్ పై ప్ర‌భావం ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని చెబుతున్నారు. క‌ర‌ణ్ జోహార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ‘ఏ దిల్ హై ముష్కిల్’ చిత్రంలో ప్రాధాన పాత్ర పోషించాడు. ఇప్ప‌టికే ఫ‌రాద్‌పై మ‌హ‌రాష్ట్ర న‌వ‌నిర్మాణ సేన ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందుతున్న ‘రేయీస్’ చిత్రంపై కూడా తాజా నిర్ణయం ప్ర‌భావం ఉండొచ్చ‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ చిత్రం ద్వారా పాకిస్థానీ న‌టి మ‌హిర్ ఖాన్ హీరోయిన్ గా ప‌రిచ‌యం కాబోతోంది.