Begin typing your search above and press return to search.

ఐఏఎస్‌ ల‌కు ఇష్ట‌మైన ఇలాకాగా తెలంగాణ‌

By:  Tupaki Desk   |   23 Aug 2017 12:30 AM GMT
ఐఏఎస్‌ ల‌కు ఇష్ట‌మైన ఇలాకాగా తెలంగాణ‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు - టీఆర్ ఎస్ శ్రేణుల‌కు గొప్ప తీపిక‌బురు వంటి వార్త ఇది. ప‌రిపాల‌న‌లో కీల‌క‌మైన ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ (ఐఏఎస్‌) సర్వీసెస్‌ కు చెందిన పలువురు అధికారులు తెలంగాణాలో పనిచేసేందుకు ఇష్టపడుతున్నారని తెలుస్తోంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిపాల‌న తీరుతో పాటు ఇక్కడి భౌగోళిక పరిస్థితులతోపాటు పరిపాలనా పరంగా కొన్ని వెసులుబాట్లు ఉండటమే దానికి కారణమని ఆయా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పొరుగున ఉన్న ఏపీ కంటే తెలంగాణ‌కు వ‌చ్చేందుకు ఆస‌క్తి చూపించ‌డం నూత‌న మార్పున‌కు చిహ్న‌మ‌ని చెప్తున్నారు.

రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణాకు మొత్తం 32 మంది ఐఏఎస్‌ లను కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వీరిని ఒకేసారి కాకుండా దఫదఫాలుగా రాష్ట్రానికి పంపిస్తామని ఆ సందర్భంగా తెలిపింది. గతేడాది తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఇక్కడున్న ఐఏఎస్‌ లను జిల్లా కలెక్టర్లు - శాఖల డైరెక్టర్లు - కమిషనర్లుగా సర్దుబాటు చేసింది. సీనియర్లు ముఖ్య కార్యదర్శులుగా సేవలందిస్తున్నారు. ఇదే సమయంలో అదనంగా 20 మంది ఐఏఎస్‌ లను రాష్ట్రానికి కేటాయించాలని సీఎం కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత ఏపీకి కేటాయించబడిన వారితోపాటు మరికొందరు ఐఏఎస్‌ లు తెలంగాణాలో పనిచేసేందుకు ఇష్టపడుతున్నారని సమాచారం. మంత్రులతో సమానంగా ఐఏఎస్‌ లకు వాహన సదుపాయం - ఇతరత్రా సౌకర్యాలు కల్పించటంతో పాటు కలెక్టర్లకు పూర్తి స్వేచ్ఛనిస్తుండటం కూడా ఇందుకు కారణమని తెలిసింది.

ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి సీఎస్‌ గా డాక్టర్‌ రాజీవ్‌శర్మ నియమితులయ్యారు. ఆయన పదవీకాలం పూర్తయిన తర్వాత కూడా రెండుసార్లు పొడిగించారు. ఈ అంశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోడీతో మాట్లాడి మరీ ఒప్పించారు. ఆ తర్వాత ప్రదీప్‌ చంద్ర - ఆయన తర్వాత ఎస్పీ సింగ్‌ సీఎస్‌ లుగా నియమితులైనప్పటికీ రాజీవ్‌శర్మను మాత్రం సీఎం వదులుకోలేదు. ప్రభుత్వ సలహాదారుగా నియమించి కీలక స్థానం ఇవ్వ‌డ‌మే కాకుండా...ఎస్పీ సింగ్‌ సీఎస్‌ గా ఉన్నప్పటికీ రాజీవ్‌ శర్మ ఇచ్చే సూచనలు, సలహాలకే సీఎం ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని సమాచారం. గతంలో కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన రాజీవ్‌ శర్మ.. ఇప్పుడు కూడా ఆ సంబంధాలను కొన సాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతోపాటు రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న పథకాలకు కేంద్రం నుంచి నిధులను రాబట్టటం, వాటిని ఖర్చు చేయటం తదితర అంశాలను రాజీవ్‌ శర్మే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారని సమాచారం. కేంద్రంతో ఉన్న సంబంధాల రీత్యా ఇక్కడకు ఐఏఎస్‌ లను రప్పించే బాధ్యతను కూడా సీఎం రాజీవ్‌ శర్మకే అప్పగించారు.

మ‌రోవైపు ఈ నేపథ్యంలో వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులతో సంబంధం లేకుండా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) ఉన్నతాధికారులే వాటిపై సమీక్షలు - సంప్ర దింపులు కొనసాగిస్తున్నారు. ఈవిధంగా సీఎంవో నుండి కలె క్టర్లకు డైరెక్టుగా ఆదేశాలు వెళుతున్నాయని తెలిసింది. మరోవైపు తెలంగాణ ఏర్పడ్డాక జిల్లాల అభివృద్ధి నిధిని ఏర్పాటు చేశారు. వీటిపై సర్వాధికారాలు కలెక్టర్లకు కట్టబెట్టిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో పైస్థాయిలో సీఎంవో - కిందిస్థాయిలో కలెక్టర్లు కార్యకలాపాలు నిర్వర్తిస్తుండగా మధ్యలో ఉన్న ముఖ్య కార్యదర్శులు - డైరెక్టర్లు - కమిషనర్లు నిమిత్తమాత్రులు గా మిగిలిపోతున్నారనే వాదనలు వినబడుతున్నాయి. అయితే ఇదే అంశం రాష్ట్రంలో పనిచేసేందుకు కొంతమంది ఐఏఎస్‌ లు ఇష్టపడటానికి కూడా ఇదే కారణమని తెలిసింది. శాఖలకు డైరెక్టర్లుగా - కమిషనర్లుగా ఉంటే ఎలాంటి పని ఒత్తిడి లేకుండా ఉండొచ్చని వారు భావిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కార‌ణంగా ఐఏఎస్‌ లు తెలంగాణ వైపు మొగ్గు చూపించ‌డం సంతోష‌క‌ర‌మ‌ని టీఆర్ ఎస్ శ్రేణులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నాయి.